రిజిస్ట్రేషన్ల ఆదాయంలో 24.2 శాతం వృద్ధి
ABN , Publish Date - May 31 , 2026 | 05:53 AM
త్వరలో భూముల మార్కెట్ విలువలు పెరుగుతాయనే ప్రకటనల నేపథ్యంలో.. మే నెలలో రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం గణనీయంగా పెరిగింది.
హైదరాబాద్, మే 30 (ఆంధ్ర జ్యోతి): త్వరలో భూముల మార్కెట్ విలువలు పెరుగుతాయనే ప్రకటనల నేపథ్యంలో.. మే నెలలో రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం గణనీయంగా పెరిగింది. గతేడాది మే నెలలో వచ్చిన ఆదాయంతో పోల్చితే 24.2 శాతం వృద్ధి నమోదైంది. ఈ ఏడాది మే 29వ తేదీ నాటికి వచ్చిన ఆదాయం రూ.1698.96 కోట్లు. 2025 మే నెలలో ఇదే కాలానికి వచ్చిన ఆదాయం రూ.1367.93 కోట్లు. గతేడాదితో పోల్చితే ఈసారి రూ.331.03 కోట్లు అదనపు ఆదాయం సమకూరింది. అయితే రిజిస్ట్రేషన్ అయిన డాక్యుమెంట్ల పరంగా చూస్తే కొంత తగ్గుదల ఉంది. 2025 మే నెలలో 1.48 లక్షల దస్తావేజులు రిజిస్ట్రేషన్ కాగా.. ఈ ఏడాది ఆ సంఖ్య 1.47 లక్షలకు పరిమితం అయింది. దస్తావేజుల సంఖ్య తగ్గినప్పటికీ.. ఆదాయ పరంగా అధిక విలువ కలిగిన ఆస్తుల రిజిస్ట్రేషన్లు పెరిగినట్లు తెలుస్తోంది. దీంతోపాటు త్వరలో మార్కెట్ విలువల పెంపు ఉంటుందనే ప్రకటనలు కూడా కలిసొచ్చాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్, మే రెండు నెలల్లో రిజిస్ట్రేషన్ల శాఖ రూ.3107.31 కోట్ల ఆదాయాన్ని సాధించింది. గతంతో పోల్చితే ఈ ఏడాది రూ.624.38 కోట్ల వృద్ధి కనిపించింది.