Share News

జూన్‌లో 17 జిల్లాల్లో లోటు వర్షపాతం

ABN , Publish Date - Jul 01 , 2026 | 07:08 AM

రాష్ట్రంలో జూన్‌లో సాధారణంతో పోలిస్తే 17జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. ఎల్‌ నినో, నైరుతి ఆలస్యం, రుతుపవనాల్లో కదలిక వేగంగా లేకపోవడమే ఇందుకు..

జూన్‌లో 17 జిల్లాల్లో  లోటు వర్షపాతం

  • సగటు వర్షపాతం 130 మిల్లీమీటర్లు

  • కురిసింది 115 మిల్లీమీటర్లు

  • ఈ వానలూ 4 జిల్లాల్లోనే ఎక్కువ

  • 12 జిల్లాల్లో సాధారణ వర్షపాతం

  • జూలై, ఆగస్టు పైనే రైతాంగం ఆశలు

  • నేడు, రేపు కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు

హైదరాబాద్‌, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో జూన్‌లో సాధారణంతో పోలిస్తే 17జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. ఎల్‌ నినో, నైరుతి ఆలస్యం, రుతుపవనాల్లో కదలిక వేగంగా లేకపోవడమే ఇందుకు కారణమని రాష్ట్ర వాతావరణ విభాగం తెలిపింది. రాష్ట్రంలో జూన్‌లో హన్మకొండ జిల్లాలో అత్యల్పంగా కేవలం 40 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఇక్కడ జూన్‌ సగటు వర్షపాతం 142మి.మీ. లోటు వర్షపాతం నమోదైన జిల్లాల్లో వరంగల్‌, సిద్దిపేట, మేడ్చల్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌, గద్వాల, యాదాద్రి, మంచిర్యాల, జనగాం, జగిత్యాల, సిరిసిల్ల, వనపర్తి, మెదక్‌, భూపాలపల్లి, మహబూబాబాద్‌ జిల్లాలు న్నాయి. నల్గొండ, రంగారెడ్డి, సూర్యాపేట, నాగర్‌కర్నూల్‌.. ఈ నాలుగు జిల్లాల్లోనే సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైంది. ఇక ఖమ్మం, ములుగు, సంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, హైదరాబాద్‌, వికారాబాద్‌, నారాయణపేట్‌, భద్రాద్రి, పెద్దపల్లి, నిర్మల్‌, ఆసిఫాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో సాధారణ వర్షపాతం కురిసింది. మొత్తంగా 12 జిల్లాల్లో సాధారణ, 4 జిల్లాల్లో సాధారణం కంటే అధికంగా, 17జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. జూన్‌లో రాష్ట్రం లో సగటు వర్షపాతం 130మి.మీ. కానీ ఈ ఏడాది జూన్‌లో కేవలం 115మి.మీ. కురిసింది. అంటే 15 మి.మీ. లోటు వర్షపాతం నమోదైంది. అయితే, నిరుడు జూన్‌లో కూడా కేవలం 104 మి.మీ. వర్షమే కురవడం గమనార్హం. 2024 జూన్‌లో 159 మి.మీ. వర్షపాతం రికార్డయింది. ఇక జూలైలో సగటున 227 మి.మీ, ఆగస్టులో 215మి.మీ. సాధారణ వర్షపాతం నమో దు కావాలి. రైతాంగం ఆశలన్నీ జూలై, ఆగస్టులపైనే పెట్టుకుంది.


నేడు, రేపు విస్తారంగా వానలు

తెలంగాణలో బుధ, గురువారాల్లో కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా జూలై 2న మంచిర్యాల, ఆసిఫాబాద్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లిలో అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఈ జిల్లాలకు ఆరెంజ్‌ ఆలెర్ట్‌ జారీ చేసింది. ఆదిలాబాద్‌, నిర్మల్‌, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్‌, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇక, బుధవారం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, వరంగల్‌, మహబూబాబాద్‌, పెద్దపల్లి, కరీంనగర్‌, హ్మనకొండ, జనగాం, మెదక్‌, కామారెడ్డి, నిర్మల్‌, నిజామాబాద్‌, వికారాబాద్‌ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

Updated Date - Jul 01 , 2026 | 07:11 AM