ఆగస్టులో 36 శాతం లోటు వర్షపాతం
ABN , Publish Date - Aug 31 , 2026 | 05:42 AM
భారీ వర్షాలు కురవాల్సిన ఆగస్టులో అంతంత మాత్రంగానే వర్షాలు పడటంతో తెలంగాణలో సగానికిపైగా జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది.
17 జిల్లాల్లో ఇదే పరిస్థితి
గతేడాది ఇదే నెలలో వదలకుండా వర్షాలు
హైదరాబాద్, ఆగస్టు 30(ఆంధ్రజ్యోతి): భారీ వర్షాలు కురవాల్సిన ఆగస్టులో అంతంత మాత్రంగానే వర్షాలు పడటంతో తెలంగాణలో సగానికిపైగా జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. 17 జిల్లాల్లో మైనస్ 29 నుంచి 60శాతం లోటు వర్షపాతం నమోదైంది. కేవలం 16 జిల్లాలోనే సాధారణ వర్షపాతం నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఏ ఒక్క జిల్లాలోనూ అత్యధిక వర్షపాతం నమోదు కాలేదు. రాష్ట్రంపై ఎల్‌నినో ప్రభావం చాలా తీవ్రంగా ఉందని ఇప్పటివరకు నమోదైన వర్షపాతం లెక్కలు వెల్లడిస్తున్నాయి. కాగా ఆగస్టులో రాష్ట్ర సగటు వర్షపాతం 215 మి.మీ. కాగా ఇప్పటివరకు కురిసింది కేవలం 133 మి.మీ. మాత్రమే. అంటే ఈ ఒక్క నెలలోనే 36శాతం లోటు వర్షపాతం నమోదైంది. కాగా గత ఏడాది ఇదే నెలలో వదలకుండా భారీ వర్షాలు కురిశాయి. నిరుడు ఆగస్టులో ఏకంగా 377 మి.మీ. వర్షపాతం రికార్డు అయింది. గత ఏడాది ఇదే నెలతో పొల్చితే ఈ ఏడాది ఆగస్టులో ఏకంగా 65శాతం లోటు వర్షపాతం నమోదైంది. అలాగే ఈ ఏడాది జూన్ నుంచి ఇప్పటివరకు రాష్ట్ర సగటు వర్షపాతం 565 మి.మీ. కాగా ఈ ఏడాది అది కేవలం 472 మి.మీ.కే పరిమితమైంది. గతేడాది ఇదే సమయానికి అది ఏకంగా 719 మి.మీ. కురిసి రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. హన్మకొండ, వరంగల్, జనగాం, గద్వాల, యాదాద్రి, భద్రాద్రి కొత్తగూడెం, మేడ్చల్, సూర్యాపేట, ఖమ్మం, వనపర్తి, మహబూబాబాద్, నల్గొండ, ఆదిలాబాద్, నాగర్ కర్నూల్, నారాయణపేట, హైదరాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది.
నేడు, రేపు తేలికపాటి వర్షాలు
తెలంగాణలో కొన్ని చోట్ల సోమ, మంగళ వారాల్లో తేలికపాటి నుంచి కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గడచిన 24 గంటల్లో కరీంనగర్ జిల్లా గంగాధరలో 2.9, పెద్దపల్లి జిల్లా ఎలిగేడులో 2.8 సెం.మీ. వర్షపాతం నమోదైనట్లు వెల్లడించింది.