Share News

రోడ్ల మరమ్మతులు రూ.1685 కోట్లు!

ABN , Publish Date - May 14 , 2026 | 03:59 AM

రాష్ట్రంలో రోడ్లు-భవనాల శాఖ పరిధిలోని రహదారుల మరమ్మతులకు మోక్షం లభించడం లేదు. గత ఏడాది వానాకాలంలో దెబ్బతిన్న రోడ్లకు పూర్తిస్థాయి మరమ్మతులు ....

రోడ్ల మరమ్మతులు రూ.1685 కోట్లు!

  • ఆర్‌అండ్‌బీ రహదారుల పనులకు కావాల్సిన సొమ్ము ఇది

  • బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు ముందుకు రావట్లే!

  • ప్రభుత్వానికి నివేదిక అందించిన ఆర్‌అండ్‌బీ శాఖ

హైదరాబాద్‌, మే 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రోడ్లు-భవనాల శాఖ పరిధిలోని రహదారుల మరమ్మతులకు మోక్షం లభించడం లేదు. గత ఏడాది వానాకాలంలో దెబ్బతిన్న రోడ్లకు పూర్తిస్థాయి మరమ్మతులు ఒకవైపు, ఏటా చేపట్టాల్సిన మరమ్మతులు (పీరియాడికల్‌ రెన్యువల్స్‌) మరోవైపు.. వెరసి ఆర్‌అండ్‌బీలో రోడ్ల మరమ్మతు పనులు ముందుకు సాగడం లేదు. ఫలితంగా రహదారులు అధ్వానంగా తయారవుతుండడంతో పాటు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆర్‌అండ్‌బీలో ప్యాచ్‌ వర్క్‌లు, పీరియాడికల్‌ రెన్యువల్స్‌ పనులు చేపట్టేందుకు రూ.1685.60 కోట్ల నిధులు అవసరమని అధికారులు తేల్చారు. ఈ మేరకు ఆర్‌ అండ్‌బీ శాఖ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. సుమారు 4,509.8 కిలోమీటర్ల మేర రోడ్లకు మరమ్మతు పనులు అత్యవసరంగా చేపట్టాల్సి ఉందని నివేదికలో తెలిపింది. వానాకాలంలోపు మరమ్మతులు పూర్తిచేయకపోతే పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతుందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఆర్‌అండ్‌బీ పరిధిలోని పలు రోడ్లను హైబ్రిడ్‌ యాన్యునిటీ మోడ్‌(హ్యామ్‌) విధానంలో చేపట్టాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే హ్యామ్‌ పరిధిలోకి ప్యాచ్‌వర్కులు, పీరియాడికల్‌ రెన్యువల్స్‌ చేయాల్సిన రోడ్లు రానందున, ఈ పనులను అత్యవసరంగా చేపట్టాల్సి ఉందని తెలిపారు. ఇదిలా ఉండగా 2021-22, 2022-23లో మంజూరు చేసిన పనులు పూర్తిచేసిన వారికి బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని నివేదికలో వెల్లడించారు. బిల్లులు ఇవ్వకపోవడంతో పనులు చేయలేకపోతున్నామని, కొన్ని పనులను రద్దు చేయాలంటూ విజ్ఞప్తులు చేస్తున్నారన్న విషయాన్ని కూడా పొందుపరిచారు. ఇక 2025లో వచ్చిన మొంథా తుపానుతో పాటు అదే ఏడాది వానాకాలంలో వచ్చిన వరదలకు రాష్ట్రంలోని పలుచోట్ల రోడ్లు, వంతెనలు దెబ్బతిన్నాయి. వాటికి శాశ్వత పనుల కోసం రూ.1,707 కోట్లు కావాలని అప్పట్లో తేల్చారు. మళ్లీ ఈ ఏడాది వానాకాలం సమీపిస్తున్నా ఇప్పటివరకు పూర్తిస్థాయిలో ఆ పనులేవీ పూర్తికాకపోవడం గమనార్హం.

పనులు చేయాలంటే రూ.774 కోట్లు చెల్లించాలి

రాష్ట్రంలో అత్యవసరంగా చేపట్టాల్సిన ప్యాచ్‌వర్క్‌లు, పీరియాడికల్‌ రెన్యువల్స్‌ పనులపై అధికారులు దృష్టి సారించారు. వీటిని రెండు ప్రాధాన్యాలుగా చేయాలని గుర్తించారు. ప్రాధాన్యం-1 కింద రూ.1377.5 కోట్లు, ప్రాధాన్యం-2 కింద రూ.308 కోట్ల పనులు చేయాలని తేల్చారు. అయితే, నిధులు రాకపోవడం ప్రధాన సమస్యగా మారిందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం గుర్తించిన పనులు ముందుకు సాగాలంటే గతంలో చేసిన పనులకు సంబంధించి కొంతమేర అంటే.. సుమారు రూ.774 కోట్లు కాంట్రాక్టర్లకు చెల్లించాల్సి ఉంది. అలాగే ప్రస్తుత పనులకు సంబంధించిన బిల్లులను కూడా కొంతమేర చెల్లిస్తేనే రాష్ట్రంలో మరమ్మతులు జరుగుతాయని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

Updated Date - May 14 , 2026 | 03:59 AM