Share News

Telangana RTC: తెలంగాణ ఆర్టీసీపై సంక్రాంతి భారం!

ABN , Publish Date - Jan 08 , 2026 | 03:36 AM

సంక్రాంతి పండుగ వచ్చిందంటే హైదరాబాద్‌ నగరం సగం ఖాళీ అవుతుంది. ఇక్కడ నివాసముండే ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారంతా పండుగకు ఏపీ బాట పట్టడం, తెలంగాణకు చెందినవారూ సొంతూళ్లకు వెళ్లడమే ఇందుకు.....

Telangana RTC: తెలంగాణ ఆర్టీసీపై సంక్రాంతి భారం!

  • ఈసారి ప్రత్యేక బస్సులను తగ్గించిన ఏపీ

  • గతేడాది 2వేల బస్సులు.. ఈసారి 200 బస్సులకే పరిమితమైన ఏపీఎస్‌ఆర్టీసీ

  • టీజీఎస్‌ఆర్టీసీ నుంచి బస్సులను పెంచాలని ఏపీ సూచన

  • టీజీఎ్‌సఆర్టీసీ 6,431 ప్రత్యేక బస్సులు

  • పండగ రద్దీని సొమ్ము చేసుకుంటున్న ప్రైవేటు ట్రావెల్స్‌ యాజమాన్యాలు

  • టికెట్‌ ధరలు 3,4 రెట్లు పెంచి వసూలు

హైదరాబాద్‌, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): సంక్రాంతి పండుగ వచ్చిందంటే హైదరాబాద్‌ నగరం సగం ఖాళీ అవుతుంది. ఇక్కడ నివాసముండే ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారంతా పండుగకు ఏపీ బాట పట్టడం, తెలంగాణకు చెందినవారూ సొంతూళ్లకు వెళ్లడమే ఇందుకు కారణం. దీనికి అనుగుణంగా రెండు రాష్ట్రాల రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)లు ప్రతిసారీ పెద్ద సంఖ్యలో స్పెషల్‌ బస్సులను నడుపుతుంటాయి. అయితే ఈసారి సంక్రాంతికి ఏపీఎస్‌ ఆర్టీసీ స్పెషల్‌ బస్సుల సంఖ్యను తగ్గించింది. దీంతో తెలంగాణ ఆర్టీసీపై అదనపు బస్సుల భారం పడనుంది. అదే సమయంలో సంస్థకు అదనపు ఆదాయం కూడా సమకూరనుంది. తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ మహాలక్ష్మి పథకం పేరుతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించినట్లే.. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కూడా ఆ రాష్ట్రంలో ‘స్త్రీ శక్తి’ పేరుతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తోంది. దీంతో ఏపీ వ్యాప్తంగా సంక్రాంతికి బస్సుల్లో మహిళా ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండనుంది. దీంతో వారికి తగినన్ని బస్సులను అందుబాటులో ఉంచేందుకుగాను.. ఈసారి తెలంగాణ నుంచి ఏపీకి నడిపే ప్రత్యేక బస్సుల్ని ఏపీఎ్‌సఆర్టీసీ తగ్గించింది. గత సంక్రాంతికి తెలంగాణ నుంచి 2వేల స్పెషల్‌ సర్వీసులను నడిపిన ఆ సంస్థ.. ఈసారి కేవలం 200 స్పెషల్‌ బస్సులకు మాత్రమే పరిమితమైంది. ఈ విషయమై తెలంగాణ ఆర్టీసీకి.. ఏపీఎస్‌ ఆర్టీసీ అధికారులు సమాచారం అందించారు. తాము ఎక్కువ బస్సులు నడపడం లేదని, టీజీఎ్‌సఆర్టీసీ అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. దీంతో ఏపీకి వెళ్లే ప్రయాణికుల కోసం తెలంగాణ ఆర్టీసీ స్పెషల్‌ బస్సుల సంఖ్యను పెంచింది. మరోవైపు తెలంగాణకు చెందిన మహిళలకు రాష్ట్ర ప్రభుత్వ మహాలక్ష్మి పథకంలో భాగంగా సంక్రాంతికి నడిపే పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో ఉచిత బస్సు రవాణా సౌకర్యం యథావిధిగా అమల్లో ఉండనుంది. ఇక హైదరాబాద్‌ సహా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి ఏపీకి వెళ్లే తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో ఇప్పటికే చాలావరకు టిక్కెట్లు అమ్ముడుపోయాయి. ఆన్‌లైన్‌లో టిక్కెట్లు బుక్‌ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న వారికి ‘సోల్డ్‌ అవుట్‌’ అని కనిపిస్తోంది. చాలావరకు సర్వీసుల్లో ఒకటి, రెండు సీట్లు మాత్రమే మిగిలాయి. చాలా బస్సుల్లో 10లోపే సీట్లు అందుబాటులో ఉన్నాయి.


