Water Dispute: టెలిమెట్రీల సొమ్ము మళ్లిస్తారా.. ఇదేం తీరు?
ABN , Publish Date - Jan 08 , 2026 | 03:58 AM
కృష్ణా జలాల లెక్క పక్కాగా తీయాలనే ఉద్దేశంతో, ప్రత్యేకంగా సమకూర్చిన నిధులను ఏ విధంగా ఇతర అవసరాలకు మళ్లిస్తారని తెలంగాణ ప్రశ్నించింది.
నీటి లెక్కలు తీయడం కోర్టు ధిక్కారమెలా అవుతుంది?
నీటి కేటాయింపులు వేరు.. నీటి లెక్కలు వేరు
కృష్ణాబోర్డుపై తెలంగాణ ఆగ్రహం
హైదరాబాద్, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): కృష్ణా జలాల లెక్క పక్కాగా తీయాలనే ఉద్దేశంతో, ప్రత్యేకంగా సమకూర్చిన నిధులను ఏ విధంగా ఇతర అవసరాలకు మళ్లిస్తారని తెలంగాణ ప్రశ్నించింది. నీటి కేటాయింపులు వేరు? నీటి లెక్కలు వేరు? నీటి లెక్కలు తీసే టెలిమెట్రీలు పెట్టడం ఏ విధంగా కోర్టు ధిక్కారం అవుతుందని ఆక్షేపించింది. రెండో దశలో కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల వివిధ కాంపోనెంట్ల వద్ద టెలిమెట్రీలు పెట్టడం సబ్ జ్యుడిస్ అవుతుందని, వీటిని పెట్టే విషయంలో ఏపీ అభ్యంతరాలు తెలుపుతుందనే కారణాలు చెప్పి... ప్రత్యేకంగా టెలిమెట్రీల కోసం సమకూర్చిన నిధులను ఇతర అవసరాలకు మళ్లించడంపై తెలంగాణ ఆగ్ర హంతో ఉంది. దాంతో బోర్డు తీరును ఆక్షేపిస్తూ లేఖ రాయాలని ప్రభుత్వం నిర్ణయించింది. శ్రీశైలం, సాగర్ జలాశయాల్లోని ప్రతీ కాంపోనెంట్ వద్ద టెలిమెట్రీ కేంద్రాలు ఏర్పాటు చేసి, తరలించే నీటి లెక్కలు తీయాల్సిందేనని తెలంగాణ కొంతకాలంగా పట్టుబడుతోంది. దీనికోసం ఇప్పటికే ఒకటో దశ టెలిమెట్రీలు ఉన్నప్పటికీ మరిన్ని కాంపోనెంట్ల కింద రెండో దశలో టెలిమెట్రీలు పెట్టాలని తెలంగాణ కోరుతున్న విషయం విదితమే. దాంతో రెండో దశలో టెలిమెట్రీ కేంద్రాలు ఏర్పాటు చేయడానికి ఏపీ నిధులు ఇచ్చేందుకు విముఖత చూపితే... ఆ నిధులన్నీ తామే భరిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించడమే కాకుండా.. రూ.4.15 కోట్లను బోర్డుకు విడుదల చేశారు. దాంతో టెండర్ల ప్రక్రియ అంతా పూర్తయి, కేంద్రాలు పెట్టే క్రమంలో ఈ ప్రక్రియను కొత్తగా బోర్డుకు సభ్యుడిగా వచ్చిన కమల్‌కుమార్ జంగిడ్ అడ్డుకున్న విషయం విదితమే. కృష్ణా ట్రైబ్యునల్ -2 తీర్పుపై సుప్రీంకోర్టులో కేసు ఉండటం, తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలపై స్పష్టత లేకపోవడం, జస్టిస్ బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యునల్‌లో విచారణ జరుగుతుండటంతో తదుపరి టెలిమెట్రీలు పెట్టడం కోర్టు ధిక్కారం అవుతుందని బోర్డు గుర్తు చేసిన విషయం విదితమే. నీటి లెక్కలు తీసే టెలిమెట్రీలుపెట్టడం ఏ విధంగా కోర్టు ధిక్కారం అవుతుందని, అదే జరిగితే తొలిదశలో ఇప్పటికేపెట్టిన టెలిమెట్రీలు తొలగిస్తారా.? అని ఆక్షేపించింది. ఇక శ్రీశైలం, సాగర్‌లో రెండో దశలో 9చోట్ల టెలిమెట్రీల కోసం రూ.7.01 కోట్లు అవుతాయని బోర్డు గతంలోనే అంచనా వేసింది.
ఈ నిధులను నిబంధనల ప్రకారం చెరిసగం నిధులు తెలుగు రాష్ట్రాలు సమకూర్చాలి. ఏపీ ముందుకు రాకపోవడంతో నిధులన్నీ భరించడానికి తెలంగాణ ముందుకు రావడమే కాకుండా 4.15కోట్లను బోర్డుకు విడుదల చేిసిన విషయం విదితమే. శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్(ఎ్‌సఆర్‌ఎంసీ)లో భాగంగా పోతిరెడ్డిపాడు(ఏపీ), నాగార్జునసాగర్ కుడికాలువ(ఏపీ), సాగర్ ఎడమకాలువ(నల్గొండ), పాలేరు రిజర్వాయర్ ఎగువన(ఖమ్మం), సాగర్ ఎడమకాలువ తెలంగాణ-ఏపీ సరిహద్దు ప్రాంతం(కృష్ణా జిల్లా-ఏపీ), పోలవరం కాలువ కలిసే ప్రాంతం(కృష్ణా-ఏపీ), ప్రకాశం బ్యారేజీ వెస్ట్ మెయిన్ కెనాల్ (కృష్ణా-ఏపీ), ప్రకాశఽం బ్యారేజీ ఈస్ట్ మెయిన్ కెనాల్ (కృష్ణా-ఏపీ). కర్నూలు-కడప కెనాల్(కేసీ కెనాల్-కర్నూలు)లలో సైడ్ లుకింగ్ డాప్లర్ కరెంట్ ప్రొఫైలర్(ఎ్‌సఎల్‌డీసీపీ) టెలిమెట్రీ కేంద్రాలు పెడితే నీటి తరలింపు లెక్కలు పక్కాగా చేతికి వస్తాయని ప్రభుత్వం పెట్టుకున్న ఆశలపై బోర్డు వైఖరి నీళ్లు చల్లినట్లయింది. దాంతో బోర్డు వైఖరిని తప్పుపడుతూ లేఖరాయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. త్వరలోనే లేఖ బోర్డుకు చేరనుంది.