మాది చేతల ప్రభుత్వం
ABN , Publish Date - Jul 10 , 2026 | 06:00 AM
‘రాష్ట్ర ప్రభుత్వంపైన విమర్శలు చేస్తున్న పార్టీల వారు తిరిగి అధికారంలోకి వచ్చేది లేదు.. చేసేదీ లేదు. గతంలో పదేళ్లు పాలించిన వారివన్నీ మాటలే..
పదేళ్లు పాలన చేసినవారివి మాటలే
రైతుల ఖాతాల్లో నేడు మరో 1,009 కోట్లు
వానాకాలం రైతు భరోసా నిధుల జమ పూర్తి
ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
వృత్తుల కన్నావ్యవసాయం మిన్న: తుమ్మల
నేడు ఖమ్మం జిల్లాకు సీఎం రేవంత్‌రెడ్డి
రైతు ఆశీర్వాద సభకు సర్వం సిద్ధం
ఖమ్మం/చింతకాని(ఆంధ్రజ్యోతి), జూలై 9: ‘రాష్ట్ర ప్రభుత్వంపైన విమర్శలు చేస్తున్న పార్టీల వారు తిరిగి అధికారంలోకి వచ్చేది లేదు.. చేసేదీ లేదు. గతంలో పదేళ్లు పాలించిన వారివన్నీ మాటలే.. కానీ ప్రజాప్రభుత్వానివన్నీ చేతలే. అందుకే 9 రోజుల్లో రూ.9 వేల కోట్లు రైతుల ఖాతాలో జమ చేసిన దేశంలో ఏకైక ప్రభుత్వంగా.. ప్రజాప్రభుత్వం నిలుస్తుంది’ అని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. రైతు భరోసా విజయోత్సవాల్లో భాగంగా ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం చింతకాని మండలం జగన్నాథపురంలో శుక్రవారం రైతు ఆశీర్వాద సభ జరగనుంది. దీనికి సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. అదే ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మెగా రైతు మేళాను గురువారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. రైతు మేళా సభలో, చింతకాని మండలం లచ్చగూడెంలో భట్టి విక్రమార్క విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కష్టాలు ఎదురైనా రైతుల సంక్షేమం విషయంలో ప్రత్యేక శ్రద్ధతో పనిచేస్తోందని, విత్తనం వేసినప్పటి నుంచి పంట కొనుగోలు వరకు రైతులకు అండగా నిలుస్తోందన్నారు. దశాబ్దాల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వాలు నిర్మించిన నాగార్జున సాగర్, శ్రీరాంసాగర్, కడెం లాంటి ప్రాజెక్టులు నేటికీ రైతులకు సాగునీటిని అందిస్తున్నాయని.. గత ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం కుంగిపోడడం ఆ ప్రభుత్వ పాలనకు నిదర్శనమని విమర్శించారు. శుక్రవారం రైతు ఆశీర్వాద సభా వేదిక నుంచి రైతు భరోసాలో భాగంగా మిగిలిన రూ.1,009కోట్లను విడుదల చేస్తామని ప్రకటించారు.
దాంతో వానాకాలానికి సంబంధించిన రైతు భరోసా నిధుల జమ ప్రక్రియ పూర్తవుతుందని వెల్లడించారు. రైతు భరోసా కింద ఇప్పటివరకు రూ.8,759కోట్లు విడుదల చేశామని, రైతు ఆశీర్వాదసభలో మిగిలిన సొమ్మునూ విడుదల చేస్తామన్నారు. తద్వారా 9 రోజుల్లో రూ.9వేల కోట్లను రైతుల ఖాతాల్లో జమచేసినట్లు అవుతుందని వివరించారు. మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. ప్రపంచంలో వ్యవసాయానికి మించిన వృత్తి మరేదీ లేదని, తెలంగాణ రైతులు పంటల సాగు, ఉత్పత్తిలో ప్రపంచ రైతులతో పోటీ పడేస్థాయికి ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. రైతు సంక్షేమం కోసం ఎన్ని వేల కోట్లైనా ఖర్చుచేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
రైతు ఆశీర్వాద సభకు సర్వం సిద్ధం
వానాకాలం పంట సాగుకోసం రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది రోజుల్లో రూ.9వేల కోట్లు జమచేస్తున్న నేపథ్యంలో శుక్రవారం జగన్నాథపురంలో రైతు ఆశీర్వాదసభను పండుగలా నిర్వహించబోతున్నారు. సభకు సీఎం రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితర మంత్రులు హాజరుకానున్నారు. సభ కోసం జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. సభాస్థలి వద్దే ప్రత్యేక హెలిప్యాడ్‌ను, సభకు 2లక్షల మంది హాజరవుతారన్న అంచనాలతో ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి లక్ష మంది రైతులు, 50వేల మంది డ్వాక్రా మహిళలు వచ్చేలా 3,500 ఆర్టీసీ బస్సులనను ఏర్పాటు చేశారు.