Share News

త్వరలో ‘‘ఆర్టీసీ ఎఫ్‌ఎం రేడియో’’

ABN , Publish Date - May 31 , 2026 | 05:24 AM

ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ స్వాగతం పలుకుతోంది. ఇప్పుడు మీరు వినబోయే పాట...’’ ఆర్టీసీ బస్సు ఎక్కగానే ఇలా ఎవరైనా స్వాగతం పలికి మంచి పాట వినిపిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి...

త్వరలో ‘‘ఆర్టీసీ ఎఫ్‌ఎం రేడియో’’

‘‘ ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ స్వాగతం పలుకుతోంది. ఇప్పుడు మీరు వినబోయే పాట...’’ ఆర్టీసీ బస్సు ఎక్కగానే ఇలా ఎవరైనా స్వాగతం పలికి మంచి పాట వినిపిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. . ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణాన్ని ఆహ్లాదకరంగా మార్చేందుకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) వినూత్న కార్యక్రమం చేపట్టబోతుంది. ‘ఆర్టీసీ ఎఫ్‌ఎం రేడియో’ సేవలను ప్రారంభించే దిశగా అడుగులు వేస్తోంది. బస్సుల్లో ప్రయాణించే సమయంలో ప్రయాణికులకు సినిమా పాటలు, జానపద గీతాలు, వార్తలు, ట్రాఫిక్‌ సమాచారం, ప్రజా అవగాహన కార్యక్రమాలు వంటి అనేక అంశాలను ‘ఆర్టీసీ ఎఫ్‌ఎం’తో వినిపించేందుకు ప్రణాళికలు చేస్తోనట్టు తెలిసింది. అలాగే, రహదారి భద్రత, ఆరోగ్య సూచనలు, ప్రభుత్వ పథకాల సమాచారం, తెలంగాణలోని పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాల సమాచారాన్ని ఎఫ్‌ఎం రేడియోలో వినిపించనున్నారు. అలాగే, ఆర్టీసీ బస్సులో ప్రయాణం ఎంత సురక్షితమో తెలియజేసేందుకు కొన్ని సార్లు ప్రయాణికులతో ప్రత్యక్ష సంభాషణలు, డ్రైవర్‌, కండక్టర్‌ అనుభవాలను కూడా ప్రసారం చేయాలని భావిస్తున్నారు. ఈ ఎఫ్‌ఎం సేవల ద్వారా ఆర్టీసీ బస్సుల సేవలు ప్రజలకు మరింత దగ్గరవుతాయని సంస్థ అధికారులు భావిస్తున్నారు. అలాగే, ఆర్టీసీ ఎఫ్‌ఎంలో వాణిజ్య ప్రకటనల ద్వారా సంస్థకు అదనపు ఆదాయం కూడా సమకూరనుంది. ఇప్పటికే ఈ తరహా ఎఫ్‌ఎం సేవలు ఆంధ్రప్రదేశ్‌తోపాటు మరికొన్ని రాష్ట్రాల్లో అమల్లో ఉన్నాయి. ‘‘ఆర్టీసీ ఎఫ్‌ఎం రేడియో అంశం ప్రాథమిక దశలో ఉంది. దీనిపై పూర్తిస్థాయిలో చర్చ, అధ్యయనం జరిగిన తర్వాత కొలిక్కి రానుంది.’’ అని ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

Updated Date - May 31 , 2026 | 05:24 AM