Share News

రైస్‌ మిల్లర్‌ కాదు.. అనకొండ!

ABN , Publish Date - Jul 09 , 2026 | 05:06 AM

అతనో రైస్‌ మిల్లర్‌.. పేరు బండారు మారుతి.. కస్టమ్‌ మిల్లింగ్‌ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ధాన్యాన్ని మిల్లింగ్‌ చేసి బియ్యం అప్పగించాల్సిన బాధ్యత అతడిది..

రైస్‌ మిల్లర్‌ కాదు.. అనకొండ!

  • రూ.132 కోట్ల విలువైన ధాన్యం బుక్కేసిన బండారు మారుతి

  • సుల్తానాబాద్‌, ఇల్లంతకుంట, జమ్మికుంటల్లో క్రిమినల్‌ కేసులు

  • పీడీ యాక్ట్‌ పెట్టి చర్లపల్లి జైలుకు తరలించిన పోలీసులు

  • పీడీఎస్‌ బియ్యం దారి మళ్లించిన 11 మందిపైనా పీడీ యాక్ట్‌

  • రాష్ట్రంలో 2,388 రైస్‌మిల్లుల్లో రూ.4,235 కోట్ల సీఎంఆర్‌ బకాయిలు

హైదరాబాద్‌, జూలై 8 (ఆంధ్రజ్యోతి): అతనో రైస్‌ మిల్లర్‌.. పేరు బండారు మారుతి.. కస్టమ్‌ మిల్లింగ్‌ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ధాన్యాన్ని మిల్లింగ్‌ చేసి బియ్యం అప్పగించాల్సిన బాధ్యత అతడిది.. కానీ గుడిని, గుడిలో లింగాన్ని మింగినట్లు.. మొత్తం ధాన్యాన్ని బహిరంగ మార్కెట్లో అమ్ముకొని పైసలు కూడబెట్టుకున్నాడు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రూ.132 కోట్ల విలువైన ధాన్యం, బియ్యం కాజేసి ప్రభుత్వానికి కుచ్చుటోపీ పెట్టాడు. ఇప్పుడు రైస్‌ మిల్‌ ఇండస్ట్రీలో మారుతి పేరు మారుమోగుతోంది. ప్రభుత్వం ఇచ్చిన ధాన్యాన్ని అమ్ముకున్నందుకు, పీడీఎస్‌ బియ్యాన్ని దారి మళ్లించినందుకు మొట్టమొదటి పీడీ యాక్ట్‌ (ప్రివెంటివ్‌ డిటెన్షన్‌) మారుతిపైనే నమోదైంది. ఇటీవల మారుతిని అరెస్టు చేసిన పోలీసులు.. మంగళవారం చర్లపల్లి జైలుకు తరలించారు. అయితే రైస్‌మిల్‌ ఇండస్ట్రీలో మారుతి ఒక్కడే కాదు.. ఇలాంటి అనకొండలు చాలా మందే ఉన్నారు. వారి బండారాన్ని బుధవారం పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర బయటపెట్టారు. 2014-15 నుంచి 2023-24 వరకు రాష్ట్రంలో రైస్‌మిల్లర్ల పేరుకుపోయిన బకాయిలు, నమోదు చేసిన కేసుల వివరాలు వెల్లడించారు. తొలుత మారుతి నేర చరిత్రను పరిశీలిస్తే.. పెద్దపల్లి జిల్లాలోని కట్నేపల్లిలో సౌభాగ్యలక్ష్మి ఇండస్ట్రీస్‌, సాయి మహాలక్ష్మి ఇండస్ట్రీస్‌ పేర్ల మీద ప్రభుత్వం నుంచి ధాన్యం తీసుకున్నాడు. 7,625 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని మిల్లింగ్‌ చేయకుండా బహిరంగ మార్కెట్లో అమ్ముకున్నాడు. అలాగే పేదలకు ప్రభుత్వం పంపిణీ చేసే పీడీఎస్‌ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేసి పెద్ద ఎత్తున ప్రజాధనం దుర్వినియోగం చేశాడు. మొత్తంగా రూ.132 కోట్లు ప్రభుత్వానికి కుచ్చుటోపీ పెట్టినట్లు లెక్క తేలింది. సుల్తానాబాద్‌, ఇల్లంతకుంట, జమ్మికుంట పోలీస్‌ స్టేషన్లలో మారుతిపై 4 క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి. గత జూన్‌లో అతడిని అరెస్టు చేయగా.. ఈనెల 6న రామగుండం పోలీస్‌ కమిషనర్‌.. పీడీ నిర్బంధ ఉత్తర్వులు జారీ చేశారు. 7న చర్లపల్లి సెంట్రల్‌ జైలుకు తరలించారు. సీఎంఆర్‌ అమ్ముకున్న సంఘటనలో ఇది మొట్టమొదటి పీడీ యాక్ట్‌ కేసు కావటం, నిందితుడిని జైలుకు కూడా పంపించటం గమనార్హం.


