బాధితురాలి ఇంటికి వెళ్లి కేసు నమోదు
ABN , Publish Date - Jan 25 , 2026 | 03:21 AM
జనగామ జిల్లాలో తొలిసారిగా పోలీసులు బాధితురాలి ఇంటి వద్దకే వెళ్లి కేసు నమోదు చేశారు. జఫర్‌గడ్ పోలీసు స్టేషన్ పరిధిలో శనివారం ఈ ఎఫ్‌ఐఆర్ నమోదైంది.
జనగామ జిల్లా జఫర్‌గడ్‌లో తొలిసారిగా ఎఫ్‌ఐఆర్
జఫర్‌గడ్, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): జనగామ జిల్లాలో తొలిసారిగా పోలీసులు బాధితురాలి ఇంటి వద్దకే వెళ్లి కేసు నమోదు చేశారు. జఫర్‌గడ్ పోలీసు స్టేషన్ పరిధిలో శనివారం ఈ ఎఫ్‌ఐఆర్ నమోదైంది. శారీరక, లైంగిక దాడులకు గురైన మహిళలు, పిల్లలు ఫిర్యాదు చేసేందుకు పోలీసు స్టేషన్‌కు వెళ్లనవసరం లేకుండా.. పోలీసులే వారింటికి వెళ్లి ఫిర్యాదు స్వీకరించి ఎఫ్‌ఐఆర్ నమోదు చేసేందుకు పోలీసు శాఖ వినూత్న నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. జఫర్‌గడ్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో కొందరు వ్యక్తులు ఓ మహిళ పట్ల అసభ్యంగా మాట్లాడుతూ వేధింపులకు గురి చేస్తుండటంతో ఆమె 100నంబరుకు ఫోన్ చేసింది. దీంతో జఫర్‌గడ్ ఎస్‌ఐ బి.రామారావు బాధితురాలి ఇంటికి వెళ్లి ఫిర్యాదును స్వీకరించి, అక్కడే కేసు నమోదు చేశారు. డీజీపీ ఉత్తర్వులు, వరంగల్ సీపీ ఆదేశాల మేరకు పౌరులకు మరింత మెరుగైన సేవలు అందించడంలో భాగంగా బాధితురాలి ఇంటి వద్దకే వెళ్లి కేసు నమోదు చేశామని ఎస్‌ఐ తెలిపారు.