రూ.500 బోనస్ ఇకపై.. ఏడు రకాల వడ్లకే!
ABN , Publish Date - Jun 18 , 2026 | 06:20 AM
తెలంగాణలో వరి పండించే రైతులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల హామీ మేరకు సన్న వడ్లకు ప్రకటించిన రూ.500 బోన్‌సను ఇకపై ప్రభుత్వం..
ప్రభుత్వం కీలక నిర్ణయం.. వడ్ల జాబితా విడుదల.. మార్కెట్ డిమాండ్ ఆధారంగానే సన్నరకాల ఎంపిక
గతంలో బోనస్ ఇచ్చిన 33 రకాల నుంచి 26 తొలగింపు
డిమాండ్ లేనివాటిని సాగు చేసి రైతులు నష్టపోవద్దనే!
హైదరాబాద్, జూన్ 17 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో వరి పండించే రైతులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల హామీ మేరకు సన్న వడ్లకు ప్రకటించిన రూ.500 బోన్‌సను ఇకపై ప్రభుత్వం అధికారికంగా గుర్తించిన ఏడు రకాల సన్న వడ్లకు మాత్రమే పరిమితం చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు సాగు మార్కెట్ అవసరాలు, దేశ విదేశాల్లో ఉన్న డిమాండ్‌ను శాస్ర్తీయంగా విశ్లేషించి.. అర్హమైన ఏడు రకాల ప్రత్యేక విత్తనాల జాబితాను సర్కారు విడుదల చేసింది. ప్రభుత్వ ప్రకటన ప్రకారం.. బీపీటీ-5204 (సాంబమసూరి), ఆర్‌ఎన్‌ఆర్-15048 (తెలంగాణ సోనా), హెచ్‌ఎంటీ సోనా, జై శ్రీరామ్, కేఎన్‌ఎం-1638 (కూనారం సన్నలు), డబ్ల్యూజీఎల్-44 (సిద్ది), కేఎన్‌ఎం-7715 రకాల విత్తనాలను బోనస్ చెల్లింపునకు అర్హమైనవిగా గుర్తించారు. ఎన్నికల హామీల్లో భాగంగా.. రైతులకు బోనస్ ఇవ్వాలనుకున్నప్పుడు రాష్ట్రంలో 33 సన్న వడ్ల రకాలు ఉన్నట్లు వ్యవసాయ శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే.. వాటిలో చాలా రకాల వడ్లు మార్కెట్‌లో సరైన ఆదరణ, డిమాండ్ లేనివి ఉన్నాయి. వాటిని రైతులు సాగు చేయడం వల్ల ఆ తర్వాత మార్కెట్‌లో మద్దతు ధర లభించక, మిల్లర్లు కొనుగోలు చేయక రైతాంగం తీవ్రంగా నష్టపోతోంది. ప్రభుత్వానికి కూడా అది వృథా ప్రయాసగా మారుతోంది. ఈ నేపథ్యంలోనే మార్కెట్ డిమాండ్, రైతుల ప్రయోజనాలు, పౌరసరఫరాల శాఖ, రైస్ మిల్లర్ల సూచనలను పూర్తిస్థాయిలో పరిగణనలోకి తీసుకుని.. కేవలం ఏడు సన్నరకాలకే బోనస్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. విత్తన కంపెనీలు, డీలర్లు కూడా ఈ ఏడు రకాల విత్తనాల విక్రయాలకే ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రైవేటు కంపెనీలు ఇష్టారాజ్యంగా ఇతర రకాలను అంటగడితే ఊరుకునేది లేదని ప్రభుత్వం హెచ్చరించింది.
