Share News

తగ్గిన యాసంగి ధాన్యం సేకరణ లక్ష్యం!

ABN , Publish Date - May 25 , 2026 | 05:06 AM

యాసంగి సీజన్‌లో ధాన్యం సేకరణ లక్ష్యాన్ని సర్కారు కుదించింది. తొలుత 90 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని, ధాన్యం సేకరణ చరిత్రలో ఇది ....

తగ్గిన యాసంగి ధాన్యం సేకరణ లక్ష్యం!

  • 90 లక్షల టన్నుల నుంచి 75 లక్షలకు కుదింపు

హైదరాబాద్‌, మే 24 (ఆంధ్రజ్యోతి): యాసంగి సీజన్‌లో ధాన్యం సేకరణ లక్ష్యాన్ని సర్కారు కుదించింది. తొలుత 90 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని, ధాన్యం సేకరణ చరిత్రలో ఇది అరుదైన రికార్డు కాబోతుందని ప్రకటించిన ప్రభుత్వం.. తీరా ఆదివారం నాటి సమీక్షలో 75 లక్షల టన్నులకు సేకరణ లక్ష్యాన్ని కుదించినట్లు వెల్లడించటం చర్చనీయాంశంగా మారింది. ఈ సీజన్‌లో 90 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు వస్తుందని.. అందుకు అనుగుణంగా కొనుగోలు కేంద్రాలు, మౌలిక వసతులను గణనీయంగా పెంచింది. రాష్ట్రవ్యాప్తంగా 8,575 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, ధాన్యం రవాణాకు 12,900 వాహనాలు, 20.86 కోట్ల గోనె సంచులు అందుబాటులో ఉంచింది. 7 లక్షల మెట్రిక్‌ టన్నుల అదనపు గిడ్డంగుల సామర్థ్యాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు కొనుగోలు కేంద్రాలకు 58.79 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం రాగా.. అందులో 50.01 లక్షల మెట్రిక్‌ టన్నులను ప్రభుత్వం కొనుగోలు చేసింది. మిగిలిన 8.79 లక్షల మెట్రిక్‌ టన్నులను కూడా 3 రోజుల్లోనే కొనుగోలు చేస్తామని తెలిపింది. ఏమైందో తెలియదుగానీ.. మరో పది రోజుల్లో ధాన్యం సేకరణ పూర్తవనున్న నేపథ్యంలో తొలుత ప్రకటించిన 90 లక్షలమెట్రిక్‌ టన్నుల లక్ష్యంలో 15 లక్షల మెట్రిక్‌ టన్నులను తగ్గించడం గమనార్హం.

Updated Date - May 25 , 2026 | 05:06 AM