మెల్లగా రియల్ జోరు!
ABN , Publish Date - Feb 20 , 2026 | 01:26 AM
రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటోంది. రియల్ ఎస్టేట్ రంగం స్తబ్దుగా ఉందంటూ కొంతకాలం నుంచి జరుగుతున్న ప్రచారానికి..
ఫ్లాట్లు, ఓపెన్ ప్లాట్ల కొనుగోళ్లు పైపైకి..
గత ఏడాదితో పోల్చితే తొలి పది నెలల్లో రిజిస్ట్రేషన్ల ఆదాయం 6.02 శాతం వృద్ధి
ఓపెన్ ప్లాట్ల కొనుగోళ్లలో 16.61ు పెరుగుదల
రాష్ట్రవ్యాప్తంగా చూస్తే 7.61 శాతం వృద్ధి
హైదరాబాద్, ఫిబ్రవరి 19 (ఆంధ్ర జ్యోతి): రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటోంది. రియల్ ఎస్టేట్ రంగం స్తబ్దుగా ఉందంటూ కొంతకాలం నుంచి జరుగుతున్న ప్రచారానికి.. తాజా రిజిస్ట్రేషన్ గణాంకాలతో చెక్ పడుతోంది. 2024-25 జనవరిలో 11,312 దస్తావేజులు రిజిస్టర్‌కాగా, ఈసారి జనవరిలో ఈ సంఖ్య 11,941కి (5.56 శాతం) పెరిగింది. గత ఏడాది ఫ్లాట్ల రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.319.57 కోట్ల ఆదాయంరాగా.. ఈసారి రూ.348.78 కోట్లు సమకూరింది. ఇక ఓపెన్ ప్లాట్ల విభాగంలో ఎక్కువ వృద్ధి నమోదైంది. గత ఏడాది జనవరిలో రూ.214.01 కోట్ల ఆదాయంరాగా, ఈసారి రూ.361.50 కోట్ల (69ు అదనంగా) ఆదాయం వచ్చింది. 2024-25 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జనవరి వరకు ఫ్లాట్లకు సంబంధించి 1,25,990 దస్తావేజులు రిజిస్టర్‌కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో 1,30,787 దస్తావేజులు రిజిస్టర్ అయ్యాయి. ఆదాయపరంగా గత ఆర్థిక సంవత్సరం తొలి పది నెలల కాలంలో రూ.3,808 కోట్లురాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.4,037 కోట్లు (6.02శాతం అదనంగా) ఆదాయం వచ్చింది. మరోవైపు ఓపెన్ ప్లాట్లకు సంబంధించి 2024-25 తొలి పది నెలల్లో 3,98,862 దస్తావేజులు రిజిస్టరైతే (ఆదాయం రూ.2,543 కోట్లు).. 2025-26లో 4,06,140 దస్తావేజులు (ఆదాయం రూ.2,965 కోట్లు) రిజిస్టర్ అయ్యాయి. ఆదాయంలో 16.61 శాతం వృద్ధి నమోదైంది. ఇక ఇళ్ల కొనుగోలుకు సంబంధించి 2024-25 తొలి పది నెలల్లో 4,12,097 దస్తావేజులు (ఆదాయం రూ.2,831 కోట్లు) రిజిస్టర్‌కాగా, 2025-26లో ఇదేకాలానికి 4,14,117 దస్తావేజులు (ఆదాయం రూ.2,942 కోట్లు) రిజిస్టర్ అయ్యాయి. గత పది నెలల్లో మొత్తం మీద వృద్ధి 7.61 శాతంగా నమోదైంది.
ఆదాయంలో టాప్ జిల్లాలు ఇవే..
గత ఆర్థిక సంవత్సరం (2024-25) తొలి పది నెలలతో పోలిస్తే.. ప్రస్తుత (2025-26) ఆర్థిక సంవత్సరం తొలి పది నెలల్లో రంగారెడ్డి జిల్లాలో రిజిస్ట్రేషన్ల ఆదాయం 20.60 శాతం పెరిగింది. మహబూబ్‌నగర్‌లో 19.02 శాతం, మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 11.54 శాతం పెరిగింది. ఆదాయ వృద్ధిలో వెనుకబడిన హైదరాబాద్ సౌత్ రిజిస్ట్రేషన్ జిల్లాలో 16.98 శాతం ఆదాయం తగ్గింది. హైదరాబాద్‌లో 10.42 శాతం, నల్లగొండలో 8.79 శాతం తగ్గింది.