Share News

పోలవరం ‘రెండో దశ ’ చేపట్టవద్దు

ABN , Publish Date - May 12 , 2026 | 04:38 AM

పోలవరం రెండో దశ నిర్మాణ పనులు చేపట్టరాదని తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఈ మేరకు పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ)కి, గోదావరి బోర్డుకు తెలంగాణ ఈఎన్‌సీ...

పోలవరం ‘రెండో దశ ’ చేపట్టవద్దు

  • పోలవరం ప్రాజెక్టు అథారిటీ, గోదావరి బోర్డుకు తెలంగాణ లేఖ

  • ప్రాజెక్టు ఎత్తును పెంచడంపై అభ్యంతరం

  • తెలంగాణలో ముంపు సమస్యపై ఆందోళన

హైదరాబాద్‌, మే 11 (ఆంధ్రజ్యోతి): పోలవరం రెండో దశ నిర్మాణ పనులు చేపట్టరాదని తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఈ మేరకు పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ)కి, గోదావరి బోర్డుకు తెలంగాణ ఈఎన్‌సీ(జనరల్‌) రమేశ్‌బాబు ఈనెల 5న లేఖ రాశారు. పోలవరం ప్రాజెక్టును తొలి దశలో 41.15 మీటర్ల ఎత్తుతో కడుతుండగా... రెండో దశలో 45.72 మీటర్ల ఎత్తుతో కట్టాలని తాజాగా నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంపై తెలంగాణ అభ్యంతరం తెలిపింది. పోలవరంలో 45.72 మీటర్ల ఎత్తుతో నీటిని నిల్వ చేస్తే తెలంగాణలో ముంపు సమస్య తీవ్రంగా ఉంటుందని రమేశ్‌బాబు లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. పోలవరం కారణంగా ఇప్పటికే తెలంగాణలోని 36 స్థానిక నదులు గోదావరిలో కలవకుండా ఆ నీరంతా వెనక్కి తన్నడంతో రాష్ట్రంలో 956 ఎకరాలు మునిగిపోతోందని, పలు సర్వేల్లోనూ దీన్ని గుర్తించారని తెలిపారు. ఎన్‌జీటీ ఆదేశాలతో క్షేత్రస్థాయిలో జరిగిన సర్వేలోనూ ఇది నిర్ధారణ అయిందన్నారు. గోదావరి ట్రైబ్యునల్‌ తీర్పు ప్రకారం ముంపు నుంచి రక్షణ చర్యలు చేపట్టే వరకు ఎటువంటి పనులు చేపట్టరాదని గుర్తు చేశారు. కాగా, పోలవరం ప్రాజెక్టు డెడ్‌ స్టోరేజీ(35.5 మీటర్ల నుంచి 32 మీటర్ల మధ్యలో) నిల్వ ఉండే 30 టీఎంసీలను కుడికాలువ ద్వారా తరలించడానికి వీలుగా చేపట్టిన పోలవరం ఎత్తిపోతల పథకాన్ని కూడా నిలిపివేయాలని తెలంగాణ డిమాండ్‌ చేసింది.

Updated Date - May 12 , 2026 | 04:38 AM