ఎన్‌హెచ్‌ఎం నిధులు విడుదల చేయండి
ABN , Publish Date - May 12 , 2026 | 04:11 AM
జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) కింద 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తెలంగాణకు రావాల్సిన రూ.319.44 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది.
కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ
హైదరాబాద్, మే 11 (ఆంధ్రజ్యోతి) : జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) కింద 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తెలంగాణకు రావాల్సిన రూ.319.44 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ డాక్టర్ సంగీతా సత్యనారాయణ తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి ఆరాధనకు లేఖ రాశారు. 2025-26 సంవత్సరానికి కేంద్రం రూ.1,595.33 కోట్ల మొత్తం బడ్జెట్‌ను ఆమోదించింది. ఇందులో కేంద్రం వాటా రూ.957.20 కోట్లు, రాష్ట్ర వాటా రూ. 638.13కోట్లు. అయితే కేంద్రం నుంచి రూ.353.24 కోట్లే విడుదలయ్యాయి. మరో రూ.319.44 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు. ఈ నిధులను విడుదల చేసి సహకరించాలని కమిషనర్ కోరారు.