తెలంగాణలో నడుస్తున్నది రామరాజ్యం
ABN , Publish Date - Apr 27 , 2026 | 05:17 AM
తెలంగాణలో ప్రస్తుతం రామరాజ్యం నడుస్తుంటే తెలంగాణ రాష్ట్ర సేన పార్టీ అధ్యక్షురాలు కవితకు ఏ రకంగా హిట్లర్ రాజ్యం కనిపిస్తోందని టీపీసీసీ క్రమశిక్షణా...
కవితకు హిట్లర్ రాజ్యం ఎలా కనిపిస్తోంది?
పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడొద్దు
కాంగ్రెస్ నాయకులకు మల్లు రవి సూచన
హైదరాబాద్,హనుమకొండ సిటీ, ఏప్రిల్ 26(ఆంధ్రజ్యోతి): తెలంగాణలో ప్రస్తుతం రామరాజ్యం నడుస్తుంటే తెలంగాణ రాష్ట్ర సేన పార్టీ అధ్యక్షురాలు కవితకు ఏ రకంగా హిట్లర్ రాజ్యం కనిపిస్తోందని టీపీసీసీ క్రమశిక్షణా చర్యల అమలు కమిటీ చైర్మన్, ఎంపీ మల్లు రవి ప్రశ్నించారు. గాంధీ భవన్‌లో ఆదివారం ఆయన అధ్యక్షతన కమిటీ సమావేశం జరిగింది. అనంతరం మీడి యా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి కర్కోటకుడు, రాష్ట్రంలో హిట్లర్ పాలన సాగిస్తున్నాడంటూ కవిత చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఆమె తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ లో పదేళ్ల పాటు కీలక పదవులు అనుభవించిన కవిత.. లిక్కర్ కేసులో అరెస్టయినప్పుడు ఆ పార్టీలో వారు సరిగా స్పందించలేదని బయటికి వచ్చారన్నారు. కాగా, మునిసిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేశారంటూ వచ్చిన ఫిర్యాదులపై పాలకుర్తి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేతలు హరిప్రసాద్, కృష్ణ కిశోర్‌లకు పది రోజుల్లో వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నట్లు చెప్పారు. పార్టీకి వ్యతిరేకంగా మీడియాలో మాట్లాడవద్దని సూచించారు. ఎవరికైనా ఇబ్బంది కలిగితే టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షీ నటరాజన్, ప్రభుత్వపరంగా సీఎం దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.
బీఆర్‌ఎస్ పాపాలను అప్పుడే ప్రశ్నించి ఉంటే.. కవితను ప్రజలు నమ్మేవారు: మహిళా కాంగ్రెస్
పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలోని పాపాలను అప్పుడే ప్రశ్నించి ఉంటే కవితను తెలంగాణ ప్రజలు నమ్మి ఉండేవారని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ అన్నారు. దోచుకున్న సొమ్ములో వాటా దొరక్కపోవడంతో ఆ పార్టీ నుంచి బయటికొచ్చిన కవిత.. తెలంగాణ సెంటిమెంటును వాడుకుంటున్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తన తండ్రి కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డి బాగా పాలన చేస్తున్నారని గతంలో మాట్లాడిన కవిత.. ఆ నోటితోనే రేవంత్‌ది రాక్షస పాలనంటూ మాట్లాడుతున్నారని, దీన్ని ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. ఇతర రాష్ట్రాల మద్యం వ్యాపారాల్లో తలదూర్చిన కవితకు తెలంగాణ ఆత్మగౌరవం గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. కవితపై వచ్చిన అవినీతి ఆరోపణలను తెలంగాణ సమాజంపై దాడిగా చిత్రించడం ఆపాలని, ఆ ఆరోపణలు వారి వ్యక్తిగత వ్యాపారాలకు సంబంధించినవని ఆమె పేర్కొన్నారు.
జాతీయ కులగణనలో బీసీ కాలమ్‌నూ చేర్చాలి: ఆది శ్రీనివాస్
జాతీయ కులగణనలో ఎస్సీ, ఎస్టీ కాలమ్‌లతో పాటు బీసీలకూ కాలమ్ చేర్చాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు. దేశంలోని బీసీ జన సంఖ్యను తేల్చాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు. బీసీ కులగణనలో తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్రం రోల్ మోడల్‌గా తీసుకోవాలని ఆయన సూచించారు.