Share News

తొలి త్రైమాసికంలో 18,900 కోట్ల అప్పు!

ABN , Publish Date - Apr 07 , 2026 | 05:02 AM

రాష్ట్ర ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో (ఏప్రిల్‌-జూన్‌) బహిరంగ మార్కెట్‌ ద్వారా రూ.18,900 కోట్ల రుణాలు సేకరించాలని నిర్ణయించింది.

తొలి త్రైమాసికంలో 18,900 కోట్ల అప్పు!

  • నేడే రూ.3,900 కోట్ల సేకరణ

  • రాష్ట్ర ప్రభుత్వ అప్పుల ప్రణాళిక సిద్ధం

  • కొత్త పద్ధతిలో అప్పుల వేలం.. పైలట్‌ ప్రాజెక్టుగా ‘బీఐఎస్‌’ విధానం

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో (ఏప్రిల్‌-జూన్‌) బహిరంగ మార్కెట్‌ ద్వారా రూ.18,900 కోట్ల రుణాలు సేకరించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా మంగళవారం రూ.3,900 కోట్ల రుణాన్ని తీసుకోనుంది. ఈ మేరకు తొలి త్రైమాసికంలో దేశంలోని పలు రాష్ట్రాలు తీసుకునే అప్పుల వివరాలను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) సోమవారం ప్రకటించింది. దీని ప్రకారం.. ఈ మూడు నెలల కాలంలో పలు తేదీల్లో మొత్తం ఆరు సార్లు వేలం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఏప్రిల్‌లో రూ.6,900 కోట్లు, మేలో రూ.6,000 కోట్లు, జూన్‌లో రూ.6,000 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం తీసుకోనుంది. ఈసారి రుణ సేకరణ ప్రక్రియలో ఆర్‌బీఐ ‘బెంచ్‌మార్క్‌ ఇష్యూయెన్స్‌ స్ట్రాటజీ (బీఐఎస్‌)’ అనే సరికొత్త పైలట్‌ విధానాన్ని ప్రవేశపెట్టింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సహా దేశంలోని 9 రాష్ట్రాలను ఈ విధానం కోసం ఎంపిక చేశారు. సాధారణంగా అప్పు తీసుకునే సమయంలో దాని కాల పరిమితిపై రాష్ట్రాలకు, రుణదాతలకు మధ్య చర్చలు జరుగుతుంటాయి. ఈ కొత్త బీఐఎస్‌ పద్ధతిలో రుణ కాల పరిమితిని ఆర్‌బీఐ ముందుగానే నిర్ణయిస్తుంది. దీనివల్ల పెట్టుబడిదారులకు రాష్ట్రాలపై నమ్మకం పెరగడమే కాకుండా, వేలం ప్రక్రియ మరింత పారదర్శకంగా, వేగంగా సాగుతుందని ఆర్థిక శాఖ అధికారులు భావిస్తున్నారు.

Updated Date - Apr 07 , 2026 | 05:02 AM