తీవ్ర వర్షాభావం
ABN , Publish Date - Aug 17 , 2026 | 06:02 AM
తెలంగాణలో వర్షాభావ పరిస్థితులు క్రమంగా తీవ్రతరమవుతున్నాయి. ఆగస్టు నెలలో ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 31 శాతం లోటు వర్షపాతం నమోదైంది.
రాష్ట్రంలో ఈ నెలలో 31శాతం లోటు వర్షపాతం
15 జిల్లాల్లో ఇవే పరిస్థితులు
హైదరాబాద్, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో వర్షాభావ పరిస్థితులు క్రమంగా తీవ్రతరమవుతున్నాయి. ఆగస్టు నెలలో ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 31 శాతం లోటు వర్షపాతం నమోదైంది. మొదటి పక్షం రోజుల్లో సాధారణ వర్షపాతం 114 మిల్లీమీటర్లు కాగా.. 79 మిల్లీమీటర్ల వర్షమే కురిసినట్టు అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అంటే ఈ నెలలో ఇప్పటికే 31 శాతం లోటు వర్షపాతం నమోదైంది. జూలై 31 నాటికి లోటు వర్షపాతం ఉన్న జిల్లాలు 12 ఉండగా.. ఆగస్ట్ 15 నాటికి వీటి సంఖ్య 15కు పెరిగింది. రాష్ట్రంలో 621 మండలాలకు గాను, 256 చోట్ల 20 నుంచి 59 శాతం లోటు వర్షపాతం నమోదైంది. మరో 8 మండలాల్లో 60-99 శాతం తీవ్ర లోటు వర్షపాతం రికార్డు అయింది. కేవలం 4 మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదు అవ్వగా, 90 చోట్ల అధిక, మరో 263 మండలాల్లో సాధారణ వర్షం కురిసినట్లు ప్రణాళిక విభాగం గణాంకాలు వెల్లడించాయి. ముఖ్యంగా గత నెలలో సగటు వర్షపాతం నమోదైనప్పటికీ... ఆగస్టులో మాత్రం ఆశించిన స్థాయిలో వర్షాలు పడటం లేదు. నాగర్‌కర్నూల్, నల్గొండ, ఆదిలాబాద్, నారాయణపేట్, వనపర్తి, గద్వాల, సూర్యాపేట, భువనగిరి, కొత్తగూడెం, మహబూబాబాద్, మేడ్చల్, ఖమ్మం, జనగామ, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో మాత్రమే అధిక వర్షపాతం రికార్డు అవ్వగా, మిగిలిన జిల్లాల్లో సాధారణ వర్షం కురిసింది. కాగా, రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ సోమ, మంగళవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు కొత్తగూడెం జిల్లాలోని ముల్కలపల్లిలో అత్యధికంగా 3.5సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు పేర్కొంది.