Share News

భ్రష్టుపట్టిన వ్యవస్థను సంస్కరిస్తున్నాం

ABN , Publish Date - Jan 28 , 2026 | 03:55 AM

బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో భ్రష్టు పట్టించిన వ్యవస్థను కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక సంస్కరిస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు.

భ్రష్టుపట్టిన వ్యవస్థను సంస్కరిస్తున్నాం

  • బీఆర్‌ఎస్‌ పాలనలో స్వార్థపూరిత నిర్ణయాలు

  • రెవెన్యూలో సమూల మార్పులకు కృషి: పొంగులేటి

హైదరాబాద్‌, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో భ్రష్టు పట్టించిన వ్యవస్థను కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక సంస్కరిస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. గత పాలకుల స్వార్థపూరిత నిర్ణయాల వల్ల దెబ్బతిన్న వ్యవస్థను సీఎం రేవంత్‌ రెడ్డి నేతృత్వంలో గాడిలో పెడుతున్నామని చెప్పారు. తెలంగాణ ప్రజలకు అత్యుత్తమ సేవలందించేందుకు రెవెన్యూ శాఖలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టామని తెలిపారు. సమీకృత రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల భవనాల నిర్మాణంపై సచివాలయంలో మంగళవారం అధికారులతో మంత్రి పొంగులేటి సమీక్ష నిర్వహించారు. బుధవారం పటాన్‌ చెరువులో సమీకృత రిజిస్ట్రేషన్‌ భవన నిర్మాణానికి భూమి పూజ చేస్తున్నామని తెలిపారు. ఓఆర్‌ఆర్‌ పరిధిలో 39 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ఉండగా 11 క్లస్టర్లుగా విభజించామని చెప్పారు. త్వరలోనే అన్ని కార్యాలయాలకు భూమి పూజ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే తాలిమ్‌లో(గచ్చిబౌలి) సమీకృత రిజిస్ట్రేషన్‌ భవన నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. జూన్‌ 2 నాటికి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు.

జర్నలిస్టుల సంక్షేమానికి ప్రాధాన్యం..

పాత్రికేయుల సంక్షేమం, భద్రత, వృత్తి గౌరవాన్ని కాపాడే విధంగా ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి పొంగులేటి అన్నారు. పాత్రికేయుల అక్రెడిటేషన్‌పై అన్ని సంఘాల సూచనలు, సలహాలు పరిగణనలోకి తీసుకుని గతంలో విడుదల చేసిన జీవోలో మార్పులు చేసి కొత్త జీవో జారీ చేశామని తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమమే తమ ప్రాధాన్యమని మంగళవారం సచివాలయంలో మంత్రిని కలిసిన జర్నలిస్టులతో అన్నారు.

Updated Date - Jan 28 , 2026 | 03:55 AM