ప్రజారోగ్యంపై చిన్నచూపు!
ABN , Publish Date - Apr 20 , 2026 | 05:26 AM
దేశంలో ప్రజారోగ్యంపై ప్రభుత్వాల ఖర్చు ఆశించిన స్థాయిలో లేదని, ముఖ్యంగా కొన్ని రాష్ట్రాల కేటాయింపులు అత్యల్పంగా ఉన్నాయని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తన నివేదికలో ఆందోళన వ్యక్తం చేసింది.
బడ్జెట్ కేటాయింపుల్లో అట్టడుగున తెలంగాణ
2022-25 మధ్య రాష్ట్ర బడ్జెట్‌లో కేవలం 4.1శాతం చొప్పునే కేటాయింపు
దేశంలో 27వ స్థానం
ఏపీ, కర్ణాటక, తమిళనాడు కన్నా వెనకే
11.4శాతంతో అగ్రస్థానంలో ఢిల్లీ
పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నివేదిక వెల్లడి
హైదరాబాద్, ఏప్రిల్ 19(ఆంధ్రజ్యోతి): దేశంలో ప్రజారోగ్యంపై ప్రభుత్వాల ఖర్చు ఆశించిన స్థాయిలో లేదని, ముఖ్యంగా కొన్ని రాష్ట్రాల కేటాయింపులు అత్యల్పంగా ఉన్నాయని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తన నివేదికలో ఆందోళన వ్యక్తం చేసింది. జాతీయ ఆరోగ్య విధానం-2017 (ఎన్‌హెచ్‌పీ) ప్రకారం.. ప్రతి రాష్ట్రం తన మొత్తం బడ్జెట్‌లో కనీసం 8 శాతానికి పైగా నిధులను ఆరోగ్య రంగానికి కేటాయించాలని సూచించగా, మెజారిటీ రాష్ట్రాలు ఈ లక్ష్యానికి ఆమడ దూరంలో ఉన్నాయని పేర్కొంది. ఢిల్లీ, పుదుచ్చేరి మాత్రమే 8శాతానికి మించి నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపింది. గత మూడేళ్లలో వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమానికి రాష్ట్రాల కేటాయింపుల తీరును వివరిస్తూ కమిటీ తన నివేదికను రాజ్యసభకు సమర్పించింది. తెలంగాణ గత మూడేళ్లలో ఏ ఒక్క ఏడాదీ మొత్తం బడ్జెట్‌లో 8 శాతం నిధులను ఆరోగ్య రంగానికి కేటాయించలేదు. 2022-25 మధ్య కాలంలో మూడు బడ్జెట్‌లను ప్రభుత్వం ప్రవేశపెట్టగా 4.1 శాతం చొప్పునే నిధులు కేటాయించినట్లు కమిటీ తన నివేదికలో పేర్కొంది. అంటే ఎన్‌హెచ్‌పీ సూచించిన దాంట్లో సగం మాత్రమే కేటాయిస్తూ వస్తోంది. ఈ విషయంలో తెలంగాణ 27వ స్థానంలో నిలిచింది.
టాప్‌లో దేశ రాజధాని
ఢిల్లీ ఎన్‌హెచ్‌పీ సూచించిన 8 శాతం కంటే ఎక్కువ నిధులు కేటాయించింది. 11.4 శాతంతో అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానంలో నిలిచిన పుదుచ్చేరి 8.7 శాతం కేటాయించింది. మూడో స్థానంలో ఒడిసా (8 శాతం), నాలుగో స్థానంలో గోవా (7.9 శాతం), ఐదో స్థానంలో మేఘాలయ (7.3 శాతం) ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ (6.4 శాతం), దక్షిణాదిలో కర్ణాటక (4.4 శాతం), తమిళనాడు (4.3 శాతం) కంటే కూడా తెలంగాణ తక్కువ కేటాయింపులు చేయడం గమనార్హం. అన్ని రాష్ట్రాల కేటాయింపుల సగటు చూస్తే 2022-23 ఆర్థిక సంవత్సరంలో 5.4 శాతం ఉండగా, 2023-24నాటికి కాస్త తగ్గి 5.3 శాతానికి చేరింది. ఇక 2024-25లో మళ్లీ పెరిగి 5.6 శాతానికి చేరుకున్నట్లు కమిటీ తన నివేదికలో పేర్కొంది.
ప్రజలపై వైద్య ఖర్చుల భారం
దేశ ప్రజలపై వైద్య ఖర్చుల భారం చాలా ఎక్కువగా ఉందని, ఇది 2013-14లో 67 శాతంగా ఉందని కమిటీ పేర్కొంది. 2021-22 నాటికి 45.1 శాతానికి తగ్గినా బ్రిక్స్, జీ-20 దేశాలతో పోలిస్తే చాలా ఎక్కువేనని తెలిపింది. ప్రజలు వైద్యానికి తమ జేబు నుంచి ఖర్చు చేస్తున్న డబ్బు (ఓఓపీఈ) మెక్సికో (41.4 శాతం)తో పోల్చేలా ఉన్నప్పటికీ, దక్షిణాఫ్రికా (6.6 శాతం), ఫ్రాన్స్ (9.2 శాతం) వంటి దేశాల కంటే చాలా ఎక్కువ. ఇక మధ్యస్థ, తక్కువ ఆదాయాలు కలిగిన నమీబియాలో ఓఓపీఈ 6.5 శాతం, రువాండాలో 5 శాతమే ఉందని నివేదిక పేర్కొంది. ఆ దేశాలు సమర్థవంతమైన కమ్యూనిటీ ఆధారిత బీమా ద్వారా ప్రజల ఆర్థిక భారాన్ని గణనీయంగా తగ్గించాయని తెలిపింది.
కమిటీ సిఫారసులు
ఊహించని వైద్య ఖర్చుల నుంచి ప్రజలను రక్షించడానికి కమిటీ పలు సిఫారసులు చేసింది. ప్రధానంగా ఆయుష్మాన్ భారత్‌తో పాటు రాష్ట్రస్థాయి ఆరోగ్య బీమా పథకాలను మరింత బలోపేతం చేయాలని సూచించింది. అలాగే అవుట్ పేషెంట్ కేర్, రోగ నిర్ధారణ పరీక్షలు, మందులపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొంది. ఆరోగ్య సూచికల్లో మెరుగైన పనితీరు కనబరిచిన రాష్ట్రాలకు అదనపు బడ్జెట్ కేటాయించాలని పేర్కొంది. అసంఘటిత రంగ కార్మికుల కోసం ప్రత్యేక బీమా నమూనాలు రూపొందించాలని సూచించింది.