Share News

ఉత్తర రింగుకు మోక్షమెన్నడో?

ABN , Publish Date - Aug 09 , 2026 | 05:43 AM

రీజనల్‌ రింగ్‌ రోడ్డులో భాగస్వాములైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రాజెక్టు పూర్తయితే తెలంగాణకు గేమ్‌ చేంజర్‌ అవుతుందని అన్ని వేదికల మీద గొప్పగా చెబుతున్నాయి. కానీ, ప్రాజెక్టు ఏ మాత్రం ముందుకు పడటం లేదు.

ఉత్తర రింగుకు మోక్షమెన్నడో?

  • ఎనిమిదేళ్ల క్రితమే 161 కి.మీ. రోడ్డు మంజూరు

  • ఇప్పటికీ పూర్తి కాని భూసేకరణ ప్రక్రియ

  • దీంతోపాటు మంజూరైన ఖమ్మం-దేవరపల్లి రోడ్డు పూర్తి

  • ఆర్‌ఆర్‌ఆర్‌ ఒక అడుగు ముందుకు.. పదడుగులు వెనక్కి

  • 2024లో ఐదు ప్యాకేజీల్లో రూ.7,104 కోట్లతో టెండర్లు

  • తర్వాత ఆరు లేన్లకు పెంచాలని టెండర్‌ నిలుపుదల

  • 4 నెలల క్రితం రూ.24 వేల కోట్లతో మళ్లీ అంచనాలు

  • కేంద్రం మీనమేషాలు.. భూసేకరణ పూర్తయిన వరకైనా నిర్మించుకుందామంటూ రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞపులు

హైదరాబాద్‌, ఆగష్టు 8 (ఆంధ్రజ్యోతి): రీజనల్‌ రింగ్‌ రోడ్డులో భాగస్వాములైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రాజెక్టు పూర్తయితే తెలంగాణకు గేమ్‌ చేంజర్‌ అవుతుందని అన్ని వేదికల మీద గొప్పగా చెబుతున్నాయి. కానీ, ప్రాజెక్టు ఏ మాత్రం ముందుకు పడటం లేదు. ఒకడుగు ముందుకు వేస్తే పదడుగులు వెనక్కి వెళ్తోంది. ఎనిమిదేళ్ల క్రితం (2018లో) మంజూరైన ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగం ప్రాజెక్టు ఇంకా భూసేకరణ దశలోనే ఉంది. అనేక ఆటంకాలను దాటుకొని 2024 నవంబరులో టెండర్లు ఆహ్వానించారు. తర్వాత సాంకేతిక కారణాలతో టెండర్లు నిలిపేశారు. రెండేళ్ల తర్వాత గత ఏప్రిల్‌ 21న పబ్లిక్‌ ప్రైవేటు పార్టనర్‌షిప్‌ అప్రైజల్‌ కమిటీ(పీపీపీఏసీ) రింగు రోడ్డు ఖర్చును రూ.23,935.6 కోట్లుగా ఖరారు చేసింది. పీపీపీఏసీ ఆమోదం వచ్చి నెలలు గడుస్తున్నా ప్రాజెక్టు ముందుకు కదలడం లేదు. ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తరభాగం 161 కిలోమీటర్లు. దాంతో పాటే మంజూరైన 162 కిలోమీటర్ల ఖమ్మం-దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్‌ హైవే నిర్మాణం పూర్తయింది. వాహనాలు వెళ్తున్నాయి కూడా. రీజినల్‌ రింగు రోడ్డు ఇంకా కాగితాల మీదే ఉంది. భూ సేకరణ పూర్తి కాలేదు. పరిహారం విషయంలో మధ్యవర్తిత్వం కోసం వేసిన కమిటీలోనూ ఇంతవరకు ధరల పెంపు సంప్రదింపులు కొలిక్కిరాలేదు. భూసేకరణ పూర్తయిన వరకైనా వేగంగా రోడ్డు నిర్మాణం చేపడదామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఆర్‌ అండ్‌ బీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఢిల్లీ వెళ్లిన ప్రతీసారి కేంద్రాన్ని కోరుతున్నారు. అక్కడ కదలిక లేదు.


