నేతలు, పోలీసులకు భద్రత కుదింపు
ABN , Publish Date - Jul 03 , 2026 | 07:01 AM
డీజీపీ సీవీ ఆనంద్... తన ఎస్కార్టును వదిలివేశారు. బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ప్రభుత్వానికి సరెండర్ చేశారు. డీజీపీ ఒక్కరే కాదు.. సర్వీసులో ఉన్న మరో ఆరుగురు..
మావోయిస్టుల ప్రస్థానం ముగిసిన నేపథ్యంలో రాష్ట్ర భద్రతా సమీక్ష కమిటీ నివేదిక మేరకు చర్యలు
బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను వెనక్కి ఇచ్చేసిన డీజీపీ, పలువురు తాజా, మాజీ ఐపీఎస్‌లు
గ్రేహౌండ్స్, ఆక్టోపస్, ఎస్‌ఐబీల్లోనూ సిబ్బంది తగ్గింపు
ఇతర విభాగాలకు కేటాయింపు.. ట్రాఫిక్‌కు ప్రాధాన్యం
హైదరాబాద్, జూలై 2 (ఆంధ్రజ్యోతి): డీజీపీ సీవీ ఆనంద్... తన ఎస్కార్టును వదిలివేశారు. బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ప్రభుత్వానికి సరెండర్ చేశారు. డీజీపీ ఒక్కరే కాదు.. సర్వీసులో ఉన్న మరో ఆరుగురు సీనియర్ ఐపీఎస్‌లు, మాజీ డీజీపీలు, రిటైర్డ్ ఐపీఎస్‌లు వినియోగిస్తున్న 20 బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు తిరిగి ప్రభుత్వానికి చేరాయి. దేశవ్యాప్తంగా మావోయిస్టుల ప్రభావం తగ్గిన నేపథ్యంలో రాష్ట్ర స్థాయి భద్రత సమీక్ష కమిటీ ఇటీవల సమావేశమై ప్రభుత్వానికి ఓ నివేదికను అందజేసింది. మావోయిస్టుల నుంచి ముప్పు ఉందన్న కోణంలో పోలీసు అధికారులు, రాజకీయ నేతలు పొందుతున్న భద్రతను తగ్గించడంతోపాటు వారికిచ్చిన బుల్లెట్‌ప్రూఫ్ వాహనాలను వెనక్కి తీసుకోవాలని ప్రతిపాదించింది. ఈ మేరకు డీజీపీ సీవీ ఆనంద్‌తోపాటు ఇంటెలిజెన్స్ చీఫ్ విజయకుమార్, స్టీఫెన్ రవీంద్ర, హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్, మహేశ్ భగవత్, మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లు తమ బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను వెనక్కి అప్పగించారు. వీరికి ఉన్న 2 ప్లస్ 2 గన్‌మెన్ రక్షణను 1ప్లస్1కు పరిమితం చేశారు. అలాగే, మాజీ డీజీపీలు స్వర్ణజిత్ సేన్, ఏకే ఖాన్, ఏకే మహంతి, దినేష్ రెడ్డి, జితేందర్, అనురాగ్‌శర్మ, మహేందర్ రెడ్డి, మాజీ ఐపీఎస్‌లు పూర్ణచంద్రరావు, కొత్తకోట శ్రీనివాసరెడ్డి, నవీన్‌చంద్, వెంకట్రామిరెడ్డి, ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్, డీటీ నాయక్, ఉమేష్ షరాఫ్, రవిగుప్తా తదితరుల వద్ద ఉన్న బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను సైతం వెనక్కి తీసుకున్నారు.
ఇదే విధంగా జిల్లాల్లోనూ భద్రత సమీక్ష కమిటీలు సమావేశమై పలువురు ప్రజాప్రతినిధులకు కొనసాగిస్తున్న భద్రతను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీల నాయకులకు గన్‌మెన్ సంఖ్యను తగ్గించారు. ఇప్పటిదాకా భద్రత విధుల్లో ఉన్న సిబ్బందిని ఇకపై ఇతర విభాగాల్లో వాడుకోవచ్చని ఉన్నతాధికారులు యోచిస్తున్నారు. మావోయిస్టుల ఏరివేత కోసం వినియోగించిన గ్రేహౌండ్స్, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో, ఆక్టోపస్ విభాగాల నుంచి సగానికిపైగా సిబ్బందిని ఇతర విభాగాల్లో సర్దుబాట్లు చేస్తున్నారు. సిబ్బంది కొరతతో ఇబ్బంది పడుతున్న ట్రాఫిక్ విభాగానికి తొలి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆ తర్వాతి దశలో ఈగల్ ఫోర్స్, లా అండ్ ఆర్డర్, నేర పరిశోధన విభాగాల్లో నియమించాలని నిర్ణయించారు. ఇటీవల పోలీసు ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ సమావేశమైనపుడు సిబ్బంది సర్దుబాటుపై ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే పోలీసుశాఖలో సర్దుబాట్లు మొదలయ్యాయి.