రాష్ట్రంలో సైబర్ నేరాలు పెరిగాయ్
ABN , Publish Date - May 09 , 2026 | 05:35 AM
రాష్ట్ర ప్రభు త్వం, పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఎక్కడో ఉండి రాష్ట్రంలో సైబ ర్ నేరాలకు పాల్పడి, డబ్బులు కొల్లగొడుతున్నారు. ఈ
27,230 కేసులతో మొదటి స్థానంలో తెలంగాణ
తగ్గిన రైతు ఆత్మహత్యలు.. ప్రేమ వ్యవహారాల్లో 32 మంది హత్య
పెరుగుతున్న బాల నేరస్థుల సంఖ్య
మహిళలు, దళితులపై పెరిగిన దాడులు
2024 గణాంకాలతో ఎన్‌సీఆర్‌బీ నివేదికలో వెల్లడి
హైదరాబాద్, మే 8 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభు త్వం, పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఎక్కడో ఉండి రాష్ట్రంలో సైబ ర్ నేరాలకు పాల్పడి, డబ్బులు కొల్లగొడుతున్నారు. ఈ క్రమంలో దేశంలో అత్యధిక సైబర్ నేరాలు నమోదైన రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. జాతీయ నేరగణాంకాల బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) 2024 ఏడాదికి సంబంధించి తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ వివరాలు వెల్లడించింది. దేశవ్యాప్తంగా 2024లో మొత్తం అన్నిరకాల నేరాలు 58,85,867 నమోదుకాగా.. 2023లో నమోదైన 62,41,569 కేసులతో పో లిస్తే 6ు తగ్గుదల నమోదైంది. అందులో తెలంగాణలో అన్నిరకాల నేరాలకు సంబంధించి 2023లో 1,83,644 కేసులు నమోదవగా, 2024లో ఆ సంఖ్య 2,17,976 కేసులకు పెరిగింది. మొత్తంగా దేశంలో అత్యధిక కేసులు నమోదైన రాష్ట్రాల్లో తెలంగాణ 7వ స్థానంలో నిలిచింది. 2024లో దేశవ్యాప్తంగా 1,01,928 సైబర్ నేరాలు నమోదవగా, అందులో 27,230నేరాలతో తెలంగాణ తొలిస్థానంలో ఉంది. తర్వాత కర్ణాటక (21,993), యూపీ (11,073), మ హారాష్ట్ర (9,922) ఉన్నాయి. మరోవైపు మహిళలపై నేరాలకు సంబంధించి తెలంగాణలో కేసుల సంఖ్య కొంత పెరిగింది. 2023లో 23,678 కేసులు నమోదవగా, 2024లో 24,495 కేసులు నమోదుయ్యాయి. ఇక రాష్ట్రంలో 2024లో 144 వరకట్న హత్యలు, 1,040 హత్య కేసులు, 2,907 వయోధికులపై నేరాలు నమోదైనట్టు ఎన్‌సీఆర్‌బీ నివేదిక వెల్లడించింది.
రాష్ట్రంలో తగ్గిన రైతు ఆత్మహత్యలు
తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు తగ్గినట్లు ఎన్‌సీఆర్‌బీ నివేదిక వెల్లడించింది. రైతులు, వ్యవసాయ రంగంలో పనిచేసేవారు 2023లో 56 మంది ఆత్మహత్యకు పాల్పడగా.. 2024లో 43మంది బలవన్మర ణం చెందారు. ఈ అంశానికి సంబంధించి మహారాష్ట్రలో 2,269, కర్ణాటకలో 1,770 ఆత్మహత్యలు నమోదవడం గమనార్హం. ఇక తెలంగాణలో 2024లో 5,745మంది దినసరి కూలీలు, 1,577మంది స్వయం ఉపాధి పొందుతున్నవారు, 1,005మంది వేతన జీవులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని... రోడ్డు ప్రమాదాల్లో 7,949 మంది మరణించారని నివేదిక వెల్లడించింది. ప్రేమ వ్యవహారాల్లో 32 మంది, రాజకీయ కారణాలతో ఒకరు, అక్రమ సంబంఽధాల నేపథ్యంలో 98 మంది, కుటుంబ తగాదాలతో 249 మంది, ఆస్తి వివాదాల్లో 92 మంది హత్యకు గురైనట్టు తెలిపింది. ఇక 3,372 కిడ్నాప్ కేసులు నమోదయ్యాయి.
బాల నేరగాళ్ల సంఖ్యలో పెరుగుదల
రాష్ట్రంలో 2024లో వివిధ కేసుల్లో 1,569 మంది జువైనల్స్ (నేరారోపిత బాలలు) నిందితులుగా ఉన్నట్టు ఎన్‌సీఆర్‌బీ నివేదిక వెల్లడించింది. ఈ సంఖ్య 2022లో 1,096, 2023లో 1,151గా ఉండటం గమనార్హం. అత్యాచారం కేసుల్లోనే 61 మంది బాలలు నిందితులుగా ఉన్నారు. దేశవ్యాప్తంగా చూస్తే బిహార్‌లో అత్యధికంగా 5,037 మంది బాలలు వివిధ కేసుల్లో నిందితులుగా నమోదయ్యారు. ఏపీలో ఈ సంఖ్య 726 మాత్రమే. నాగాలాండ్‌లో జువైనల్ నేరస్తులు ఒక్కరు కూడా లేనట్లు నివేదిక పేర్కొంది. ఇక దేశవ్యాప్తంగా దళితులపై దాడులకు సంబంధించి 2023లో 57,627 కేసులు నమోదవగా.. 2024లో ఆ సంఖ్య 55,535 కేసులకు తగ్గింది. అదే సమయంలో తెలంగాణలో 1,709 కేసుల (2023లో) నుంచి 2,059 కేసులకు (2024లో) పెరిగింది. 2024లో దళితులపై దాడులకు సంబంధించి మధ్యప్రదేశ్‌లో అత్యధికంగా 7,765 కేసులు నమోదయ్యాయి.