Share News

రైస్‌మిల్లుల్లో తనిఖీలకు కమెండోలు!

ABN , Publish Date - Aug 22 , 2026 | 05:29 AM

ప్రభుత్వం ఇచ్చిన ధాన్యాన్ని అమ్మేసుకుని, కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ (సీఎంఆర్‌) ఇవ్వకుండా మొరాయిస్తున్న రైస్‌మిల్లర్లపై ఉక్కుపాదం మోపేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

రైస్‌మిల్లుల్లో తనిఖీలకు కమెండోలు!

  • గ్రేహౌండ్స్‌, ఆక్టోపస్‌ నుంచి 28 మంది

  • పౌరసరఫరాల శాఖలోని ఎన్‌ఫోర్స్‌మెంట్‌, విజిలెన్స్‌ విభాగంలో నియామకం

  • పౌరసరఫరాల అంశాలపై ప్రత్యేక శిక్షణ

  • వారితో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ బృందాలు

  • రైస్‌మిల్లుల్లో అక్రమాల గుర్తింపు, బకాయిలను రికవరీ చేసే బాధ్యతలు

  • కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర దిశానిర్దేశం

  • నేటి నుంచే రంగంలోకి ‘కమెండో’లు

హైదరాబాద్‌, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ఇచ్చిన ధాన్యాన్ని అమ్మేసుకుని, కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ (సీఎంఆర్‌) ఇవ్వకుండా మొరాయిస్తున్న రైస్‌మిల్లర్లపై ఉక్కుపాదం మోపేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తీవ్రవాదులను అణచివేయటంలో సుశిక్షితులైన గ్రేహౌండ్స్‌, ఆక్టోపస్‌ సిబ్బందితో కూడిన ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను రంగంలోకి దింపింది. రైస్‌మిల్లర్ల ఆగడాలను అరికట్టడంతోపాటు దోచుకున్న ధాన్యాన్ని, బియ్యం బకాయిలను రికవరీచేసే బాధ్యతను అప్పగించింది. పౌర సరఫరాల శాఖ కమిషనర్‌, సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి స్టీఫెన్‌ రవీంద్ర చేసిన ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో.. గ్రేహౌండ్స్‌, ఆక్టోపస్‌ దళాలకు చెందిన 28 మంది కమెండోలను పౌరసరఫరాల శాఖ పరిధిలోని ఎన్‌ఫోర్స్‌మెంట్‌, విజిలెన్స్‌ విభాగంలో నియమించారు. సుమారు 12 ఏళ్లుగా రైస్‌మిల్లుల నుంచి సీఎంఆర్‌ బకాయిలు రావాల్సిఉందని అంచనా. ఇటీవల మిల్లుల్లో పౌరసరఫరాల శాఖ బృందాలు తనిఖీలు చేసి అక్రమాలను తేల్చినా.. చాలా మంది రైస్‌మిల్లర్లు తొణకడం లేదు. కొందరు మిల్లర్లు మాత్రమే బకాయులు కొద్దికొద్దిగా చెల్లిస్తున్నారు. దీంతో మిల్లుల్లో తనిఖీలు, బకాయిల వసూలు కోసం ప్రత్యేక పోలీస్‌ బలగాల సిబ్బందిని వినియోగించుకోవాలని నిర్ణయించారు. గ్రేహౌండ్స్‌, ఆక్టోపస్‌ విభాగాల నుంచి 28 మందిని ఎంపిక చేసి, తెలంగాణ పోలీస్‌ అకాడమీలో 3రోజు లపాటు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. వారంతా విజిలెన్స్‌-ఎన్‌ఫోర్సుమెంట్‌ విభాగం కింద ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ బృందాలుగా పనిచేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా శనివారం నుంచే రంగంలోకి దిగనున్నారు. ఈ 28 మంది ‘కమెండో’లతో స్టీఫెన్‌ రవీంద్ర శుక్రవారం ప్రత్యేక సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు.


ఆ రైస్‌మిల్లర్లపై కఠిన చర్యలు : స్టీఫెన్‌ రవీంద్ర

ఆకస్మిక తనిఖీలు చేయడంలో ఆక్టోపస్‌, గ్రేహౌండ్స్‌ సిబ్బందికి ఇచ్చిన ప్రత్యేక శిక్షణను పౌర సరఫరాలశాఖ వినియోగించుకుంటుందని పౌరసరఫరాలశాఖ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర తెలిపారు. నిబంధనలు అతిక్రమించిన రైస్‌మిల్లర్లపై క్రిమినల్‌ కేసులు నమోదుచేసి, కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2025-26లో ఎన్నడూలేని విధంగా 154 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించినట్టు తెలిపారు.

Updated Date - Aug 22 , 2026 | 05:30 AM