జొన్న, మొక్కజొన్నలకు ‘మద్దతు’ ఇవ్వండి
ABN , Publish Date - May 22 , 2026 | 04:27 AM
జొన్న, మొక్కజొన్న పంటలను ధరల మద్దతు పథకం (పీఎస్‌ఎస్) పరిధిలోకి తీసుకురావాలని, పొద్దుతిరుగుడు కొనుగోలు పరిమితిని 3,690 మెట్రిక్ టన్నుల నుంచి 15,262 మెట్రిక్ టన్నులకు పెంచాలని...
పీఎస్‌ఎస్ పరిధిలోకి తీసుకురండి
కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల వినతి
హైదరాబాద్, మే 21 (ఆంధ్రజ్యోతి): జొన్న, మొక్కజొన్న పంటలను ధరల మద్దతు పథకం (పీఎస్‌ఎస్) పరిధిలోకి తీసుకురావాలని, పొద్దుతిరుగుడు కొనుగోలు పరిమితిని 3,690 మెట్రిక్ టన్నుల నుంచి 15,262 మెట్రిక్ టన్నులకు పెంచాలని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. పీఎంఆర్‌కేవీవై, పీడీఎంసీ, ఎంఐడీహెచ్ పథకాల కింద తెలంగాణకు నిధుల కేటాయింపులు పెంచాలని కోరారు. గురువారం రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రితో తుమ్మల హైదరాబాద్‌లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర రైతులు, వ్యవసాయ రంగ సమస్యల పరిష్కారానికి, పంటల కొనుగోలు, నిధుల అంశాలపై కేంద్ర సాయాన్ని కోరుతూ వినతిపత్రాలు అందజేశారు. హెర్బిసైడ్ టోలరెంట్ (హెచ్‌టీ) కాటన్‌పై జాతీయస్థాయిలో స్పష్టమైన విధాన నిర్ణయం తీసుకోవాలని, ఆయిల్ పామ్ రైతుల రక్షణకు చొరవ తీసుకోవాలని కేంద్ర మంత్రికి తుమ్మల విజ్ఞప్తి చేశారు. కేంద్ర నోడల్ ఏజెన్సీల ద్వారా 14.90 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న, 2.01 లక్షల మెట్రిక్ టన్నుల జొన్న కొనుగోళ్లకు అనుమతులు ఇవ్వాలని కోరారు. పొద్దుతిరుగుడు కొనుగోలు పరిమితిని 3,690 మెట్రిక్ టన్నుల నుంచి 15,262 టన్నులకు పెంచాలని చౌహాన్‌ను కోరారు. దీనికి స్పందించిన కేంద్ర మంత్రి.. ఈ సమస్యలన్నింటిపై త్వరలో సమగ్రంగా సమీక్ష నిర్వహించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.