బోధనాస్పత్రులకు రూ.168 కోట్లు
ABN , Publish Date - Apr 11 , 2026 | 04:02 AM
ఆర్థిక సమస్యలతో అల్లాడుతున్న ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనాస్పత్రులకు కాస్తంత ఊరట కలగనుంది. ఆరోగ్యశ్రీ రివాల్వింగ్ ఫండ్ నుంచి రూ.168 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేయనుంది...
హైదరాబాద్, ఏప్రిల్ 10 (ఆంధ్రజ్యోతి): ఆర్థిక సమస్యలతో అల్లాడుతున్న ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనాస్పత్రులకు కాస్తంత ఊరట కలగనుంది. ఆరోగ్యశ్రీ రివాల్వింగ్ ఫండ్ నుంచి రూ.168 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేయనుంది. ఈ నిధులను త్వరలోనే ఆస్పత్రుల అభివృద్ధి సోసైటీ(హెచ్‌డీఎస్)కి బదిలీ చేయనున్నారు. జిల్లా కలెక్టర్లు, బోధనాస్పత్రుల సూపరింటెండెంట్లు సంయుక్తంగా ఈ నిధులను ఖర్చు చేయనున్నారు. ఈ నిధుల వినియోగంపై ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసినట్లు వైద్యవర్గాలు వెల్లడించాయి. రాష్ట్రవ్యాప్తంగా 35 ప్రభుత్వ వైద్య కళాశాలలు, వాటి అనుబంధ బోధనాస్పత్రులున్నాయి. వీటన్నింటికి ఈ రివాల్వింగ్ ఫండ్ అందనుంది. ఈ నిధులతో కళాశాలలు, బోధనాస్పత్రుల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు. కాగా ఒక్కొ బోధనాస్పత్రికి రూ.2.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు నిధులు రానున్నాయని ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ఆయా బోధనాస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద అందించిన వైద్య సేవల ఆధారంగా ఈ నిధులు విడుదల అవుతాయని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. ఉదాహరణకు నాగర్‌కర్నూల్ బోధనా స్పత్రికి రూ.2.5 కోట్లు, గాంధీ, ఉస్మానియా లాంటి పెద్దాస్పత్రులకు రూ.10 కోట్ల చొప్పున వచ్చే అవకాశం ఉందని ఆ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం బోధనాస్పత్రులు, వైద్య కళాశాలల్లో మౌలిక సదుపాయాలు, పరికరాలు ఇతర వసతులు కల్పించాలంటే తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు మౌలిక సదుపాయాలభివృద్ధి సంస్థ(టీజీఎంఎ్‌సఐడీసీ)పైనే ఆధారపడుతున్నారు. చాలాసార్లు ఇండెంట్ పెట్టిన నెలల తర్వాత కానీ అందించలేని పరిస్థితి నెలకొంది. పైగా కమీషన్లు లేనిదే ఔషధ కార్పొరేషన్ ఫైలు కదలని పరిస్థితి ఉంది. అక్కడ ఏళ్లుగా పాతుకుపోయిన కొందరు అధికారులు, ఇతర సిబ్బందితోనే ఇటువంటి సమస్య ఎదురవుతోందని వైద్యవర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో బోధనాస్పత్రుల సూపరింటెండెంట్లే అత్యవసరమైన వాటిని సమకూర్చుకోవాలనే ఉద్దేశంతోనే సర్కారు ఈ రివాల్వింగ్ ఫండ్‌ను విడుదల చేయనుంది. అలాగే ఏజెన్సీలకు చెల్లించాల్సిన పాత బకాయిలను సైతం వీటి నుంచే కొంత కేటాయించనున్నారని వైద్యవర్గాలు పేర్కొన్నాయి.
గతఏడాది రాష్ట్రంలోని మెడికల్ కాలేజీలు, బోధనాస్పత్రుల్లో తనిఖీలు చేసిన మెడికల్ కాలేజీ మానిటరింగ్ కమిటీ (ఎంసీఎంసీ)లు సర్కారుకు నివేదిక ఇచ్చాయి. ముఖ్యంగా యంత్రపరికాలు, లేబోరేటరీలు, బ్లడ్ బ్యాంకులు, ఫర్నిచర్, లెక్చరర్ హాళ్లు, లైబ్రరీలో వసతుల లేమి వంటి అంశాలపై కమిటీ సభ్యులు నివేదికలో పేర్కొన్నారు. నివేదిక ఆధారంగా తక్షణమే పరిష్కరించాల్సిన సమస్యలను గుర్తించారు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండటం, సర్కారు నుంచి డబ్బులు వచ్చే పరిస్థితి లేకపోవడంతో, ఆరోగ్యశ్రీ రివాల్వింగ్ ఫండ్ ఇందుకోసం వాడుకోవాలని వైద్యశాఖ నిర్ణయించింది. మరోవైపు.. ప్రభుత్వ నర్సింగ్ కాలేజీల్లో రోజూవారీ ఖర్చులకు కూడా పైసలు లేని దుస్థితి ఏర్పడింది. రోజువారీ ఖర్చుల కోసం తక్షణమే నిధులు కేటాయించాలని తాజాగా పలు నర్సింగ్ కాలేజీల ప్రిన్సిపాళ్లు రాష్ట్ర వైద్యవిద్య సంచాల కులు డాక్టర్ నరేందర్ కుమార్‌కు లేఖ రాశారు.