Share News

ఆర్టీసీ ఉద్యోగుల కరువు భత్యం పెంపు

ABN , Publish Date - Apr 11 , 2026 | 04:00 AM

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) ఉద్యోగులకు ప్రభుత్వం కరువు భత్యం(డీఏ) ప్రకటించింది. ఈ ఏడాది జనవరిలో ఇవ్వాల్సిన డీఏను గతం కంటే 2.1శాతం పెంచి అందజేస్తున్నట్లు వెల్లడించింది.

ఆర్టీసీ ఉద్యోగుల కరువు భత్యం పెంపు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) ఉద్యోగులకు ప్రభుత్వం కరువు భత్యం(డీఏ) ప్రకటించింది. ఈ ఏడాది జనవరిలో ఇవ్వాల్సిన డీఏను గతం కంటే 2.1శాతం పెంచి అందజేస్తున్నట్లు వెల్లడించింది. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌.. ఆర్టీసీ చైర్మన్‌, ఎండీ వై.నాగిరెడ్డి ఇతర ఉన్నతాధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఆర్టీసీ ఉద్యోగులకు డీఏ పెంచుతున్నట్లు ఈ సమావేశంలోనే మంత్రి ప్రకటించారు. ప్రస్తుతం ఆర్టీసీ ఉద్యోగులకు 50.7 శాతం డీఏ అందుతుంది. ఈ డీఏ మొత్తాన్ని మరో 2.1 శాతం పెంచారు. దీంతో మొత్తం డీఏ 52.8 శాతానికి చేరింది. ఈ పెంపు 2026 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుంది. గత మూడు నెలలకు(జనవరి, ఫిబ్రవరి, మార్చి) సంబంధించిన బకాయిలను ఏప్రిల్‌ నెల జీతంతోపాటు ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో సంస్థలో పనిచేస్తున్న సుమారు 38 వేల మందికిపైగా ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. ఈ పెంపు వల్ల సంస్థపై ప్రతి నెల రూ. 2.82 కోట్ల అదనపు భారం పడనుంది. కాగా, రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ పరిరక్షణ, కార్మికుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఈ సందర్భంగా తెలిపారు. ఇక, ఉద్యోగులకు డీఏ పెంపు పట్ల సంస్థ ఎండీ వై.నాగిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

వేతన సవరణ అమలుకు ఉద్యోగుల డిమాండ్‌

డీఏ మొత్తాన్ని పెంచిన రాష్ట్ర ప్రభుత్వం వేతన సవరణ అమలుపైనా దృష్టి సారించాలని ఆర్టీసీ ఉద్యోగులు కోరుతున్నారు. ఈ మేరకు ఆర్టీసీ బోర్డు మాజీ డైరెక్టర్‌ ఎం.నాగేశ్వర రావు ఒక ప్రకటనలో కోరారు. రాష్ట్రంలో మిగతా విభాగాలతో పోలిస్తే ఆర్టీసీ ఉద్యోగులు అతి తక్కువ వేతనాలు పొందుతున్నారని 2021 ఏప్రిల్‌ 1 నుంచే వేతన సవరణ అమలు చేయాలని, కానీ చెయ్యకపోవడంతో సుమారు 4 వేల కోట్ల చెల్లింపులకు ఉద్యోగులు దూరమయ్యారన్నారు.

Updated Date - Apr 11 , 2026 | 04:00 AM