మరో 11 మందిపై పీడీ యాక్ట్‌..

పేదల నుంచి రేషన్‌ బియ్యాన్ని కొనుగోలు చేసి బ్లాక్‌ మార్కెట్లో విక్రయించిన వ్యవహారంలో మరో 11 మంది రైస్‌ మిల్లర్లపై పీడీ యాక్ట్‌ నమోదు చేసినట్లు కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర వెల్లడించారు. నిజామాబాద్‌ జిల్లా బోధన్‌కు చెందిన సాయి ఆగ్రోస్‌ ఇండస్ట్రీస్‌, సూర్య ఆగ్రో ఇండస్ట్రీస్‌ యజమాని కైపు ప్రభాకర్‌రెడ్డి, బండారి కిరణ్‌ కుమార్‌, హైదరాబాద్‌కు చెందిన మహ్మద్‌ నహీద్‌, మహ్మద్‌ రఫీక్‌, మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లాకు చెందిన మంగల్‌సింగ్‌, రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోని రాజరాజేశ్వరి రైస్‌ ఇండస్ట్రీస్‌ యజమాని పూరి శ్రీకాంత్‌, ఖమ్మం జిల్లా జహీర్‌పూర్‌కు చెందిన ఆత్మకూర్‌ జగదీశ్‌, వరంగల్‌ జిల్లాకు చెందిన ఐత శ్రీకాంత్‌, యాదాద్రి భువనగిరికి చెందిన శ్రీకాంత్‌ కృష్ణ, కరీంనగర్‌ జిల్లా లింగాపూర్‌ నివాసి వేముల మహేందర్‌, ఏపీలోని ఎన్టీఆర్‌ జిల్లాకు చెందిన కాజా రామారావులపై క్రిమినల్‌ కేసులతోపాటు పీడీ యాక్ట్‌ నమోదు చేశారు. ఈ 11 మంది వద్ద నుంచి రూ.20 కోట్ల విలువైన పీడీఎస్‌ బియ్యం, రూ.17 కోట్ల విలువైన వాహనాలను సీజ్‌ చేశారు. అలాగే ధాన్యం అక్రమ రవాణా చేసిన మరో 348 మంది రైస్‌ మిల్లర్లపై క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు. 128 మందిపై రెవెన్యూ రికవరీ యాక్ట్‌ (ఆర్‌ఆర్‌ యాక్టు) నమోదు చేయటం గమనార్హం. ఇక 2014-15 నుంచి 2023-24 వరకు పౌరసరఫరాల శాఖ వెల్లడించిన లెక్కలు పరిశీలిస్తే.. రాష్ట్రవ్యాప్తంగా 2,388 రైస్‌ మిల్లుల్లో రూ.4,235 కోట్ల బకాయులు పేరుకుపోయాయి. అత్యధికంగా సూర్యాపేట జిల్లాలో రూ.609 కోట్ల సీఎంఆర్‌ బకాయిలున్నాయి.

Updated Date - Jul 09 , 2026 | 05:07 AM