వరుణ కటాక్షం కరువే
ABN , Publish Date - Apr 12 , 2026 | 04:13 AM
తెలంగాణలో ఈ ఏడాది 21 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదయ్యేందుకు అవకాశముందని.. కేవలం 12 జిల్లాల్లోనే సాఽధారణ స్థాయిలో వర్షాలు కురుస్తాయని ప్రైవేటు వాతావరణ నిపుణులు పేర్కొన్నారు...
ఈ ఏడాది 21 జిల్లాల్లో లోటు వర్షపాతం.. 12 జిల్లాల్లోనే సాధారణం
ప్రైవేటు వాతావరణ నిపుణుల అంచనా
నేడు, రేపు ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలకు
30 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్
వాతావరణశాఖ హెచ్చరిక
హైదరాబాద్, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణలో ఈ ఏడాది 21 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదయ్యేందుకు అవకాశముందని.. కేవలం 12 జిల్లాల్లోనే సాఽధారణ స్థాయిలో వర్షాలు కురుస్తాయని ప్రైవేటు వాతావరణ నిపుణులు పేర్కొన్నారు. రాబోయే జూన్ నుంచి సెప్టెంబర్ వరకు సాగే నైరుతి రుతుపవనాలకు సంబంధించి తాజా అంచనాలను వారు విడుదల చేశారు. ముఖ్యంగా ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదు కావచ్చని ‘తెలంగాణ వెదర్‌మ్యాన్’ విశ్లేషణలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రంలో జూన్ నుంచి సీజన్ ముగిసే వరకు సగటు సాధారణ వర్షపాతం 880 మి.మీ.గా ఉంటుంది. అయితే గత రెండేళ్లలో ఇంతకు మించి అధికంగా నమోదైంది. 2024-25 సంవత్సరంలో 1072 మి.మీ. నమోదు కాగా 2025-26లో 1198 మి.మీ. నమోదైంది. ముఖ్యంగా గతేడాది రికార్డు స్థాయిలో వర్షాలు కురిశాయి.
సాధారణ వర్షాలు కురిసే జిల్లాలివీ..
రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, కరీంనగర్, వరంగల్, హనుమకొండ, సిద్దిపేట, మెదక్, వికారాబాద్ జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదు కానుంది. దీనివల్ల ఖరీఫ్ సాగుకు సానుకూల పరిస్థితులు ఏర్పడనున్నాయి.
లోటు వర్షపాతం నమోదయ్యే ప్రాంతాలివే..
దక్షిణ తెలంగాణలోని కొన్ని జిల్లాలు, పశ్చిమ సరిహద్దు జిల్లాల్లో వర్షాలు కొంతమేర తక్కువగా ఉండొచ్చు. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, జోగులాంబ గద్వాల, వనపర్తి, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, జనగాం, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో కూడా సాధారణం కంటే తక్కువ వర్షాలు కురిసేఅవకాశం ఉందని తెలిపారు. కురవాల్సిన దాని కంటే మైనస్ 20-59 శాతం తక్కువగా వర్షం పడడాన్ని లోటు వర్షపాతంగా పిలుస్తారు. అంటే 21 జిల్లాల్లో 701 నుంచి 361 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఇక సాధారణమంటే +19 నుంచి - 19 వరకు కురిసే వర్షపాతం అన్నమాట. మొత్తానికి ఈ ఏడాది వరుణుడు తెలంగాణపై మిశ్రమ ఫలితాలను చూపించనున్నాడు.
నేడు, రేపు మండే ఎండలు
ఆది, సోమవారాల్లో 30 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్‌ను వాతావరణ శాఖ జారీ చేసింది. ముఖ్యంగా జగిత్యాల, పెద్దపల్లి, నిజామాబాద్ జిల్లాల్లో 43 డిగ్రీల వరకు చేరే అవకాశం ఉందని హెచ్చరించింది. శనివారం 30 జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం గుల్లకొటలో అత్యధికంగా 41.7 డిగ్రీలు నమోదైంది.