Share News

ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగానికి రూ.526.87కోట్లు

ABN , Publish Date - Apr 15 , 2026 | 04:44 AM

రీజినల్‌ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగం నిర్మాణం కోసం సేకరించిన భూములకు పరిహారంచెల్లింపులో కీలక ముందడుగుపడింది.

ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగానికి రూ.526.87కోట్లు

ఎన్‌హెచ్‌ఏఐకు జమ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

టీజీఆర్‌డీసీకి హడ్కో రుణం అందడంతో తాజాగా నిధుల బదిలీ

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 14 (ఆంధ్రజ్యోతి): రీజినల్‌ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగం నిర్మాణం కోసం సేకరించిన భూములకు పరిహారంచెల్లింపులో కీలక ముందడుగుపడింది. ఈ భాగం కోసం రాష్ట్రం తరపున చెల్లించాల్సిన వాటా కింద రూ.526.87 కోట్లను భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ)ఖాతాకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా జమచేసింది. దీంతో ఉత్తరభాగం పరిధిలో సేకరించిన భూములకు పరిహారం చెల్లింపుల ప్రక్రియ ఊపందుకోనుంది. గతంలో ఇచ్చిన రూ.100 కోట్లు, ఇప్పుడు ఇచ్చిన రూ.526.87కోట్లతో రాష్ట్ర వాటా కింద రూ.626.87కోట్లు ఎన్‌హెచ్‌ఏఐకు జమయ్యాయి. ఈ మార్గం కోసం సేకరించిన భూములకు చెల్లించాల్సిన పరిహారంలో రాష్ట్ర వాటా రూ.2,560కోట్లకుపైగా ఉంటుందని అంచనా. రాష్ట్ర వాటా నిధుల కోసం హడ్కో నుంచి రుణం తీసుకోవాలని ప్రభుత్వం గతంలోనే నిర్ణయించినా ఇప్పటివరకు రుణం తీసుకోలేదు. తాజాగా భూములకు ఎన్‌హెచ్‌ఏఐ విడతల వారీగా పరిహారం చెల్లింపులు చేస్తుండగా.. రాష్ట్ర వాటా నిధులను జమ చేయాలని కోరుతోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఆర్‌ అండ్‌ బీకి అనుబంధంగా ఉన్న రోడ్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌(టీజీఆర్‌డీసీ)ద్వారా హడ్కో నుంచి రుణం తీసుకుంది. రూ.2వేల కోట్ల వర కు రుణం తీసుకోవాలని నిర్ణయించి మొదటి విడతలో ఎన్‌హెచ్‌ఏఐ సూచించిన రాష్ట్ర వాటా మేరకు రూ.526.87కోట్ల రుణం తీసుకుంది.

Updated Date - Apr 15 , 2026 | 04:44 AM