Share News

ఆర్టీసీ ఇకపై ప్రజా రవాణా విభాగం!

ABN , Publish Date - Apr 26 , 2026 | 04:27 AM

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ ఆర్టీసీ) ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ మొదలైంది. మంత్రివర్గ ఉపసంఘం, నిపుణుల కమిటీ ఏర్పాటు చేసి వీలైనంత...

ఆర్టీసీ ఇకపై ప్రజా రవాణా విభాగం!

  • ప్రభుత్వ ఉద్యోగులుగా 38,300 మంది ఆర్టీసీ సిబ్బంది

  • ప్రభుత్వంపై ఏటా సుమారు రూ.వెయ్యి కోట్ల భారం

  • యూనియన్‌ ఎన్నికలపై వచ్చే వారం కార్మిక శాఖకు లేఖ

  • ఆస్తులు ఆర్టీసీ ఆధీనంలోనే.. విలీనంపై కార్మికుల వేడుకలు

  • కార్మికుల చిరకాల స్వప్నాన్ని నెరవేర్చాం: మంత్రి పొన్నం

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 25(ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ ఆర్టీసీ) ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ మొదలైంది. మంత్రివర్గ ఉపసంఘం, నిపుణుల కమిటీ ఏర్పాటు చేసి వీలైనంత త్వరగా ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ ప్రక్రియ తర్వాత ఆర్టీసీ.. ప్రజా రవాణా విభాగం (పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ డిపార్ట్‌మెంట్‌)గా మారనుంది. దేశంలో పంజాబ్‌, హరియాణా, ఆంధ్రప్రదేశ్‌ తర్వాత నాలుగో రాష్ట్రంగా తెలంగాణలో ఈ విలీనం జరగనుంది. దీంతో 38,300 మంది ఆర్టీసీ సిబ్బంది ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు పొందనున్నారు. తద్వారా వారికి ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా పూర్తిస్థాయి ఉద్యోగ భద్రత, వేతన సవరణలు, పదవీ విరమణ ప్రయోజనాలు లభిస్తాయి. విలీనంతో ప్రభుత్వంపై ఏటా సుమారు వెయ్యి కోట్ల భారం పడనుంది. ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనమైనా కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఆర్టీసీ ఆస్తులన్నీ సంస్థ ఆధీనంలోనే ఉంటాయి. వాటిని ప్రభుత్వం ఆదాయ వనరులుగా మార్చుకునేందుకు నిర్ణీత కాలానికి లీజుకు ఇచ్చే అవకాశం ఉంటుంది.

ఏపీలో జీతాలు పెరిగింది ఇలా...

ఆంధ్రప్రదేశ్‌ రోడ్డు రవాణా సంస్థ ప్రభుత్వంలో విలీనం తర్వాత మెజారిటీ ఉద్యోగుల వేతనాల్లో పెరుగుదల నమోదైంది. విలీనానికి ముందు, ఆ తర్వాత మూల వేతనాలు పరిశీలిస్తే... శ్రామిక్‌ జీతం రూ.16,890 నుంచి రూ. 20 వేలకు పెరిగింది. కండక్టర్‌ వేతనం రూ.19,580 నుంచి రూ.25,220కు, డ్రైవర్‌ గ్రేడ్‌-2 వేతనం రూ.21,390 నుంచి రూ.27,500కు, జూనియర్‌ అసిస్టెంట్‌ వేతనం రూ.21,670 నుంచి రూ.25,220కు, మెకానిక్‌ వేతనం రూ.20,200 నుంచి రూ.25,280, ఆర్టీసీ కానిస్టేబుల్‌ వేతనం రూ.19,580 నుంచి రూ.23,780కు, అసిస్టెంట్‌ మేనేజర్‌ వేతనం రూ.41,140 నుంచి రూ.48,440కి పెరిగింది. తెలంగాణలోనూ విలీనం తర్వాత ఆర్టీసీ ఉద్యోగుల వేతనాల్లో పెరుగుదల నమోదు కానుంది. అయితే సంస్థ నుంచి సిబ్బందికి అందుతున్న బోనస్‌, ఓవర్‌ టైం వేతనం, ఈఎ్‌సఐ సహా మోటారు వాహనాల చట్టం ప్రకారం అందే ప్రయోజనాల్లో కొన్ని వర్తించవు. ఆర్టీసీలో యూనియన్ల పునరుద్ధరణ, ఎన్నికల నిర్వహణకు కూడా ప్రభుత్వం అంగీకరించింది. వచ్చే వారం యూనియన్‌ నాయకులతో ఆర్టీసీ బోర్డు సమావేశమై అనంతరం ఎన్నికల నిర్వహణపై కార్మిక శాఖకు లేఖ రాయనున్నట్లు సమాచారం. అయితే నిబంధల ప్రకారం ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనం అయ్యే వరకే యూనియన్లు మనుగడలో ఉంటాయని సీనియర్లు చెబుతున్నారు. విలీన ప్రక్రియ పూర్తయితే యూనియన్లు కొనసాగవని, అసోసియేషన్లు పనిచేస్తాయంటున్నారు. యూనియన్ల తరహాలో అసోసియేషన్లు పనిచేసేందుకు చట్టపరంగా అవకాశం లేకుండా పోతుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు

తమ డిమాండ్లు పరిష్కారం కావడంతో ఆర్టీసీ కార్మికులు శనివారం రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు నిర్వహించారు. సీఎం రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ చిత్రపటాలకు పాలాభిషేకలు నిర్వహించారు. చర్చల సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు వీలైనంత త్వరగా అయలయ్యేలా చూడాలని కోరారు.

చరిత్రాత్మక నిర్ణయం: మంత్రి పొన్నం

ఆర్టీసీ కార్మికులకు ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను తమ ప్రభుత్వం అమలు చేస్తోందని రవాణా శాఖ మం త్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. వారి చిరకాల స్వప్నాన్ని నేరవేరుస్తూ చరిత్రాత్మక నిర్ణయం తీసుకుందన్నారు. ఆర్టీసీ సమ్మె విరమణ, చర్చలు, ప్రభుత్వ నిర్ణయాలపై డీసీసీ అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్‌ చైర్మన్లు, అధికార ప్రతినిధులతో పొన్నం శనివారం జూమ్‌ సమావేశం నిర్వహించారు. విలీనం, కార్మిక సంఘాల ఎన్నికలు, 11 శాతం పీఆర్సీ ప్రకటనపై ఆర్టీసీ కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. వారితో కలిసి పార్టీ క్యాడర్‌ సంబరాలు నిర్వహించాలన్నారు. గత ప్రభుత్వంలో 55 రోజుల సమ్మె చేసినా ఒక్క హామీ నెరవేర్చలేదని, 30 మందికి పైగా మరణించారన్నారు. ‘కార్మికులతో మనకు శత్రుత్వం లేదు. వారు మన కుటుంబసభ్యులు. ఆత్మహత్య చేసుకున్న శంకర్‌గౌడ్‌ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంద’ని చెప్పారు.

Updated Date - Apr 26 , 2026 | 04:27 AM