Share News

వడివడిగా రైతుభరోసా

ABN , Publish Date - Jul 02 , 2026 | 04:17 AM

వానాకాలం సీజన్‌కు సంబంధించి రైతుభరోసా నిధులు వేగంగా రైతుల ఖాతాలకు చేరుతున్నాయి. జూన్‌ 30న (మంగళవారం) శిల్పకళావేదికలో ...

వడివడిగా రైతుభరోసా

  • రైతుల ఖాతాల్లో నిధుల జమ .. 2 రోజుల్లో మూడెకరాల వరకు నగదు బదిలీ పూర్తి

  • 9రోజుల్లో పూర్తిచేసేలా ప్రభుత్వం ప్రణాళిక

  • ఇప్పటివరకు 4,072 కోట్లు ఖాతాల్లో జమ

  • సాగుకు పెట్టుబడి సమయంలోనే సాయం

  • హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు

హైదరాబాద్‌, జూలై 1 (ఆంధ్రజ్యోతి): వానాకాలం సీజన్‌కు సంబంధించి రైతుభరోసా నిధులు వేగంగా రైతుల ఖాతాలకు చేరుతున్నాయి. జూన్‌ 30న (మంగళవారం) శిల్పకళావేదికలో ఖరీఫ్‌ రైతుభరోసా నిధుల విడుదలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభించగా.. అదే రోజు మొదటి విడతగా రెండెకరాల వరకు భూమి కలిగి ఉన్న రైతులకు నిధులు విడుదల చేశారు. ఈ క్యాటగిరీలో 41.37 లక్షల మంది రైతులు ఉండగా.. రూ.2,482 కోట్లు విడుదల చేయడం గమనార్హం. వ్యవసాయ శాఖ ఇచ్చిన డేటా ప్రకారం ఆర్థికశాఖ నగదు బదిలీ చేయగా, బుధవారం ఉదయానికే రైతుల బ్యాంకు ఖాతాలకు నిధులు చేరుకున్నాయి. రైతుల ఫోన్లకు మెసేజ్‌లు కూడా వచ్చాయి. బుధవారం రెండో విడతగా 10.68 లక్షల మంది రైతులకు నగదు బదిలీ చేశారు. మూడెకరాల వరకు భూమి ఉన్న రైతులకు రూ.1,590 కోట్లు విడుదల చేశారు. దీంతో ఇప్పటివరకు 54.96 లక్షల మంది రైతులకు చెందిన 67.87 లక్షల ఎకరాలకు రూ.6 వేల చొప్పున చెల్లింపులు పూర్తయ్యాయి. బుధవారం నాటికి రూ.4,072 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. కాగా, ప్రభుత్వం ఖరీఫ్‌ రైతుభరోసా చెల్లింపులను 9 రోజుల్లో పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. గతేడాది ఖరీఫ్‌ సీజన్‌లో కూడా తొమ్మిది రోజుల్లోనే రైతుభరోసా చెల్లింపులు పూర్తిచేసింది. ఈసారి కూడా అదే పద్ధతిలో 9 రోజుల్లో పూర్తిచేసేందుకు నిధుల సమీకరణ చేపట్టింది.


కోటిన్నర ఎకరాలకు సాయం..

రాష్ట్రవ్యాప్తంగా 73.32 లక్షల మంది పట్టాదారులు ఉన్నారు. కోటిన్నర ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఈ మొత్తానికి ఎకరానికి రూ.6 వేల చొప్పున పంపిణీ చేసేందుకు రూ.9 వేల కోట్ల నిధులు అవసరమవుతాయి. వీటిని విడతల వారీగా రైతులకు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ క్రమంలోనే జూన్‌ 30న మొదటి రోజు రెండెకరాల వరకు చెల్లింపులు చేసింది. రెండో విడతలో రెండెకరాల నుంచి మూడెకరాల వరకు భూమి ఉన్న రైతులకు చెల్లింపులు చేసింది. ఇదే పద్ధతితో రోజుకో ఎకరం చొప్పున పెంచుతూ పోవాలని నిర్ణయించింది. మూడో రోజు 3 నుంచి 4 ఎకరాలకు, నాలుగో రోజు 4 నుంచి 5 ఎకరాలకు, ఐదో రోజు 5 నుంచి 6 ఎకరాలకు, ఆరో రోజు 6 నుంచి 7 ఎకరాలకు, ఏడో రోజు 7 నుంచి 8 ఎకరాలకు, ఎనిమిదో రోజు 8 నుంచి 9 ఎకరాలకు నగదు బదిలీ చేసేలా షెడ్యూలు రూపొందించారు. ఆ తర్వాత చివరి రోజున 10 ఎకరాల నుంచి ఎగువన ఉన్న మొత్తం విస్తీర్ణానికి ఒకేరోజు చెల్లింపులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

సరిగ్గా పెట్టుబడి సమయంలోనే..

ఖరీఫ్‌ సాగుకు రైతులు ఇటీవలే శ్రీకారం చుట్టారు. ్గ ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం రైతుభరోసా నిధులు విడుదల చేస్తోంది. దీంతో పంటల సాగుకు పెట్టుబడి పెట్టే సమయంలోనే ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందుతోందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Jul 02 , 2026 | 04:17 AM