6,431 స్పెషల్‌ బస్సులు.. 1.5 శాతం అదనపు చార్జీలు

సంక్రాంతి పండుగకు మొత్తం 6,431 ప్రత్యేక బస్సులను నడపాలని టీజీఎ్‌సఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. ప్రధానంగా జనవరి 9, 10, 12, 13 తేదీల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. దీంతో ఆయా రోజుల్లో రద్దీ మేరకు ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచేలా ఆర్టీసీ ప్లాన్‌ చేసింది. అలాగే జనవరి 18, 19 తేదీల్లో తిరుగు ప్రయాణ రద్దీకి సంబంధించి తగిన ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్‌లో రద్దీ ప్రాంతాలైన ఎంజీబీఎస్‌, జేబీఎస్‌, ఉప్పల్‌ క్రాస్‌ రోడ్స్‌, ఆరాంఘర్‌, ఎల్బీనగర్‌ క్రాస్‌రోడ్స్‌, కేపీహెచ్‌బీ, బోయిన్‌పల్లి, గచ్చిబౌలి తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను తెలంగాణ ఆర్టీసీ నడపనుంది. ఆయా ప్రాంతాల్లో ప్రయాణికుల సౌకర్యార్థం పండల్స్‌, షామియానాలు, కుర్చీలు, పబ్లిక్‌ అడ్రస్‌ సిస్టం, తాగునీటి సదుపాయం, మొబైల్‌ టాయిలెట్లను ఏర్పాటు చేయనుంది. ఇక పండుగకు నడిపే స్పెషల్‌ బస్సుల్లో తిరుగు ప్రయాణంలో ప్రయాణికుల రద్దీ ఏమాత్రం ఉండే అవకాశం లేకున్నా.. ఆ బస్సులను త్వరతగతిన వెనక్కి రప్పించనుంది. రద్దీ ఉన్న రూట్లలో ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా వీటిని ఆయా రూట్లలో నడిపించనుంది. కాగా, స్పెషల్‌ బస్సులకు అయ్యే కనీస డీజిల్‌ ఖర్చులు, నిర్వహణ మేరకు టికెట్‌ ధరను సవరించుకోవాలని 2003లో జీవో నంబర్‌ 16ను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో నడిపే స్పెషల్‌ బస్సుల్లో 1.5 శాతం వరకు అదనపు టికెట్‌ ధరలను సవరించుకునే వెసులుబాటును సంస్థకు ఇచ్చింది. ఆ జీవో ప్రకారం ప్రతి ప్రధాన పండుగకు 1.5 శాతం వరకు టికెట్‌ ధరలను ఉమ్మడి కార్పొరేషన్‌గా ఉన్నప్పటి నుంచీ ఆర్టీసీ అమలు చేస్తోంది. టీజీఎ్‌సఆర్టీసీ ఏర్పడిన తరువాత కూడా అదే విధానాన్ని అమలు చేస్తోంది. ఈ సంక్రాంతి పండుగకు కూడా టికెట్‌ ధరలను 1.5 శాతం వరకు సవరించింది. అయితే తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాలకు తిరిగే స్పెషల్‌ బస్సులకు మాత్రమే సవరించిన చార్జీలు వర్తిస్తాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు. స్పెషల్‌ బస్సులు మినహా రెగ్యులర్‌ బస్సుల్లో సాధారణ చార్జీలే అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. సంక్రాంతి ప్రత్యేక బస్సులకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఆర్టీసీ కాల్‌ సెంటర్‌ నంబర్లు 040-69440000, 040-23450033లలో సంప్రదించాలని సూచించారు.


టికెట్‌ ధరలు పెంచేసిన ప్రైవేటు ట్రావెల్స్‌..

పండుగ పూట సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికుల నుంచి ప్రైవేటు ట్రావెల్స్‌.. చార్జీల పేరుతో పెద్ద మొత్తంలో దండుకుంటున్నాయి. హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నంకు జనవరి 10న తెలంగాణ ఆర్టీసీ లహరి ఏసీ బస్సుల్లో టికెట్‌ ధర రూ.1500 వరకు ఉండగా, ప్రైవేటు బస్సుల్లో రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు వసూలు చేస్తున్నారు. పండగ సెలవుల్లో మిగతా రోజుల్లోనూ టికెట్‌ ధరను ఇంతే నిర్ణయించారు. ఎక్కువగా శుక్ర, శనివారాల్లో రద్దీ ఎక్కువగా ఉండనుండటంతో.. ఆ అంచనా మేరకు ప్రైవేటు బస్సులు చార్జీలను విపరీతంగా పెంచి వసూలు చేస్తున్నాయి. ఈ ధరలు ప్రయాణికులకు ఆర్థిక భారంగా మారాయి. విచ్చలవిడిగా టికెట్‌ ధరలు పెంచి వసూలు చేస్తున్న ప్రైవేట్‌ ట్రావెల్స్‌పై చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. కాగా, పండగ రద్దీని క్యాష్‌ చేసుకునేందుకు ప్రయత్నించే ప్రైవేటు ట్రావెల్స్‌పై నిఘా ఉంచి చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ అధికారులు హెచ్చరించారు.

Updated Date - Jan 08 , 2026 | 03:36 AM