రహదారిపై రణం
ABN , Publish Date - Apr 09 , 2026 | 06:49 AM
పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం ప్రభావం మన దేశంలో, రాష్ట్రంలో రోడ్ల నిర్మాణం, మరమ్మతులపైనా తీవ్రంగా పడుతోంది. ఈ పనుల్లో ప్రధానంగా...
మన రోడ్ల నిర్మాణంపై యుద్ధ ప్రభావం
బిటుమెన్, ఎల్‌డీవో, ఎఫ్‌వో ధరలు భగ్గు
బిటుమెన్ టన్ను 50వేల నుంచి 80వేలకు
లైట్ డీజిల్ ఆయిల్ లీటర్ రూ.172కు
ఫర్నేస్ ఆయిల్ లీటర్ రూ.102కు
16 నుంచి మళ్లీ పెరగనున్న ధరలు!
ప్రభుత్వంపై వేల కోట్ల భారం
హైదరాబాద్, ఏప్రిల్ 8 (ఆంధ్రజ్యోతి): పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం ప్రభావం మన దేశంలో, రాష్ట్రంలో రోడ్ల నిర్మాణం, మరమ్మతులపైనా తీవ్రంగా పడుతోంది. ఈ పనుల్లో ప్రధానంగా వినియోగించే బిటుమెన్, ఫర్నేస్ ఆయిల్ (ఎఫ్‌వో), లైట్ డీజిల్ ఆయిల్ (ఎల్‌డీవో) ధరలు అమాంతం పెరగడమే ఇందుకు కారణం. ముడి చమురు నుంచి పెట్రోల్, డీజిల్‌తో పాటు బిటుమెన్, ఎల్‌డీవో, ఎఫ్‌వో తీస్తారు. పశ్చిమాసియా యుద్ధంతో ముడి చమురు సరఫరాపై ప్రభావం పడడంతో బిటుమెన్, ఎల్‌డీవో, ఎఫ్‌వో ధరలు పెరిగాయి. రహదారుల నిర్మాణం, గుంతల పూడ్చివేత, మరమ్మతుల పనుల్లో బిటుమెన్ ప్రధానం. నిన్న మొన్నటి వరకు టన్ను రూ.50 వేలకు లభించిన బిటుమెన్ ఒక్కసారిగా రూ.82 వేలకు చేరింది. లీటర్ ఎల్‌డీవో రూ.50కు దొరకగా ఇప్పుడు రూ.172కు పెరిగింది. ఎఫ్‌వో రూ.40 నుంచి రూ.102కు ఎగబాకింది. ఏప్రిల్ 16 తరువాత ఎల్‌డీవోపై లీటర్‌కు రూ.18, బిటుమెన్‌పై రూ.16, ఎఫ్‌వో మరికొంత పెరిగే అవకాశం ఉందని సమాచారం. బీటీ రోడ్డు నిర్మాణంలో కంకరతో బిటుమెన్‌ను కలిపి వాడుతారు. డాంబర్/కంకరను వేడి చేయడానికి ఎల్‌డీవో, ఎఫ్‌వోను వినియోగిస్తుంటారు. ఒక కిలోమీటర్ డబుల్ రోడ్డుకు బిటుమెన్, ఎల్‌డీవో ఖర్చు రూ.35 లక్షలు ఉండగా, ధరల పెరుగుదలతో అది రూ.65 లక్షలకు చేరుతోంది. దాంతో ప్రస్తుతమున్న నిల్వలతోనే పనులు చేపట్టే పరిస్థితులున్నాయి.
తెలంగాణలో జాతీయ రహదారులతో పాటు, రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ, పంచాయతీరాజ్ శాఖ, హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ పరిధుల్లో కలిపి వేల కోట్ల రూపాయల విలువైన రహదారుల పనులు నడుస్తున్నాయి. అదే సమయంలో హైబ్రిడ్ యాన్యుయిటీ మోడ్ (హ్యామ్) కింద 12వేల కిలోమీటర్ల రహదారులు, వచ్చే ఏడాది నిర్వహించే గోదావరి పుష్కరాల్లో భాగంగా కొన్ని పనులకు ప్రస్తుతం ప్రభుత్వం అంచనాలు సిద్ధం చేస్తోంది. తాజాగా పెరిగిన ధరలను పరిగణనలోకి తీసుకునే ఈ అంచనాలు సిద్ధం చేయాల్సి ఉంటుంది. అలాగే కొత్తగా పనులు చేపట్టాలంటే పెరిగిన ధరల ప్రకారమే కాంట్రాక్టర్లకు చెల్లించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో జరుగుతున్న పనులను పరిగణనలోకి తీసుకుంటే ప్రభుత్వంపై కొన్ని వేల కోట్ల రూపాయల ఆర్థిక భారం పడే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ క్రమంలో అత్యవసర పనులను మాత్రమే ప్రభుత్వం చేపట్టాలని బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా జాతీయ ఉపాధ్యక్షుడు డీవీఎన్ రెడ్డి సూచించారు. అలాగే పనులు పూర్తికి కాంట్రాక్టర్లపై ఒత్తిడి చేయకూడదని, గడువు పొడిగించాలని కోరారు.