Share News

రాష్ట్రంలో ఎబోలా కేసుల్లేవు

ABN , Publish Date - May 27 , 2026 | 04:28 AM

ఎబోలా విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు.

రాష్ట్రంలో ఎబోలా కేసుల్లేవు

  • లక్షణాలున్న వారిని ఇప్పటివరకు గుర్తించలేదు: దామోదర

హైదరాబాద్‌, మే 26 (ఆంధ్రజ్యోతి): ఎబోలా విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ఎబోలా కేసులు నమోదు కాలేదని, ఎబోలా లక్షణాలు ఉన్న వ్యక్తులను కూడా గుర్తించలేదని పేర్కొన్నారు. ఎబోలా అంశంలో ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా ఉందని, ఎబోలా రాష్ట్రంలోకి రాకుండా ఆపేందుకు విమానాశ్రయంలోనే స్ర్కీనింగ్‌ పరీక్షలు చేస్తున్నామని వెల్లడించారు. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ఆరోగ్య వ్యవస్థ సిద్ధంగా ఉందని మంత్రి తెలిపారు. ఆఫ్రికాలోని కొన్ని దేశాల్లో ఎబోలా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో.. ఎబోలా నివారణ, ముందు జాగ్రత్తలు, సన్నద్థతపై మంత్రి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఎబోలా కేసులు నమోదు కాలేదని అధికారులు మంత్రికి వివరించారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు అన్ని ముందస్తు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. కాంగో, ఉగాండా, సూడాన్‌ వంటి ఎబోలా బాధిత దేశాల నుంచి వచ్చే వారికి శంషాబాద్‌ విమానాశ్రయంలోనే స్ర్కీనింగ్‌, థర్మల్‌ స్కానింగ్‌ చేస్తూ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామన్నారు. విమానాశ్రయంలో డాక్టర్లు, హెల్త్‌ ఇన్‌స్పెక్టర్లు, ఫీల్డ్‌ స్టాఫ్‌, పారామెడికల్‌ సిబ్బందితో ప్రత్యేక బృందం విధులు నిర్వహిస్తోందన్నారు. గాంధీ ఆస్పత్రిలో 10 పడకల ప్రత్యేక ఐసోలేషన్‌ వార్డు ఏర్పాటు చేశామన్నారు. ఎబోలా వ్యాప్తి ఉన్న దేశాల నుంచి సోమవారం నాటికి 58 మంది ప్రయాణికులు హైదరాబాద్‌కు వచ్చారని, వీరిలో ఎవరికీ వ్యాధి లక్షణాలు లేవని అధికారులు తెలిపారు. మంత్రి మాట్లాడుతూ.. వ్యాధి లక్షణాలు ఉన్న ప్రయాణికులను వెంటనే గాంధీ ఆస్పత్రిలోని ఐసోలేషన్‌ వార్డుకు తరలించాలని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రులన్నీ అప్రమత్తంగా ఉండాలని, ఇన్‌ఫెక్షన్‌ కంట్రోల్‌ ప్రోటోకాల్స్‌ను కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు.

Updated Date - May 27 , 2026 | 04:28 AM