Share News

ఆర్టీసీ కార్మికులకు జూలై 1 నుంచి పెంచిన వేతనాలు

ABN , Publish Date - May 22 , 2026 | 04:37 AM

ఆర్టీసీ కార్మికులకు 2021 వేతన సవరణ ప్రకారం 11 శాతం ఫిట్‌మెంట్‌తో కలిపి జూలై 1న వేతనాలు చెల్లించాలని యాజమాన్యం నిర్ణయించింది.

ఆర్టీసీ కార్మికులకు జూలై 1 నుంచి పెంచిన వేతనాలు

  • 11 శాతం ఫిట్‌మెంట్‌తో చెల్లించేందుకు యాజమాన్యం అంగీకారం

హైదరాబాద్‌, మే 21 (ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ కార్మికులకు 2021 వేతన సవరణ ప్రకారం 11 శాతం ఫిట్‌మెంట్‌తో కలిపి జూలై 1న వేతనాలు చెల్లించాలని యాజమాన్యం నిర్ణయించింది. తార్నాకలోని ఆర్టీసీ ఆస్పత్రిలో విశ్రాంత ఆర్టీసీ ఉద్యోగుల వైద్య ఖర్చులకు ప్రస్తుతం చెల్లిస్తున్న రూ. 4 లక్షలను రూ. 6 లక్షలకు పెంచింది. కార్మిక జేఏసీ నాయకులతో ఆర్టీసీ యాజమాన్యం గురువారం సమావేశమై పలు అంశాలపై చర్చలు జరిపింది. కార్మిక సంఘాలు తమ ముందుంచిన పలు అంశాలకు ఆమోదం తెలపడంతో పాటు మరికొన్నింటిని ఆర్టీసీ ఎండీ, ప్రభుత్వంతో చర్చించిన తర్వాత పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. కారుణ్య నియామకాల కింద బ్రెడ్‌ విన్నర్‌ స్కీంలో ప్రస్తుతం పనిచేస్తున్న వారందరిని రెగ్యులర్‌ చేయడానికి యాజమాన్యం అంగీకరించింది. జూనియర్‌ అసిస్టెంట్‌ పరీక్షల్లో పాస్‌ అయిన వారందరికీ త్వరలో పోస్టింగ్స్‌ ఇచ్చేందుకు యాజమాన్యం ఆమోదం తెలిపింది. విశ్రాంత ఉద్యోగులకు 2017 వేతన సవరణ బకాయిలను దశలవారీగా చెల్లించేందుకు ప్రభుత్వం నుంచి రుణం పొందాలని అధికారులు నిర్ణయించారు. ఆర్టీసీ సిబ్బంది తల్లిదండ్రులకు కార్పొరేట్‌ ఆస్పత్రిలో వైద్యం చేయించేందుకు సంస్థ ఎండీతో చర్చించి తమ నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

Updated Date - May 22 , 2026 | 04:37 AM