ఈహెచ్‌ఎస్ ట్రస్టీ బోర్డు పునర్వ్యవస్థీకరణ
ABN , Publish Date - Jun 18 , 2026 | 06:33 AM
తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్‌ఎస్) అమలులో పారదర్శకతను పెంచేందుకు, పథకాన్ని మరింత సమర్థంగా అమలు చేసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది.
బోర్డులో ప్రభుత్వం నుంచి 17మంది ఉన్నతాధికారులు.. ఉద్యోగ సంఘాల నుంచి 10మంది
పెన్షనర్ల ప్రతినిధులుగా ముగ్గురు
మొత్తం 30 మందితో కొత్త బోర్డు
సీఎస్ నేతృత్వంలో కార్యకలాపాలు
ఈహెచ్‌ఎస్ అమలుకు మార్గదర్శకాలు రూపొందించాలని ప్రభుత్వం ఆదేశం
హైదరాబాద్, జూన్ 17 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్‌ఎస్) అమలులో పారదర్శకతను పెంచేందుకు, పథకాన్ని మరింత సమర్థంగా అమలు చేసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ ట్రస్ట్(ఈహెచ్‌సీటీ) ట్రస్టీల బోర్డును పునర్వ్యవస్థీకరించింది. ఇందులో ప్రభుత్వ అధికారులు, ఉద్యోగ సంఘాలు, పెన్షనర్ల ప్రతినిధులకు సముచిత ప్రాతినిధ్యం కల్పించింది. ఈ మేరకు బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. సీఎస్ ఆధ్వర్యంలోనే ఈ కొత్త ట్రస్టీ బోర్డును ఏర్పాటు చేశారు. ఈ బోర్డులో మొత్తం 30మంది సభ్యులున్నారు. ఇందులో ప్రభుత్వ ఉన్నతాధికారులు 17మంది, ఉద్యోగ సంఘాల నుంచి 10మంది, పెన్షనర్ల ప్రతినిధులు ముగ్గురు ఉన్నారు. ఈహెచ్‌ఎ్‌స అమలుకు సంబంధించి ఇదివరకు ఉన్న మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకుని, ఉద్యోగుల ఆరోగ్య కార్డుల జారీ విధానం, చికిత్స ేసవల మెరుగుదల అంశాలపై కొత్త మార్గదర్శకాలు రూపొందించాల్సిన బాధ్యతను సర్కారు ఈ బోర్డుపై పెట్టింది. ఈ బోర్డులో ప్రభుత్వ ఉన్నతాధికారులు.. ఆర్థిక, ఆరోగ్య, విద్య, హోం, సాధారణ పరిపాలన, పురపాలకశాఖ, పంచాయతీరాజ్, ఎస్సీ డెవల్‌పమెంట్, కార్మికశాఖ, మహిళా శిశుసంక్షేమ, న్యాయశాఖల సెక్రటరీలతో పాటు భూపరిపాలన కమిషనర్, వైద్యవిద్య సంచాలకుడు, సెర్ప్ సీఈవో, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవో, ఈహెచ్‌ఎస్ కన్వీనర్ ఉంటారు. ఉద్యోగ సంఘాల ప్రతినిధులుగా.. మారం జగదీశ్వర్(టీఎన్‌జీవో), ఏలూరి శ్రీనివాసరావు(టీజీవో),దామోదరరెడ్డి(పీఆర్‌టీయూ), చావా రవి(టీఎస్‌యూటీఎఫ్), శ్రీనివాసరెడ్డి(సెక్రటేరియట్ అసోసియేషన్), సదానందం గౌడ్(ఎస్‌టీయూ), రవీందర్ రెడ్డి( ట్రెసా), లచ్చిరెడ్డి( డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్), సైదులు(ఎస్టీఎఫ్),దాస్య నాయక్( కాస్ల ఫోర్త్ ఉద్యోగులు) ఉన్నారు. పెన్షనర్ల ప్రతినిధులుగా.. వెంకటరెడ్డి(టీఎస్‌జీఆర్‌ఈఏ), కృష్ణమూర్తి(టీఏపీఆర్‌పీఏ), ఆర్.ఉమాదేవి(మహిళా పెన్షనర్స్ అసోసియేషన్)లను సర్కారు నియమించింది. కొత్తగా ఏర్పాటైన ట్రస్టీ బోర్డు వెంటనే సమావేశం నిర్వహించి మార్గదర్శకాలను రూపొందించాలని ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
బోర్డులో మాకు ప్రాతినిధ్యమేదీ?
ఈహెచ్‌ఎ్‌సటీ ట్రస్టీ బోర్డులో తమ యూనియన్ ప్రతినిధులకు స్థానం కల్పించకపోవడం శోచనీయమని తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు స్థితప్రజ్ఞ అన్నారు. 2.6 లక్షల మంది సీపీఎస్ ఉద్యోగులు, ఉపాధ్యాయులున్న తమ సంఘానికి బోర్డులో చోటు కల్పించాలని డిమాండ్ చేశారు. జీవో నంబరు 40ని సవరించాలని కోరారు. 42 పింఛనర్ల సంఘాలతో సుమారు 2 లక్షల మంది పింఛన్‌దారులకు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ ప్రభుత్వ పింఛన్‌దారుల జేఏసీ ప్రతినిధులకు బోర్డులో స్థానం కల్పించలేదని, వెంటనే సంబంధిత జీవోను సవరించి అవకాశం కల్పించాలని జేఏసీ చైర్మన్ కె.లక్ష్మయ్య, ప్రధాన కార్యదర్శి టి.సత్యనారాయణ డిమాండ్ చేశారు. పదవీ విరమణ చేసిన గెజిటెడ్ అధికారుల సంఘానికి కూడా బోర్డులో అవకాశం కల్పించాలని ఆ సంఘం అధ్యక్షుడు మోహన్ నారాయణ కోరారు.