ఆయిల్‌పామ్‌లో మనమే టాప్
ABN , Publish Date - May 30 , 2026 | 04:25 AM
ఆయిల్ పామ్ సాగులో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా నిలిచింది. దేశవ్యాప్తంగా మొత్తంగా 2.73 లక్షల హెక్టార్లలో ఆయిల్‌పామ్ సాగవగా..
98,112 హెక్టార్ల సాగుతో దేశంలో ప్రథమస్థానం.. మొత్తం సాగు విస్తీర్ణంలో 36శాతం వాటా రాష్ట్రానిదే
రెండో స్థానంలో ఏపీ..
జాతీయ వ్యవసాయ సదస్సులో వెల్లడి
రాష్ట్ర వ్యవసాయ రంగానికి గర్వకారణం
ఈ ఏడాది అదనంగా 85 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు లక్ష్యం: తుమ్మల
కొత్తగూడెం/హైదరాబాద్, మే 29 (ఆంధ్రజ్యోతి): ఆయిల్ పామ్ సాగులో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా నిలిచింది. దేశవ్యాప్తంగా మొత్తంగా 2.73 లక్షల హెక్టార్లలో ఆయిల్‌పామ్ సాగవగా.. అందులో ఒక్క తెలంగాణలోనే 98,112 హెక్టార్ల సాగు ఉండటం గమనార్హం. శుక్రవారం ఢిల్లీలో జరిగిన జాతీయ వ్యవసాయ సదస్సులో రాష్ట్రాల వారీగా ఆయిల్ పామ్ సాగు వివరాలను కేంద్రం వెల్లడించింది. ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్’ పథకం కింద దేశవ్యాప్తంగా 6.50 లక్షల హెక్టార్లలో ఆయిల్ పామ్ సాగు చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. అందులో ఇప్పటివరకు 40శాతం సాధించింది. మొత్తంగా 15 రాష్ట్రాల్లో ఆయిల్ పామ్ సాగవుతుండగా.. తెలంగాణ ఏకంగా 36శాతం సాగుతో ప్రథమ స్థానంలో నిలిచింది. 97,871 హెక్టార్ల సాగుతో ఏపీ ద్వితీయ స్థానంలో ఉంది. 20,967 హెక్టార్లతో అరుణాచల్‌ప్రదేశ్, 14,032 హెక్టార్లతో అసోం తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఆయిల్ పామ్ సాగులో దేశంలోనే అగ్రస్థానంలో నిలవడం రాష్ట్ర వ్యవసాయ రంగానికి ఇది గర్వ కారణమని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఇది ఆయిల్ పామ్ సాగుకు ధైర్యంగా ముందుకొచ్చిన వేలాది మంది రైతుల విజయమని అభివర్ణించారు. వంట నూనెల దిగుమతుల భారాన్ని తగ్గించి, స్వయం సమృద్ధి సాధించాలన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యాలకు అనుగుణంగా ఆయిల్ పామ్‌ను ప్రోత్సహిస్తున్నట్టు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రోత్సాహకాలు, కోత పరికరాల కొనుగోలు కోసం ఎకరానికి రూ.51 వేల వరకు రాయితీ, వ్యవసాయ పనిముట్లను సబ్సిడీపై అందిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో 79,448 మంది రైతులు ఈ పంటను సాగుచేస్తున్నారని తెలిపారు. ఒకసారి తోటను ఏర్పాటు చేేస్త సుమారు 30 ఏళ్లపాటు ఏటా రూ.2, 3 లక్షల ఆదాయం పొందే అవకాశం ఉందని వివరించారు. ఆయిల్ పామ్ మార్కెటింగ్ కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుందని.. గెలలను కంపెనీలే నేరుగా కొనుగోలు చేస్తాయని, గిట్టుబాటు ధర వస్తుందని చెప్పారు. ప్రస్తుతం టన్ను ఆయిల్ పామ్ గెలల ధర రూ.23,501గా ఉందని.. కేంద్రం దిగుమతి సుంకాన్ని పునరుద్ధరిస్తే దేశ ఆయిల్ పామ్ రైతులకు మరింత మేలు జరుగుతుందని మంత్రి తుమ్మల అభిప్రాయం వ్యక్తంచేశారు. 2026-27లో అదనంగా 85 వేల ఎకరాల ఆయిల్ పామ్ సాగుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు.
పంట వ్యర్థాలను పొలాల్లో కాల్చివేయొద్దు
పంట వ్యర్థాలను పొలాల్లో కాల్చివేయవద్దని, వాటిని సేంద్రియ ఎరువుల తయారీలో వినియోగించాలని మంత్రి తుమ్మల రైతులకు సూచించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ హెచ్‌ఎండీఏ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన ఆర్గానిక్ మేళాలో స్టాల్స్‌ను సందర్శించి మాట్లాడారు. రైతులు సేంద్రియ వ్యవసాయం వైపు మొగ్గు చూపాలన్నారు.
కొడంగల్ నుంచి ఆయిల్‌పామ్ తోటలకు..
రాష్ట్రంలో ఆయిల్ పామ్ విస్తరణలో మహిళా సంఘాల సభ్యులను భాగస్వామ్యం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి తుమ్మల నిర్ణయించిన నేపథ్యంలో.. సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్ నుంచి దీనికి శ్రీకారం చుట్టే ఏర్పాట్లు ప్రారంభించారు. శుక్రవారం ఉద్యాన, వ్యవసాయ, ఆయిల్‌ఫెడ్ అధికారుల ఆధ్వర్యంలో కొడంగల్ నియోజకవర్గ పరిధిలోని కోస్గి, మద్దూర్, కొత్తపల్లి, గొండుమల్ మండలాలకు చెందిన 80మంది మహిళా సంఘాల సభ్యులను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లో ఆయిల్ పామ్ తోటలను పరిశీలించేందుకు తీసుకొచ్చారు. మక్తల్ నియోజకవర్గానికి చెందిన కొందరు రైతులను కూడా తీసుకొచ్చి అశ్వారావుపేట పరిసరాల్లోని ఆయిల్‌పామ్ క్షేత్రాలను, పామాయిల్ ఫ్యాక్టరీలను చూపించారు. ఆయిల్ పామ్ సాగు, యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పించారు.