రాష్ట్రంలో నిలిచిన రిజిస్ట్రేషన్లు!
ABN , Publish Date - Jul 02 , 2026 | 04:26 AM
తెలంగాణ వ్యాప్తంగా సాంకేతిక ఇబ్బందులతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిలిచిపోయింది. బుధవారం ఉదయం నుంచి సర్వర్లు పనిచేయలేదు. స్లాట్ బుకింగ్...
హైదరాబాద్, చిక్కడపల్లి, జూలై 1 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణ వ్యాప్తంగా సాంకేతిక ఇబ్బందులతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిలిచిపోయింది. బుధవారం ఉదయం నుంచి సర్వర్లు పనిచేయలేదు. స్లాట్ బుకింగ్, చలాన్ల చెల్లింపులు ఆగిపోయాయి. దీంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సేవలు మరో 2 రోజులపాటు అందుబాటులో ఉండవు. సర్వర్ల అప్‌గ్రెడేషన్, కొత్త సాంకేతికత పనులు ఇంకా కొనసాగుతున్నాయి. అవి పూర్తయితే గురువారం సాయంత్రం నాటికి రిజిస్ట్రేషన్ శాఖ ఆన్‌లైన్ సేవలు అందుబాటులోకి వస్తాయని సమాచారం. హైదరాబాద్ నగరంలోని పలు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. అశోక్‌నగర్‌లోని చిక్కడపల్లి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో సోమ, మంగళవారాల్లో రిజిస్ట్రేషన్లు జరగలేదు. భూములు, ఫ్లాట్‌ల క్రయవిక్రయాలు, గిఫ్ట్ డీడ్స్, మార్టిగేజ్ డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లన్నీ నిలిచిపోయాయి. కొందరికి స్లాట్‌లు బుక్ అయినా రిజిస్ట్రేషన్లు జరగకపోవడంతో గంటల తరబడి కార్యాలయం వద్దే పడిగాపులు కాయాల్సి వచ్చింది. ఈ విషయమై కార్డ్ విభాగం డీఐజీ సుభాషిణి స్పందిస్తూ ‘డేటా మైగ్రేషన్’ ప్రక్రియ కారణంగా కొన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సమస్యలు ఉత్పన్నమయ్యాయని చెప్పారు.