కిడ్నీల వైఫల్యంతో మరణాలు తెలంగాణలోనే అత్యధికం
ABN , Publish Date - Jun 15 , 2026 | 04:43 AM
రాష్ట్రంలో కిడ్నీల వైఫల్యం వల్ల సంభవిస్తున్న మరణాలు ప్రమాదకర స్థాయిలో ఉన్నాయి. ప్రతి లక్ష మంది జనాభాలో 10,601 మంది దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి...
తాజా అధ్యయనంలో వెల్లడి
హైదరాబాద్, జూన్ 14(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కిడ్నీల వైఫల్యం వల్ల సంభవిస్తున్న మరణాలు ప్రమాదకర స్థాయిలో ఉన్నాయి. ప్రతి లక్ష మంది జనాభాలో 10,601 మంది దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి (క్రానిక్ కిడ్నీ డిసీజ్-సీకేడీ)తో బాధపడుతుండగా 19 మంది మృత్యువాతపడుతున్నారు. దీనిపై భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) ప్రచురించే ‘ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్’లో తాజాగా పరిశోధనాత్మక వ్యాసం ప్రచురితమైంది. ‘గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్’ (జీబీడీ- 2023) గణాంకాల ఆధారంగా 1990 నుంచి 2023 వరకు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కిడ్నీ వ్యాధుల సరళిని ఢిల్లీలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిలియరీ సైన్సెస్ (ఐఎల్‌బీఎస్) వైద్య నిపుణులు విశ్లేషించారు. ఈ అధ్యయనంలో దేశంలోని మిగిలిన అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణలో కిడ్నీ వ్యాధుల వల్ల సంభవిస్తున్న మరణాల రేటు, కోల్పోతున్న ఆరోగ్యకరమైన జీవితకాలం చాలా ఎక్కువగా ఉన్నట్లు వెల్లడైంది. రాష్ట్రంలో కిడ్నీ వ్యాధులు ముదరడానికి ప్రధాన కారణాల్లో మధుమేహం కీలకమైనదిగా పరిశోధకులు గుర్తించారు. దేశవ్యాప్తంగా నమోదయ్యే కేసుల్లో దాని పాత్ర 18 నుంచి 24 శాతం ఉంటే తెలంగాణలో మాత్రం అత్యధికంగా ఉన్నట్లు తేలింది. షుగర్ వ్యాధిని సకాలంలో నియంత్రించుకోకపోవడం వల్లే రా ష్ట్రంలో రోగుల కిడ్నీలు త్వరగా పాడవుతున్నాయని అధ్యయనం స్పష్టంచేసింది. కిడ్నీ వ్యాధు ల వల్ల అతి తక్కువగా రాజస్థాన్‌లో ప్రతి లక్ష మంది జనాభాకు 6.71 మరణాలు సంభవిస్తుంటే, తెలంగాణలో అది అత్యధికంగా 19.84గా నమోదైంది. ఇది జాతీయ సగటు కంటే చాలా ఎక్కువ. కిడ్నీ వ్యాధుల వల్ల వైకల్యం, అకాల మరణాల వల్ల కోల్పోతున్న ఉత్పాదక సంవత్సరాల రేటులోనూ తెలంగాణ దేశంలోనే తొలి స్థానంలో నిలిచింది. రాజస్థాన్‌లో ఈ రేటు 312.2 ఉంటే, తెలంగాణలో 666.38గా రికార్డయింది. కాగా, గత మూడు దశాబ్దాలుగా(1990-2023) దేశవ్యాప్తంగా కిడ్నీ వ్యాధుల కొత్త కేసులు, మరణాల రేటు స్వల్పంగా తగ్గుముఖం పట్టినట్లు అధ్యయనం పేర్కొంది. జాతీయస్థాయిలో మరణాల రేటు ఏటా 0.90ు చొప్పున తగ్గుతోంది. అయితే తెలంగాణ, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో మాత్రం మరణాల సంఖ్య ఇప్పటికీ ప్రమాదకరస్థాయిలోనే కొనసాగుతోందని పేర్కొంది. రాష్ట్రంలో కిడ్నీ వ్యాధుల మరణాలు పేద వర్గాల్లోనే ఎ క్కువగా ఉన్నాయని వెల్లడించింది. ప్రాథమిక దశలోనే వ్యాధిని గుర్తించకపోవడం, అవగాహన లోపం వల్ల రోగులు చివరిదశలో ఆస్పత్రులకు వస్తున్నారని పేర్కొంది. కాగా, ఈ పరిస్థితుల నుంచి గట్టెక్కడానికి పరిశోధకులు ప లు సూచనలు చేశారు. ‘కిడ్నీ వ్యాధులను ప్రత్యేక ప్రాధాన్యత కలిగిన అంశంగా చేర్చి నిధులు కేటాయించాలి. మధుమేహం, రక్తపో టు రోగులకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనే క్రియాటినిన్, మూత్ర పరీక్షలు నిర్వహించాలి. పేద రోగులకు డయాలసిస్, కిడ్నీ మార్పిడి సే వలు సులభంగా, ఫ్రీగా అందేలా మౌలిక వసతులు మెరుగుపర్చాలి’ అని సూచించారు.