Share News

రైతు డిస్కమ్‌కు వారం రోజుల్లోపు లైసెన్స్‌!

ABN , Publish Date - Jun 24 , 2026 | 04:00 AM

వారం రోజుల్లోపు తెలంగాణ రైతు విద్యుత్‌ పంపిణీ సంస్థ(రైతు డిస్కమ్‌)కు విద్యుత్‌ వ్యాపారానికి లైసెన్స్‌ను జారీ చేసే అవకాశాలున్నాయి. రాష్ట్రంలో ఉన్న...

రైతు డిస్కమ్‌కు వారం రోజుల్లోపు లైసెన్స్‌!

  • రెండు డిస్కమ్‌లకు సవరణ లైసెన్సులు కూడా..

వారం రోజుల్లోపు తెలంగాణ రైతు విద్యుత్‌ పంపిణీ సంస్థ(రైతు డిస్కమ్‌)కు విద్యుత్‌ వ్యాపారానికి లైసెన్స్‌ను జారీ చేసే అవకాశాలున్నాయి. రాష్ట్రంలో ఉన్న 30 లక్షల వ్యవసాయ పంపుసెట్లు, ఎత్తిపోతల పథకాల కనెక్షన్లు, మిషన్‌ భగీరథ, వాటర్‌బోర్డు, మున్సిపల్‌ వాటర్‌ కనెక్షన్లకు విద్యుత్‌ అందించడానికి వీలుగా గత మార్చి 19వ తేదీన లైసెన్స్‌ కోసం రైతు డిస్కమ్‌ తెలంగాణ విద్యుత్‌ నియంత్రణ మండలి(టీజీఈఆర్‌సీ)లో దరఖాస్తు పెట్టుకుంది. దీనిపై అభ్యంతరాలు, సూచనలు, సలహాలను ఈఆర్‌సీ స్వీకరించింది, గత మే 29వ తేదీన బహిరంగ విచారణ కూడా జరిగింది. అయితే తమ పరిధిలోని వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లతో పాటు ఎత్తిపోతల పథకాలు, మిషన్‌ భగీరథ, ఇతర ప్రభుత్వ, మున్సిపల్‌ నీటి సరఫరా అవసరాలకు సంబంధించిన విద్యుత్‌ కనెక్షన్లు రైతు డిస్కమ్‌కు బదలాయిస్తున్నామని, సవరణ లైసెన్సులు ఇవ్వాలని టీజీఎస్పీడీసీఎల్‌(దక్షిణ డిస్కమ్‌-హైదరాబాద్‌), టీజీఎన్పీడీసీఎల్‌(ఉత్తర డిస్కమ్‌-వరంగల్‌)లు పిటిషన్లు వేయగా.. వీటిపై కూడా అభిప్రాయ సేకరణ పూర్తయింది. దాంతో రైతు డిస్కమ్‌కు లైసెన్స్‌తో పాటు ఆ రెండు డిస్కమ్‌లకు సవరణ లైసెన్సులు ఇచ్చేలా వారంరోజుల్లోపు ఉత్తర్వులు వెలువడతాయని అధికార వర్గాలు వెల్లడించాయి.

Updated Date - Jun 24 , 2026 | 04:00 AM