Share News

బస్సులు బంద్‌!

ABN , Publish Date - Apr 22 , 2026 | 04:06 AM

ప్రగతి రథ చక్రంగా పిలుచుకునే రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) బస్సు మరోసారి నిలిచిపోయింది. సమస్యల పరిష్కారం కోసం నాలుగు వారాలు సమయం ....

బస్సులు బంద్‌!

  • సమస్యలు పరిష్కరించాలంటూ ఆర్టీసీ జేఏసీ సమ్మె బాట

  • సచివాలయంలో సుదీర్ఘ చర్చలు విఫలం

  • 4 వారాల గడువు కోరిన అధికారుల కమిటీ.. అంగీకరించని ఆర్టీసీ జేఏసీ

  • అర్ధరాత్రి నుంచే బస్సుల నిలిపివేత

  • 65 లక్షల మంది ప్రయాణికులకు తిప్పలు

  • ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై సర్కారు దృష్టి

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి): ప్రగతి రథ చక్రంగా పిలుచుకునే రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) బస్సు మరోసారి నిలిచిపోయింది. సమస్యల పరిష్కారం కోసం నాలుగు వారాలు సమయం ఇవ్వాలన్న ప్రభుత్వ ఉన్నతాధికారుల కమిటీ ప్రతిపాదనను ఆర్టీసీ జేఏసీ తిరస్కరించింది. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ మంగళవారం అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి దిగింది. దీనితో విద్యార్థులు, ఉద్యోగులు, ఇతర ప్రయాణికుల ఇబ్బంది తప్పని పరిస్థితి నెలకొంది. సమ్మె నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపైనా ప్రభుత్వం దృష్టిసారించింది. రద్దీ మార్గాల్లో అద్దె బస్సులు నడపాలని, ప్రైవేటు వాహనాలు అధిక ధరలు వసూలు చేయకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది.

సుదీర్ఘంగా చర్చలు జరిగినా..

రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నలుగురు ఐఏఎస్‌ అధికారుల కమిటీ మంగళవారం సాయంత్రం సచివాలయంలో ఆర్టీసీ జేఏసీ నాయకులతో భేటీ అయింది. సుమారు నాలుగు గంటలపాటు సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. జేఏసీ డిమాండ్‌ చేసిన అంశాలను క్షుణ్నంగా పరిశీలించిన అధికారులు.. సమస్యల పరిష్కారానికి నాలుగు వారాల గడువు కావాలని, అప్పటివరకు సమ్మె వాయిదా వేయాలని కోరారు. కానీ గడువు ఇచ్చేందుకు జేఏసీ నాయకులు నిరాకరించారని, అధికారులు రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్‌తో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితి వివరించారని తెలిసింది. సచివాలయం నుంచి బయటికి వచ్చిన ఆర్టీసీ జేఏసీ నేతలు.. చర్చలు విఫలమయ్యాయని, సమ్మెలోకి వెళ్తున్నామని రాత్రి 9 గంటల తర్వాత ప్రకటించారు. ప్రభుత్వం ముందు కొత్త డిమాండ్లు ఏమీ పెట్టలేదని, ఎన్నికల ముందు కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలను అమలు చేయాలని మాత్ర మే కోరుతున్నామని జేఏసీ నాయకులు తెలిపారు. కాగా, ఆర్టీసీ సొంత, అద్దె బస్సులు కలిపి సుమారు 10 వేల బస్సులు నడిపిస్తోంది. రోజు సగటున 65 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. అందులో అత్యధికంగా హైదరాబాద్‌లోనే 25 లక్షల మందికిపైగా ప్రయాణిస్తుంటారు. వీరందరిపైనా సమ్మె ప్రభావం పడే అవకాశం ఉంది. మరోవైపు గతంలో సమ్మె సమయంలో ఎదురైన ఇబ్బందుల నేపథ్యంలో.. కొందరు సిబ్బంది సమ్మెకు దూరంగా ఉండాలని నిర్ణయించినట్టు సమాచారం. ఈ క్రమంలో అద్దె బస్సులు, ఎలక్ట్రిక్‌ బస్సులు నడిచే అవకాశం ఉంది. అయితే సమ్మెను కాదని ఏ బస్సు రోడ్డెక్కినా అడ్డుకుంటామని ఆర్టీసీ జేఏసీ నాయకులు ప్రకటించారు. సమ్మె విరమణకు సంబంధించి జేఏసీ నాయకులతో బుధవారం మరోసారి అధికారుల కమిటీ చర్చలు జరగనున్నాయి.


తెలంగాణలో సమ్మె రెండోసారి

సమస్యల పరిష్కారం కోరుతూ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగడం తెలంగాణ రాష్ట్రంలో ఇది రెండోసారి. 2019లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ కార్మికులు ఏకంగా 55రోజుల పాటు సమ్మె చేశారు. ఆ సమ్మెలో పాల్గొన్న కార్మికులపై బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. తాజాగా కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మరోసారి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు.

పరిష్కరిస్తాం.. సమ్మె వద్దు: మంత్రి పొన్నం

ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిశీలించి, పరిష్కరించేందుకు అధికారుల కమిటీ ఏర్పాటు చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. ‘‘ఆర్టీసీలో పలు సమస్యలపై ప్రభుత్వానికి వినతులు అందాయి. వాటిని క్షుణ్నంగా పరిశీలించిన అనంతరం తగిన సిఫార్సులు చేసేందుకు ప్రభుత్వం సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసింది. నిత్యం 65 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తుంటారు. అందులో చాలా మంది విద్యార్థులు, గ్రామీణ ప్రాంత పేద ప్రజలే. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. సమ్మె వద్దు’’ అని విజ్ఞప్తి చేశారు. కాగా, కార్మికుల డిమాండ్లలో కొన్ని ఆర్థికపరమైన, సంక్లిష్ట అంశాలు ఉన్నాయని.. వాటిని లోతుగా పరిశీలిం చి పరిష్కరించేందుకు సమయం పడుతుందని ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి చెప్పారు. అందుకే 4 వారాలు గడువు కోరామని తెలిపారు. కానీ కొన్ని సంఘాలు వాస్తవాలను విస్మరించి, కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆరోపించారు. సంస్థ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కార్మికులం తా విధులకు హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు.

డిమాండ్లన్నీ పరిష్కారమయ్యే వరకు సమ్మె: జేఏసీ ఛైర్మన్‌

ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, కార్మిక సంఘాల పునరుద్ధరణ, ఎన్నికలు సహా మొత్తం 32 సమస్యలు పరిష్కారమయ్యే వరకు సమ్మె కొనసాగుతుందని ఆర్టీసీ జేఏసీ చైర్మన్‌ ఈదువు వెంకన్న ప్రకటించారు. సమ్మె నోటీసు ఇచ్చిన 41 రోజుల తర్వాత ప్రభుత్వం చర్చలకు పిలిచిందని చెప్పారు. అది కూడా ఐఏఎస్‌ అధికారులతో కమిటీ వేసి చర్చలు అనడం సరికాదని పేర్కొన్నారు. తాము ఎవరి ఒత్తిడికీ తలొగ్గబోమన్నారు. అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను కాంగ్రెస్‌ ప్రభుత్వం విస్మరించిందని వెంకన్న విమర్శించారు. దీనితో తప్పనిసరి పరిస్థితుల్లోనే సమ్మె చేస్తున్నామన్నారు. ఆర్టీసీని నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. సమస్యలను పరిష్కరించకుండా కాలయాపన చేసేందుకే ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసిందని మండిపడ్డారు.

Updated Date - Apr 22 , 2026 | 05:46 AM