రోడ్డు విస్తరణ కోసం ఆగిన మొదటి టెండర్లు

కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఆర్‌ఆర్‌ఆర్‌ను 2018లో మంజూరు చేసింది. దానిని ఉత్తర, దక్షిణ భాగాలు విభజించింది. 161 కిలోమీటర్ల ఉత్తర భాగం పనులకు అవసరమైన అనుమతులను ఇచ్చింది. భారత్‌మాల పరియోజన-1లో చేర్చింది. ఎన్‌హెచ్‌ నెంబర్‌ 161ఏఏను కేటాయించింది. కొంతకాలానికి ఈ ప్రాజెక్టును పీఎం గతిశక్తి మాస్టర్‌ ప్లాన్‌లోకి మార్చారు. 2024 నవంబర్‌ 27న నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణానికి 5 ప్యాకేజీల్లో రూ.7,104.6 కోట్లతో కేంద్రం టెండర్లను పిలిచింది. కొద్ది రోజుల్లోనే టెండర్లు నిలిపేశారు. ఆర్‌ఆర్‌ఆర్‌ నాలుగు రోడ్లు కాదని, ఆరు వరుసలకు పెంచాలని నిర్ణయించారు. ఆరు లేన్లను అనుగుణంగా తాజా డీపీఆర్‌ కోరారు. ఎన్‌హెచ్‌ఏఐ తెలంగాణ ప్రాంతీయ కార్యాయలం 2025 మే చివరలో కేంద్రానికి డీపీఆర్‌ పంపించింది. దానిపై ప్రాజెక్టు అప్రైజల్‌ టెక్నికల్‌ స్ర్కూట్నీ కమిటీ(పీఏటీఎస్‌సీ) పరిశీలన జరిపి పబ్లిక్‌ -ప్రైవేటు- పార్టనర్‌షిప్‌ అప్రైజల్‌ కమిటీ(పీపీపీఏసీ)పరిశీలనకు అదే సంవత్సరం అక్టోబరులో పంపింది. ఏడు నెలల కాలహరణం తర్వాత పీపీపీఏసీ గత ఏప్రిల్‌ 10న సమావేశమై ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తరభాగం నిర్మాణానికి రూ.23,935.6 కోట్ల బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. భూసేకరణ, రోడ్డు నిర్మాణం, జీఎస్టీ అన్ని వివరాలను పొందుపరచింది. మొత్తం ప్రాజెక్టును రెండు ప్యాకేజీల్లో చేపట్టాలని ప్రతిపాదించింది. గిర్మాపూర్‌ నుంచి ప్రజ్ఞాపూర్‌ వరకు 83.518 కిలోమీటర్లు ఒక ప్యాకేజీ అయితే, ప్రజ్ఞాపూర్‌ నుంచి తంగడ్‌పల్లి వరకు 78 కిలోమీటర్లు రెండో ప్యాకేజీగా చేపడతారు. ఈ ప్రాజెక్టును ఎన్‌హెచ్‌ఏఐ(ఓ) కింద చేర్చారు.


కేంద్ర కేబినెట్‌ ఆమోదించాలి

పీపీపీఏసీలో ఆమోద ముద్ర పడినప్పటికీ కేంద్ర క్యాబినెట్‌లో పరిశీలించి ఆమోదించాకే ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తరానికి మార్గం సుగమం అవుతుంది. పీపీపీఏసీ ఆమోదం తరువాత కూడా పలుమార్లు కేంద్ర క్యాబినెట్‌ సమావేశాలు జరిగాయి. కానీ, ఎజెండాలోకి ప్రాజెక్టు రాలేదు. ఫైనల్‌ డీపీఆర్‌ కేంద్ర క్యాబినెట్‌కు ఎప్పుడు చేరుతుందన్న దానిపై స్పష్టత లేదు. కేంద్ర క్యాబినెట్‌ ఆమోదంతోనే ఈ ప్రాజెక్టు రాష్ట్రానికి మంజూరైంది. టెండర్ల వరకు వెళ్లింది. ఇప్పుడు కేవలం రెండు వరుసలు పెరగడం తప్ప వేరే మార్పేమీ లేదు. అయినా ఎందుకు ఇంత ఆలస్యం జరుగుతుందో స్పష్టత లేదు. ఇటీవల ఎంపీలతో నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఆర్‌ఆర్‌ఆర్‌కు కేంద్ర కేబినెట్‌ ఆమోదం కోసం ప్రయత్నాలు చేయాలని కోరారు.

ఆర్బిట్రేషన్‌లోనూ జాప్యమే

ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగానికి 1,933 హెక్టార్ల భూమి అవసరం అవసరం. 85 శాతంభూసేకరణ పూర్తయింది. గత ప్రభుత్వ భూసేకరణ ఉత్తర్వుల వల్ల తక్కువ ధరకు భూమిని కోల్పోవాల్సి వస్తుందని, ధరను పెంచాలని రైతులు కోరుతున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ధరలను పెంచేందుకు జిల్లాల కలెక్టర్ల నేతృత్వంలో మధ్యవర్తిత్వ కమిటీలు వేసింది. అక్కడ జాప్యం రాజ్యమేలుతోంది. దీన్ని వేగవంతం చేయాలని రైతులు కోరుతున్నా రు. భూసేకరణ మొత్తం పూర్తయితేనే టెండర్లు పిలుస్తామని కేంద్రం చెబుతోంది. 80 శాతం భూసేకరణ పూర్తయితే నిర్మాణ పనులకు అవకాశం ఇస్తారు. ఆర్‌ఆర్‌ఆర్‌ విషయంలో మాత్రం కేంద్రం భిన్న వైఖరి తీసుకుంది. ఆర్‌ఆర్‌ఆర్‌ పరిధిలో యుటిలిటీ షిఫ్టింగ్‌ ఖర్చులు రూ.363 కోట్లను రాష్ట్రానికి బదులు కేంద్రం భరిస్తానని ముందుకు వచ్చింది. కేంద్రం నుంచి ఇటీవలి కాలంలో వచ్చిన సానుకూల స్పందన ఇదొక్కటే.

Updated Date - Aug 09 , 2026 | 05:45 AM