ఈ 7 రకాలే అనుకూలం
ప్రభుత్వం ఎంపిక చేసిన ఏడు వరి రకాలు తెలంగాణ వాతావరణానికి, ఇక్కడి వైవిధ్యభరితమైన నేలలకు అద్భుతంగా కుదురుతాయని వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలింది. ముఖ్యంగా ఆర్‌ఎస్ఆర్-15048 (తెలంగాణ సోనా) తక్కువ కాలపరిమితితో పాటు తక్కువ నీటితో పండే రకం. రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల తేలికపాటి నేలలకు, ఇసుక జిగురు నేలలకు ఇది అత్యంత అనుకూలం. దీనికి షుగర్ ఫ్రీ గుణాలు ఉండటంతో మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. ఇక బీపీటీ-5204 (సాంబమసూరి), హెచ్‌ఎంటీ సోనా రకాలు.. కృష్ణా, గోదావరి బేసిన్ పరిధిలోని ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లోని నల్లరేగడి, బరువైన చల్క నేలల్లో అధిక దిగుబడి ఇస్తాయి. కాగా, కూనారం సన్నాలు (కేఎన్‌ఎం-1638),కేఎన్‌ఎం-7715, డబ్ల్యూజీఎల్-44(సిద్ది) రకాలు.. మన వాతావరణాన్ని తట్టుకునేలా తెలంగాణ ప్రాంతీయ పరిశోధనా స్థానాలు (వరంగల్, కూనారం) ప్రత్యేకంగా రూపొందించినవి. ఇవి చీడపీడలను, ముఖ్యంగా అగ్గితెగులును సమర్థంగా తట్టుకుంటాయి. తెలంగాణలోని ఎర్ర నేలలు, నల్లరేగడి భూములు రెండింటిలోనూ స్థిరమైన దిగుబడినిచ్చే సామర్థ్యం ఈ ఏడింటికి ఉండటం వల్లే ప్రభుత్వం వీటిని ఎంపిక చేసింది.ఈ రకాలను సాగు చేయడం ద్వారా రైతులకు ఓవైపు మార్కెట్లో గిరాకీ, మరోవైపు ప్రభుత్వ బోనస్ కలిసి వచ్చి రెట్టింపు లాభం చేకూరుతుందని ప్రభుత్వం నమ్ముతోంది. విత్తన మార్కెట్లో కేవలం ఈ అధీకృత విత్తనాలను మాత్రమే విక్రయించేలా వ్యవసాయ శాఖ నిఘా పెంచింది.
మిగిలిన రకాల సాగు బంద్.. స్థానిక ప్రాధాన్యతలకు బ్రేక్ పడేనా!
ప్రభుత్వం కేవలం ఏడు రకాల సన్నవడ్లకే రూ.500 బోన్‌సను పరిమితం చేయనుండడంతో.. గతంలో బోనస్ పరిధిలో ఉన్న మిగిలిన 26 రకాల వరి సాగు భవిష్యత్తు ఏంటన్న చర్చ మొదలైంది. ఉదాహరణకు.. ఉమ్మడి నల్లగొండ జిల్లా మిర్యాలగూడ బెల్టులో రైతులు దశాబ్దాలుగా ‘చిట్లు’ (చిట్టి ముత్యాలు/స్థానిక సన్నరకం) అనే వరి రకాన్ని పండిస్తున్నారు. మార్కెట్‌లో దీనికి ప్రత్యేకమైన స్థానం ఉంది. కానీ, ఈ రకానికి పక్కాగా ధ్రువీకరించబడిన జన్యుపరమైన ఆధారాలు, సీడ్ సర్టిఫికేషన్ రికార్డులు లేకపోవడంతో బోనస్ జాబితాలో చోటు దక్కించుకోలేకపోయింది. అయితే.. ప్రభుత్వం ప్రకటించిన ఏడు రకాలైన వడ్లు కూడా మిర్యాలగూడ ప్రాంతంలో విరివిగానే పండుతాయి. అలాగే.. మంచి డిమాండ్ ఉన్నప్పటికీ తక్కువ కాలపరిమితితో పండే కావేరి, జెయింట్ బీపీటీ, నెల్లూరు సన్నాలు వంటి ప్రైవేట్, ఇతర సంప్రదాయ రకాలకు కూడా ఈసారి బోనస్ జాబితాలో చోటు దక్కలేదు. ఈ నిర్ణయం వల్ల సదరు రకాలను పండించే రైతులు అలవాటైన స్థానిక రకాలను కాదని ప్రభుత్వం గుర్తించిన ఏడు రకాల వైపే మొగ్గు చూపాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇది ఒక రకంగా స్థానిక మార్కెట్ అవసరాలను, రైతుల సొంత ఆహార ప్రాధాన్యతలను కొంతవరకు ప్రభావితం చేసే అవకాశం ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.