Share News

91 మంది జీవిత ఖైదీల విడుదల

ABN , Publish Date - Jun 03 , 2026 | 06:06 AM

జైళ్ల నుంచి విడుదల అయిన వారు కొత్త జీవితం ప్రారంభించాలని జైళ్లశాఖ డైరెక్టర్‌ జనరల్‌ సౌమ్య మిశ్రా సూచించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ...

91 మంది జీవిత ఖైదీల విడుదల

  • జీవో 54 జారీ చేసిన ప్రభుత్వం

  • 38 మందికి ఉద్యోగాలు

  • నలుగురు మహిళా ఖైదీలకు కుట్టు మిషన్ల పంపిణీ

  • కొత్త జీవితం ప్రారంభించాలి

  • జైళ్లశాఖ డీజీ సౌమ్య మిశ్రా

కుషాయిగూడ, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి) : జైళ్ల నుంచి విడుదల అయిన వారు కొత్త జీవితం ప్రారంభించాలని జైళ్లశాఖ డైరెక్టర్‌ జనరల్‌ సౌమ్య మిశ్రా సూచించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జూన్‌ ఒకటవ తేదీ అర్ధరాత్రి ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం. 54 మార్గదర్శకాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జైళ్లల్లో సత్ప్రవర్తన కనబరచిన ఆరుగురు మహిళా ఖైదీలతో సహా మొత్తం 91 మంది జీవిత ఖైదీలను అధికారులు మంగళవారం విడుదల చేశారు. వీరిలో 38 మందికి ఇంధన బంకుల్లో ఉద్యోగ నియామకాలతోపాటు నలుగురు మహిళా ఖైదీలకు కుట్టు మిషన్లు అందజేశారు. చర్లపల్లి కేంద్ర కారాగారం ఆవరణలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సౌమ్య మిశ్రా మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సమాజంలో మంచి పౌరులుగా మసలుకోవాలని సూచించారు. జైళ్లశాఖ ఐజీలు వై.రాజే్‌ష(అడ్మిన్‌), ఎన్‌.మురళీ బాబు(వెల్ఫేర్‌) మాట్లాడుతూ.. నిబంధనలకు లోబడి ఈ క్షమాభిక్ష జీవో వర్తిస్తుందని, విడుదలైన ఖైదీలు మళ్లీ నేరాలు చేస్తే మిగిలిన శిక్షాకాలాన్ని కూడా పూర్తి చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. కాగా చర్లపల్లి జైలు నుంచి క్షమాభిక్షపై విడుదలైన ఖైదీలు తమ హర్షాన్ని వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. దాదాపు 15 నుంచి 16 ఏళ్ల శిక్షాకాలాన్ని పూర్తి చేసిన ఖైదీలు కొందరు మాట్లాడుతూ.. జైళ్లశాఖ చేపట్టిన సంస్కరణల్లో భాగంగా గత దశాబ్ద కాలం నుంచి వసతి, భోజన సౌకర్యాలు మెరుగయ్యాయని, న్యాయ సహాయం కూడా దక్కుతోందని వెల్లడించారు. క్షణికావేశంలో చేసిన తప్పులకు జైలు పాలైన తమకు జైలు అధికారులు, సిబ్బంది అండగా ఉన్నారని, తమకు స్వయం ఉపాధి కోర్సులతో పాటు ఉన్నత విద్యను కూడా అందించారని పేర్కొన్నారు.

3.jpg

ముగ్గురు ఆడ పిల్లలు

నాకు ముగ్గురు ఆడపిల్లలు సంతానం. అన్నదమ్ముల మధ్య తలెత్తిన ఆస్తి తగాదాల మూలం గా జరిగిన దురదృష్టకర ఘటనలో పధ్నాలుగు ఏళ్లుగా జైల్లో ఉన్నాను. ఇక్కడికి వచ్చాక చదువును కొనసాగించాను. ప్రభుత్వ అధికారులు, జైలు సిబ్బంది పర్యవేక్షణలో క్రమశిక్షణతో కూడిన జీవన విధానం అలవడింది. నా కుటుంబానికి, సమాజానికి దూరంగా బతకడం వల్ల వాటి విలువ తెలిసి వచ్చింది.

- పిట్టల నరేష్‌, నిజామాబాద్‌

2.jpg

మారిన మనిషిలా బయటకు

జైలుకు రాక ముందు నా చుట్టూ ఉన్న పరిస్థితులు వేరు. ప్రస్తుతం నేను జైలు నుంచి మారి న మనిషిలా వెళుతున్నాను. జైలుకు వచ్చాకే అక్షరాలు నేర్చుకొని సంతకం చేయడం, పత్రికలు చదవడం నేర్చుకున్నాను. టైలరింగ్‌ నేర్చుకున్న నాకు సొం తంగా టైలరింగ్‌ షాప్‌ పెట్టుకోవాలనే ఆలోచన ఉంది. నా కుటుంబానికి నా వంతు సహాయంగా ఉంటాను.

- రషీద్‌, చంచల్‌గూడ సెంట్రల్‌ జైలు

Updated Date - Jun 03 , 2026 | 06:06 AM