Share News

ప్రాజెక్టులు కళకళ

ABN , Publish Date - Aug 05 , 2026 | 05:06 AM

కృష్ణా బేసిన్‌లోని జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. ఈ ప్రాజెక్టుల్లోని నీటి నిల్వలు పెరుగుతున్నాయి. అయితే, ఎగువన ఉన్న ఆల్మట్టి జలాశయానికి వరద గణనీయంగా తగ్గింది.

ప్రాజెక్టులు కళకళ

  • శ్రీశైలానికి పెరుగుతున్న వరద.. 108 టీఎంసీలకు చేరిన నీటి నిల్వ

  • జురాల ప్రాజెక్టుకు 2.41 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

  • 513.10 అడుగులకు నాగార్జున సాగర్‌ నీటిమట్టం

  • మేడిగడ్డకు 1.74 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం

  • సోమవారం రాత్రి, మంగళవారం పలు జిల్లాల్లో దంచికొట్టిన వాన

  • కామారెడ్డిని ముంచెత్తిన వరద.. పెద్దవాగులో ఒకరి గల్లంతు

  • రాష్ట్రంలో నేడు, రేపు మోస్తరు వర్షాలు

( ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

కృష్ణా బేసిన్‌లోని జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. ఈ ప్రాజెక్టుల్లోని నీటి నిల్వలు పెరుగుతున్నాయి. అయితే, ఎగువన ఉన్న ఆల్మట్టి జలాశయానికి వరద గణనీయంగా తగ్గింది. మంగళవారం సాయంత్రం 6 గంటల సమయంలో ఆల్మట్టిలో 14,025 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా 149597 క్యూసెక్కులను దిగువకు వదిలిపెట్టారు. నారాయణపూర్‌ ప్రాజెక్టుకు 1,46,800 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా 1,47,776 క్యూసెక్కుల నీటిని దిగువకు విడిచిపెడుతున్నారు. తుంగ-భద్ర నదులపై ఉన్న తుంగభద్ర జలాశయానికి వచ్చే వరద క్రమంగా పెరిగింది. దీనికి 82 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రికార్డయింది. ఇక, ఆల్మట్టి నుంచి 1.50 లక్షల క్యూసెక్కులు, భీమా నది నుంచి 85 వేల క్యూసెక్కుల వరద వస్తుండటంతో జూరాల ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. జూరాల జలాశయానికి 2.41 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంటే 2.53 లక్షల క్యూసెక్కుల ఔట్‌ఫ్లో రికార్డయింది. ఇక శ్రీశైలలోకి భారీ ప్రవాహం (2.15 లక్షల క్యూసెక్కులు) కొనసాగుతోంది. 215.81 టీఎంసీల గరిష్ఠ నిల్వ సామర్థ్యానికి గాను మంగళవారం రాత్రి 8 గంటలకు 108.488 టీఎంసీల వరద వచ్చి చేరింది. నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులో మంగళవారం సాయంత్రానికి 513.10 అడుగుల (136.9932టీఎంసీలు) నీటిమట్టం నమోదైంది. పూర్తిస్థాయి నీటిమట్టం 590అడుగులు(312.0450 టీఎంసీలు) కాగా ఎగువనుంచి నీటి రాక లేదు. ఇక, గోదావరి బేసిన్‌లోని శ్రీపాద ఎల్లంపల్లికి 5,158 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుంటే 12,880 క్యూసెక్కులను పంపింగ్‌ చేస్తూ మిడ్‌ మానేరుకు తరలిస్తున్నారు. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు 22,222 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతుంది. ఈ ప్రాజెక్టులో 34.58 టీఎంసీల నిల్వ ఉంది.


