Share News

ఆదాయ పెంపుపై సీరియ్‌సగా దృష్టి పెట్టండి

ABN , Publish Date - Jul 02 , 2026 | 04:18 AM

ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని (పన్నులు, ఇతర రాబడులను) వంద శాతం వసూలు చేయడంపై అధికారులు సీరియ్‌సగా దృష్టి సారించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు.

ఆదాయ పెంపుపై సీరియ్‌సగా దృష్టి పెట్టండి

  • ఇందుకోసం చేజింగ్‌ సెల్‌ను ఏర్పాటు చేయండి

  • అధికారులకు సీఎం రేవంత్‌ ఆదేశాలు

హైదరాబాద్‌, జూలై 1 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని (పన్నులు, ఇతర రాబడులను) వంద శాతం వసూలు చేయడంపై అధికారులు సీరియ్‌సగా దృష్టి సారించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ముఖ్యంగా హెచ్‌ఎండీఏ, టీజీఐఐసీలు ఆదాయ వనరులను పెంచుకోవడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. ఆదాయ సమీకరణపై బుధవారం హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎంసీహెచ్‌ఆర్‌డీ)లో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, సీఎస్‌ సంజయ్‌ జాజు సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. బడ్జెట్‌ లక్ష్యాలను అందుకోవాలంటే నిధుల సమీకరణే ఏకైక మార్గమని స్పష్టం చేశారు. వాణిజ్య పన్నులు, ఎక్సైజ్‌, గనుల శాఖల వంటి కీలక రాబడి విభాగాల్లో ఎక్కడా ఆదాయ లీకేజీలు లేకుండా కఠిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఆదాయ సమీకరణ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా ఒక ‘చేజింగ్‌ సెల్‌’ను ఏర్పాటు చేయాలన్నారు. ఊహాజనితంగా కాకుండా, వాస్తవికత ఆధారంగానే బడ్జెట్‌ను రూపొందించుకోవాలని సీఎం చెప్పారు. ప్రాజెక్టుల వారీగా నిధుల కేటాయింపుల్లో భూసేకరణకు మొదటి ప్రాధాన్యమివ్వాలన్నారు. ప్రభుత్వ పథకాల్లో కృత్రిమ మేధ (ఏఐ)ను ఉపయోగించుకుని లబ్ధిదారుల జాబితాను ‘ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ)’ ప్రక్రియకు అనుసంధానం చేసుకోవాలని సూచించారు. నిధుల సమీకరణ, రాబడి పెంపు విషయంలో అధికారులు నిర్లక్ష్యాన్ని వీడాలని, ప్రభుత్వపరంగా అవసరమైన అన్ని రకాల సహకారాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎం స్పష్టం చేశారు.

Updated Date - Jul 02 , 2026 | 04:18 AM