అందుబాటులో 90.22 లక్షల యూరియా బస్తాలు
ABN , Publish Date - Jun 17 , 2026 | 04:13 AM
రైతులకు ఎరువులను సకాలంలో అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రస్తుతం రాష్ట్రంలో 90.22 లక్షల యూరియా బస్తాలు అందుబాటులో ....
బుకింగ్ కోసం స్మార్ట్ ఫోన్ లేని రైతులకు టోల్ ఫ్రీ నంబరు
రైతు నేస్తం కార్యక్రమంలో మంత్రి తుమ్మల
హైదరాబాద్, జూన్ 16 (ఆంధ్రజ్యోతి): రైతులకు ఎరువులను సకాలంలో అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రస్తుతం రాష్ట్రంలో 90.22 లక్షల యూరియా బస్తాలు అందుబాటులో ఉన్నాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మంగళవారం నిర్వహించిన రైతునేస్తం కార్యక్రమంలో ఆయన సీడ్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ అన్వేష్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ రిటైల్ దుకాణాల్లో 22.67 లక్షలు, సహకార సంఘాల దగ్గర 5.56, మార్క్‌ఫెడ్ దగ్గర 59.56, గోదాముల్లో 3.56 లక్షల బస్తాల నిల్వలు అందుబాటులో ఉన్నాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఫెర్జిలైజర్ యాప్ ద్వారా 4.06 లక్షల మంది రైతులు 13.22 లక్షల బస్తాలు బుక్ చేయగా, 11.18 లక్షల బస్తాలు కొనుగోలు అయ్యాయని తెలిపారు. బుకింగ్ కోసం స్మార్ట్ ఫోన్ లేని రైతులకు టోల్-ఫ్రీ నంబరు సౌకర్యాన్ని కల్పించామన్నారు. ప్రతి రోజు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. యూరియా అక్రమ రవాణా, బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టడానికే డిజిటల్ విధానాన్ని అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. జూన్, జూలైలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడితే ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలన్నారు. యూరియా యాప్‌పై విమర్శలు చేస్తున్న బీజేపీ నేతలకు.. త్వరలోనే ఈ విధానాన్ని దేశవ్యాప్తంగా అమల్లోకి తేనున్న సంగతి తెలియదా అంటూ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వే్‌షరెడ్డి ప్రశ్నించారు. గాంధీభవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. ఖరీఫ్ సీజన్ ప్రణాళిక మేరకు సరఫరా చేయాల్సిన యూరియాకు కేంద్రం ఎందుకు కోత పెడుతోందో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సమాధానం చెప్పాలన్నారు.