దస్తావేజులు తగ్గినా పెరిగిన ఆదాయం
ABN , Publish Date - Mar 28 , 2026 | 05:20 AM
తెలంగాణలో రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం గణనీయంగా పెరిగింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో దస్తావేజుల సంఖ్య తగ్గినా.. రిజిస్ట్రేషన్ ద్వారా వచ్చే ఆదాయంలో ...
ఈ ఏడాది మార్చి 25 నాటికి రూ.15013.92 కోట్ల ఆదాయం
హైదరాబాద్, మార్చి 27 (ఆంధ్ర జ్యోతి): తెలంగాణలో రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం గణనీయంగా పెరిగింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో దస్తావేజుల సంఖ్య తగ్గినా.. రిజిస్ట్రేషన్ ద్వారా వచ్చే ఆదాయంలో మాత్రం వృద్ధి నమోదైంది. ఈ ఆర్థిక సంవత్సరంలో మార్చి 25వ తేదీ నాటికి రిజిస్ట్రేషన్ల శాఖకు రూ.15013.92 కోట్ల ఆదాయం సమకూరింది. గత ఏడాదితో పోల్చితే ఇది 8.31 శాతం అధికం. 2024-25లో ఇదే సమమానికి రూ.13861.41 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంకా మూడు పని దినాలు(28, 30, 31 తేదీలు) మిగిలి ఉండగా, పని వేళలు, స్లాట్లు పెంచడంతో మరికొంత ఆదాయం సమకూరనుంది. కాగా, గతఏడాది ఫిబ్రవరి వరకు రూ.12,776 కోట్లు ఆదాయం రాగా.. ఈ ఏడాది ఫిబ్రవరి వరకు రూ.13795 కోట్లు వచ్చాయి. గతేడాది మార్చి నెలలో రూ.1085.41 కోట్లు ఆదాయం సమకూరితే.. ఈ ఏడాది మార్చిలో ఇప్పటిదాకా రూ.1218.92 కోట్లు వచ్చాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మార్చి నెలలో ఆదాయం 12.30 శాతం పెరిగింది.మార్చి 25వ తేదీ వరకు గత ఏడాది 17.11 లక్షల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అయితే.. ఈ ఏడాది ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ అయిన డాక్యుమెంట్లు 16.80 లక్షలు. గతంతో పోల్చితే 1.81 శాతం తగ్గాయి.