Share News

ఉద్యోగుల సాధారణ బదిలీలపై నిషేధం

ABN , Publish Date - Jun 02 , 2026 | 04:47 AM

రాష్ట్రంలోని ఉద్యోగుల సాధారణ బదిలీలపై ప్రభుత్వం మళ్లీ నిషేధం విధించింది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో తప్ప రాష్ట్రంలో ఎలాంటి బదిలీలు చేపట్టవద్దని అన్ని శాఖలను ఆదేశించింది.

ఉద్యోగుల సాధారణ బదిలీలపై నిషేధం

  • కొన్ని ప్రత్యేక సందర్భాల్లో బదిలీలకు అవకాశం

  • పరిపాలనాపరమైన బదిలీలకు సీఎం నుంచి అనుమతి అవసరం

హైదరాబాద్‌, జూన్‌ 1(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ఉద్యోగుల సాధారణ బదిలీలపై ప్రభుత్వం మళ్లీ నిషేధం విధించింది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో తప్ప రాష్ట్రంలో ఎలాంటి బదిలీలు చేపట్టవద్దని అన్ని శాఖలను ఆదేశించింది. ఈమేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీ్‌పకుమార్‌ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని అన్ని శాఖల ఉద్యోగుల సాధారణ బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ, బదిలీలకు అవకాశం కల్పిస్తూ ఏప్రిల్‌ 21న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని శాఖల్లోని బదిలీలను మే 1 నుంచి 31 వరకు పూర్తి చేయాలని ఆదేశించింది. ఈమేరకు రాష్ట్రంలోని బదిలీల ప్రక్రియ పూర్తి కావడంతో జూన్‌ 1 నుంచి బదిలీలపై ప్రభుత్వం నిషేధం విధించింది. అయితే... కొన్ని సందర్భాల్లో బదిలీలకు అవకాశం కల్పించింది. పదోన్నతులు కల్పించడం ద్వారా స్పష్టమైన ఖాళీలు ఉన్న ప్రదేశాలకు బదిలీ చేయవచ్చని తెలిపింది. కొన్ని రకాల పోస్టులను రద్దు చేయడం, రివర్షన్లు, మాతృ శాఖలకు పంపించడం, డిప్యూటేషన్లు, క్రమశిక్షణ చర్యల సందర్భాల్లో బదిలీలు చేయవచ్చని సూచించింది. ఆరు నెలల కంటే ఎక్కువ కాలం పాటు సెలవుపై ఉన్నవారు తిరిగి విధుల్లో చేరే సందర్భంలో ఖాళీలు ఉన్న చోట పోస్టింగ్‌ ఇవ్వవచ్చని తెలిపింది. జూన్‌ 1 నుంచి ఆరు నెలల పాటు ఏ ప్రభుత్వ శాఖ కూడా బదిలీల నిషేధంపై సడలింపు ఇవ్వరాదని ఆదేశించింది. పరిపాలనాపరమైన బదిలీలకు సంబంధించి సడలింపు అవసరమైనట్లయితే ఆర్థిక శాఖ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మంత్రి ద్వారా ముఖ్యమంత్రి నుంచి ప్రత్యేక అనుమతి తీసుకోవాలని తెలిపింది.

ఆర్‌ అండ్‌ బీలో బదిలీలకు బ్రేక్‌

రోడ్లు-భవనాల శాఖలో సాధారణ బదిలీలకు బ్రేక్‌ పడింది. కౌన్సెలింగ్‌ ప్రక్రియ మొత్తం పూర్తయి.. ఉత్తర్వులు వెలువడే సమయానికి బదిలీల వ్యవహారం నిలిచిపోయింది. వాస్తవానికి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పదోన్నతులు, బదిలీలను కలిపి ఒకేసారి చేస్తే ఇబ్బందులు ఉండవనే భావన తో పదోన్నతుల జాబితాలో ఉన్నవారికి ప్రమోషన్‌ ఇచ్చాక బదిలీ చేయాలని సూచించారు. కానీ పదోన్నతులు, బదిలీల ప్రక్రియలో హ్యామ్‌ విభాగానికి అధికారులను కేటాయించలేదు. దీంతో సంబంఽధిత ఉన్నతాధికారులపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని సమాచారం. ఆ కారణంగానే బదిలీ ఉత్తర్వులు నిలిచిపోయినట్టు తెలిసింది. అయితే శాఖలోని అన్ని కేడర్లకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న పదోన్నతుల ప్రతిపాదనలను వేగంగా పూర్తిచేసి, వారంలోపు ప్రమోషన్‌ ప్యానెల్‌కు ఆమోదం తెలపాలని అధికారులకు మంత్రి సూచించినట్టు సమాచారం. పదోన్నతులు, బదిలీలకు మరికొంత సమయం ఇవ్వాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది.

Updated Date - Jun 02 , 2026 | 04:47 AM