ఆ రెండు హైవేలకు అనుమతులు తెచ్చుకోవాలి
ABN , Publish Date - Feb 10 , 2026 | 04:50 AM
కేంద్రం మంజూరు చేసిన జాతీయ రహదారి పనులను వేగవంతం చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. సీఎం రేవంత్ ఆదేశాల మేరకు రాష్ట్ర ఆర్ అండ్ బీ శాఖ ఉన్నతాధికారులు..
రూ.2,400 కోట్ల విలువ చేసే ఎన్‌హెచ్161బీబీ, ఎన్‌హెచ్-365 బీ రోడ్లపై ఉన్నతాధికారుల సమీక్ష
హైదరాబాద్, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): కేంద్రం మంజూరు చేసిన జాతీయ రహదారి పనులను వేగవంతం చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. సీఎం రేవంత్ ఆదేశాల మేరకు రాష్ట్ర ఆర్ అండ్ బీ శాఖ ఉన్నతాధికారులు.. కేంద్ర రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఆర్వోతో సమావేశమయ్యారు. జాతీయ రహదారుల ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్‌లు, అంచనాల తయారీ, సాంకేతిక అనుమతులు, విధానపరమైన అంశాల పురోగతిపై సమీక్షించారు. మద్నూర్-బోధన్ నేషనల్ హైవే 161బీబీ విస్తరణ, దుద్దెడ- సిరిసిల్ల మార్గంలోని ఎన్‌హెచ్-365బీ సామర్థ్య విస్తరణతోపాటు వివిధ రహదారులపై వంతెనలు, వెహికల్ అండర్ పాస్‌ల పనుల గురించి చర్చించారు. రూ.2,400కోట్ల విలువ చేసే ఈ రెండు జాతీయ రహదారుల పనులకు మార్చి చివరినాటికి అనుమతులు తెచ్చుకోవాలని నిర్ణయించారు.