Share News

తొలి 4 నెలల్లో 2,363 మరణాలు

ABN , Publish Date - May 04 , 2026 | 04:45 AM

రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసు శాఖ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా వాటి సంఖ్యను నిలువరించలేకపోతున్నారు..

తొలి 4 నెలల్లో 2,363 మరణాలు

  • ఆందోళన కలిగిస్తున్న రోడ్డు ప్రమాదాలు

  • సీఎం ప్రత్యేక దృష్టి... రాష్ట్రవ్యాప్తంగా ఏకరూప ట్రాఫిక్‌ విధానానికి కసరత్తు

హైదరాబాద్‌, మే 3(ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసు శాఖ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా వాటి సంఖ్యను నిలువరించలేకపోతున్నారు. అయితే రోడ్డు భద్రతపై గత నాలుగు నెలలుగా ‘అరైవ్‌ అలైవ్‌’ పేరిట పెద్దఎత్తున చేపట్టిన అవగాహన కార్యక్రమంతో రోడ్డు ప్రమాదాల్లో మరణాల శాతాన్ని దాదాపు 15 శాతం తగ్గించగలిగారు. గత ఐదేళ్ల గణాంకాలను పరిశీలిస్తే తొలి నాలుగు నెలల కాలంలో ఈ ఏడాది మరణాల శాతం తగ్గింది. అయితే, గాయపడిన వారి సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంది. ఈ ఏడాది తొలి నాలుగు నెలల్లో 9,313 రోడ్డు ప్రమాదాలు నమోదయ్యాయి. ఈ ప్రమాదాల్లో 2,363 మంది మరణించగా 8,850 మంది గాయపడ్డారు. గత ఏడాదితో పోలిస్తే రోడ్డు ప్రమాదాలు పెరిగినా, మరణాలు మాత్రం 15.3శాతం తగ్గినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2021లో తొలి నాలుగు నెలల్లో 7,316 ప్రమాదాలు జరగ్గా, 2,665 మంది ప్రాణాలు కోల్పోయారు. 2022లో ప్రమాదాల సంఖ్య స్పల్పంగా తగ్గినా మరణాలు పెరిగాయి. 2023లో మరణాలు 9 శాతం తగ్గాయి. 2024లో 9,042 ప్రమాదాలు, 2,791 మరణాలు సంభవించాయి. ఇది గత ఆరేళ్లలో అత్యధికంగా నమోదైన మరణాల సంఖ్యగా నిలుస్తోంది. గత ఏడాది పరిస్థితి స్థిరంగా కొనసాగినా, ఈ ఏడాది తొలి నాలుగు నెలల్లో ప్రమాదాలు అత్యధిక స్థాయికి పెరిగాయి. ‘అరైవ్‌ అలైవ్‌’లో చేపట్టిన ట్రాఫిక్‌ నియంత్రణ చర్యలు, రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు, అత్యవసర వైద్య సేవలు మెరుగుపడడం వల్లే మరణాల తగ్గుదల సాధ్యమైందని సీనియర్‌ పోలీసు అధికారులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో ప్రతి ఏటా సుమారు 7,500 మందికి పైగా రోడ్డు ప్రమాదాల్లో మరణించడం.. ఇది ప్రకృతి విపత్తుల్లో సంభవించే మరణాల కన్నా ఎక్కువ ఉండడాన్ని సీఎం రేవంత్‌ రెడ్డి తీవ్రంగా పరిగణిస్తున్నారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించడం, మరణాలు తక్కువగా ఉండేలా చూడటం కోసం రాష్ట్రవ్యాప్తంగా ఏకరూప ట్రాఫిక్‌ నిర్వహణ వ్యవస్థను తీసుకుని రావడానికి కసరత్తు జరుగుతోందని ఇటీవల డీజీపీ సీవీ ఆనంద్‌ స్పష్టం చేశారు.

Updated Date - May 04 , 2026 | 04:45 AM