నిజాంసాగర్‌ ప్రాజెక్టుకు 7,789 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతుంది. ఎగువన గోదావరిపై ఔరంగాబాద్‌ శివారులోని పైటన్‌లో ఉన్న జైక్వాడి ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 102.73 టీఎంసీలు కాగా 95.32 టీఎంసీల నిల్వ ఉంది. సమ్మక్కసాగర్‌(తుపాకులగూడెం)కు 3.50 లక్షల క్యూసెక్కుల వరద రాగా. దుమ్ముగూడెం(సీతమ్మసాగర్‌)కు 4.92 లక్షల క్యూసెక్కులు, మేడిగడ్డకు 1.74 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరింది. కాగా, హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు మూసీ ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో నిలకడగా కొనసాగుతోంది. 645అడుగులు(4.46టీఎంసీలు) పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం గల మూసీ ప్రాజెక్టు నీటిమట్టం మంగళవారం సాయంత్రానికి 638.20 అడుగులుగా (2.82టీఎంసీలు) నమోదైంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో మూసీ నది పొంగి ప్రవహిస్తోంది. వలిగొండ మండలంలోని భీమలింగం కత్వ వద్ద సంగెం-బొల్లేపల్లి వద్ద లోలెవల్‌ బ్రిడ్జి వద్ద మూసీ ఉధృతి వల్ల రాకపోకలు నిలిపేశారు.


40 మండలాల్లో దంచికొట్టిన వర్షం

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సోమవారం వర్షం దంచికొట్టింది. పలు చోట్ల సోమవారం రాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు వర్షాలు కురిశాయి. 40 మండలాల్లో అయితే భారీ నుంచి అతి భారీ వర్షం కురిసింది. వర్షాల దెబ్బకు పలు చోట్ల చెరువులు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. కామారెడ్డి జిల్లా పిట్లంలో అత్యధికంగా 14.1, కామారెడ్డిలో 13.7, బాన్స్‌వాడలో 13.5, మహహ్మద్‌నగర్‌లో 12.4, గాంధారిలో 10, కరీంనగర్‌ జిల్లా గన్నేరువరంలో 11, కొడంగల్‌లో 10.8, సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్‌లో 10.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కామారెడ్డిలో ఐదు గంటల వ్యవధిలో 182.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ దెబ్బకు సోమవారం ఆర్ధరాత్రి కామారెడ్డి పట్టణాన్ని వరద ముంచెత్తింది. రహదారులు, కాలనీలు జలమయం అయ్యాయి. ఆ జిల్లాలోని తాడ్వాయి, బాన్సువాడ, పిట్లం, గాంధారి, సదాశివనగర్‌, కామారెడ్డి మండలాల పరిధిలోని పంటలు నీటమునిగాయి. కామారెడ్డిలోని రామారెడ్డి రోడ్డులో అర్ధరాత్రి ఓ పెళ్లి బృందం బస్సు వరదలో చిక్కుకుపోయింది. పోలీసులు తాళ్ల సహాయంతో బస్సులోని ప్రయాణికులను బయటకు తీసుకువచ్చారు. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం రాంపల్లి కొండ తండాకు చెందిన దేవసోత్‌ శ్రీహరి(53) సోమవారం రాత్రి పెద్దవాగు దాటేందుకు యత్నించి గల్లంతయ్యాడు. కాగా, బుధ, గురువారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

వచ్చే రెండు వారాలు వర్షాలు!

న్యూఢిల్లీ, ఆగస్టు 4: దేశంలో నైరుతి రుతుపవనాలు వచ్చే రెండు వారాలు క్రియాశీలంగా ఉంటాయి. దేశంలో విస్తారంగా వర్షాలు కురిసేందుకు బంగాళాఖాతం, హిందూ మహాసముద్రంలలో మరింత అనుకూల వాతావరణం ఏర్పడుతోంది. దేశంలోని ఉత్తర, తూర్పు ప్రాంతాల్లో స్వల్పకాలిక వర్షాలు కురిపించే వ్యవస్థలు మరింత చురుకుగా మారుతున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ కారణాల వల్ల వచ్చే రెండు వారాలు దేశంలోని అనేక ప్రాంతాల్లో రుతుపవనాలు క్రియాశీలంగా ఉంటాయని అంచనాకు వచ్చారు.

Updated Date - Aug 05 , 2026 | 05:08 AM