‘సాగు యాంత్రీకరణ’కు సిద్ధంగా ఉన్నాం
ABN , Publish Date - Oct 09 , 2026 | 05:08 AM
రాష్ట్రంలో వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వ వాటాతోనే పథకం అమలు
లబ్ధిదారుల ఎంపికపై అక్కడి నుంచి మార్గదర్శకాల రావడమే తరువాయి
ఎస్సీ, ఎస్టీ రైతులకు 60శాతంబీసీ, ఇతర రైతులకు 40శాతం సబ్సిడీ: తుమ్మల
హైదరాబాద్, అక్టోబరు 08 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రాష్ట్ర, కేంద్ర వాటాలతో పథకం అమలుకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టామని, లబ్థిదారుల ఎంపికకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం జారీ చేయాల్సిన మార్గదర్శకాల కోసం ఎదురుచూస్తున్నామని పేర్కొన్నారు. ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ రైతులకు 60 శాతం, బీసీ, ఇతర రైతులకు 40 శాతం చొప్పున రాయతీ అందించన్నుట్టు చెప్పారు. కేంద్ర మార్గదర్శకాలు అందిన వెంటనే పథకం అమలుచేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గురువారం సచివాలయంలో అధికారులతో తుమ్మల సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వం యాంత్రీకరణ పథకాన్ని పక్కన పెట్టిందని.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వ చ్చాక 2025-26 ఏడాది నుంచి యాంత్రీకరణ పథకాన్ని పునరుద్థరించి అమలు చేస్తున్నట్టు తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో పథకం అమలు కోసం రూ.71 కోట్లు కేటాయించగా, ఇప్పటివరకు రూ.63 కోట్లు ఖర్చు చేశామని, 2026-27 సంవత్సరానికి రూ.147.99 కోట్లు కేటాయించామని వివరించారు. రైతులకు అవసర మైన వ్యవసాయ పరికరాలను వారికి నచ్చిన ఎంప్యానెల్ చేసిన కంపెనీ వద్ద కొనుగోలు చేసుకునే వెసులుబాటు కల్పించాలని అధికారులకు సూచించారు. సబ్సిడీ మొత్తాన్ని నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్టు తెలిపారు.
ఎఫ్‌పీవోలను కస్టమ్ హైరింగ్ సెంటర్లుగా మార్చాలి..
యాంత్రీకరణ పథకం అమలులో ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్లను (ఎఫ్‌పీవోలను) భాగస్వాములను చేయాలని అధికారులకు మంత్రి సూచించారు. చిన్న, సన్నకారు రైతులు వ్యవసాయ పరికరాన్ని సొంతంగా కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండా, ఎఫ్‌పీవోల ఆధ్వర్యంలో కస్టమ్ హైరింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి వ్యవసాయ పరికరాలను రైతులకు అద్దెకు అందించే అవకాశాన్ని పరిశీలించాలని ఆదేశించారు. ఈ పథకాన్ని రైతులకు మరింత ఉపయోగకరంగా తీర్చిదిద్దేందుకు అన్నదాతల అభిప్రాయాలను కూడా తీసుకోవాలని సూచించారు. వచ్చే మంగళవా రం నిర్వహించే ‘రైతు నేస్తం’ కార్యక్రమంలో వ్యవసాయ యాంత్రీకరణ పథకంపై రాష్ట్రవ్యాప్తంగా రైతులు, ఎఫ్‌పీవోల ప్రతినిధులతో మాట్లాడి అభిప్రాయాలను సేకరించాలని చెప్పారు. రైతుల సూచనలను పరిగణనలోకి తీసుకుని, వారికి గరిష్ఠ ప్రయోజనం కలిగేలా పథకానికి తుదిరూపు ఇవ్వాలన్నారు. ఈ పథకం కింద 37 రకాల వ్యవసాయ పరికరాలను ఖరారు చేసినట్లు మంత్రి తెలిపారు. గతంలో 19 రకాల పరికరాలు మాత్రమే ఉండేవని, రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని వాటిని పెంచినట్లు చెప్పారు.