మీ బిల్డప్ కథలపై విచారణ జరుగుతోంది
ABN , Publish Date - Apr 02 , 2026 | 03:13 AM
రాష్ట్రంలో అద్దంలాంటి రోడ్లు వేసి పల్లెలకు పరిశ్రమలు తీసుకువచ్చి, ప్రజలకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు తాము కష్టపడుతుంటే.. బీఆర్‌ఎస్ నేతల గుండెలు అదురుతున్నాయని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి ...
ఆర్ అండ్ బీలో బీఆర్‌ఎస్ చేసిన నిర్వాకం త్వరలో బయటపెడతా
మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి అజ్ఞానానికి చింతిస్తున్నా : మంత్రి కోమటిరెడ్డి
హైదరాబాద్, ఏప్రిల్ 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అద్దంలాంటి రోడ్లు వేసి పల్లెలకు పరిశ్రమలు తీసుకువచ్చి, ప్రజలకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు తాము కష్టపడుతుంటే.. బీఆర్‌ఎస్ నేతల గుండెలు అదురుతున్నాయని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఆర్ అండ్ బీ శాఖపై మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి చేసిన ఆరోపణలకు కోమటిరెడ్డి ఒక ప్రకటనలో సమాధానమిచ్చారు. ‘ ప్రశాంత్‌రెడ్డి అజ్ఞానానికి చింతిస్తున్నా. మీ బడాయి బిల్డింగుల బిల్డప్ కథలపై విచారణ కొనసాగుతోంది మిత్రమా.. అర్ అండ్ బీలో బీఆర్‌ఎస్ చేసిన నిర్వాకాన్ని త్వరలోనే తెలంగాణ సమాజం ముందు పెడతా. రోడ్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్‌లో మీరు చేసిన అప్పుల గురించి చర్చిద్దామా? మీరు చేసిన అప్పులకు మేము వడ్డీలు చెల్లిస్తున్నాం. సీఎం రేవంత్ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తున్న ఆదరణను చూసి బీఆర్‌ఎస్ నేతల్లో రోజురోజుకు అసహనం పెరుగుతోంది’ అని విమర్శించారు. ఆర్ అండ్ బీలో ప్రస్తుతం పనులు జరగడంలేదని, హ్యామ్ విధానంలో రూ.8 వేల కోట్ల స్కామ్ జరుగుతోందని ప్రశాంత్‌రెడ్డి చేసిన ఆరోపణలు చూస్తుంటే.. ఆయనపై జాలేస్తోందని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. ఆర్ అండ్ బీ శాఖలో ప్రస్తుతం రూ.13,051 కోట్ల విలువైన పనులు వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. సచివాలయం నిర్మాణం రూ.617 కోట్లుగా అంచనావేస్తే, రూ.1,100 కోట్లు ఎలా అయిందని ప్రశ్నించారు. హ్యామ్ రోడ్లపై ఆరోపణలపై 2025 అక్టోబరు 25వ తేదీనే పూర్తి వివరణ ఇచ్చినట్లు గుర్తుచేశారు. అయినా మళ్లీ రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రూ.13,006 కోట్లతో 6,097 కి.మీ మేర రహదారులను హ్యామ్ విధానంలో నిర్మించనున్నట్టు తెలిపారు. తన రాజకీయ జీవితంలో అవినీతి మచ్చలేదని స్పష్టంచేశారు. తన శాఖలో అవినీతి జరిగినా చూస్తూ ఊరుకోబోమన్నారు.
గడ్డి మందుపై 60 రోజులు నిషేధం
పారాక్వైట్ గడ్డి మందును తెలంగాణలో 60 రోజులపాటు నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మందు మనుషుల ఆరోగ్యానికి, పశువులకు ప్రమాదకరంగా ఉండడంతో ఈ చర్య తీసుకున్నట్లు వ్యవసాయశాఖ విడుదల చేసిన జీవోలో పేర్కొంది. దీని అమ్మకం, నిల్వ, పంపిణీ, తయారీ, వినియోగం వంటి వాటిని పూర్తిగా నిషేధించినట్టు ఉత్తర్వుల్లో తెలిపింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వచ్చాయని.. అతిక్రమిస్తే కఠినచర్యలుంటాయని పేర్కొంది.